నేపాల్‌లో ఇటీవలి జెన్ జడ్ ఉద్యమంలో చెలరేగిన హింసాకాండలో మృతుల సంఖ్య 51కి చేరుకుంది. మృతులలో కొందరు మంటలలో చిక్కుకుని సజీవ దహనం చెందారు. ఉత్తర ప్రదేశ్‌లోని గజియాబాద్ నివాసి 57 సంవత్సరాల మహిళ రాజేష్ గోలా ఖాట్మండులోని హ్యాత్ రిజెన్సీ హోటల్లో బస చేసిన దశలో మృతి చెందారు.ఆమె వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఎక్కువ మంది యాత్రికులు ఉంటున్న ఈ హోటల్‌కు నిరసనకారులు నిప్పుపెట్టారు. బయటపడే ఆమె నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. భర్త రాంవీర్ సింగ్ గోలాతో కలిసి ఆమె నేపాల్ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 7వ తేదీన హోటల్లో ఉండగా దుర్ఘటన జరిగింది. తగులబడుతున్న హోటల్ గదుల్లో నుంచి టూరిస్టులను బయటకు తీసుకువచ్చేందుకు సిబ్బంది యత్నించింది.
పై అంతస్తుల్లోని వారు కిటికీల నుంచి కిందికి దూకేందుకు పరుపులు అమర్చారు. ఈ క్రమంలో భర్త సురక్షితంగానే బయటపడ్డా, ఈ మహిళ తీవ్రగాయాలతో తరువాత చనిపోయారు. తల్లి మరణంపై కుమారుడు విశాల్ ఆవేదనతో స్పందించారు. మంటలు చెలరేగిన దశలో తల్లి తండ్రి ఒకరికొకరు దూరం అయ్యారని, తన తండ్రితో కలిసి ఉండి ఉంటే ఆమె సురక్షితంగా బతికేదేమో అని తెలిపారు. నేపాల్ హింసాకాండలో మృతుల సంఖ్య ఇతర వివరాలను ఖాట్మాండూ సీనియర్ పోలీసు అధికారి రమేష్ థాపా , నేపాల్ పోలీసు వర్గాల అధికార ప్రతినిధి హోదాలో విలేకరులకు తెలిపారు. భారతీయ మహిళ కూడా మృతుల్లో ఉన్నారని నిర్థారించారు. స్థానిక త్రిభువన్ యూనివర్శిటీ సంబంధిత ఆసుపత్రిలో కనీసం 36 భౌతిక కాయాలను భద్రపరిచి ఉంచారు.
పోస్టు మార్టం తరువాత బంధువులకు అప్పగిస్తారని పోలీసు అధికారి తెలిపారు. మృతులలో ముగ్గురు పోలీసులు ఇతరులు నేపాల్ పౌరులు ఉన్నారు. సోమవారం జెన్ జడ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు పార్లమెంట్ భవనం వెలుపల ఉధృతస్థాయిలో జరిగాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది మృతి చెందారని, వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే అని పోలీసు అధికార ప్రతినిధి చెప్పారు.
Also Read: భయపెట్టిన ‘కిష్కింధపురి’