బ్లాక్‌బస్టర్ మూవీ ‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జ మరోసారి సూపర్ హీరో పాత్ర పోషించిన చిత్రం మిరాయ్. సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని రూపొందిం చిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిరాయ్’ అంచనాలను అందు కుందా? తెలుసుకుందాం.
కథ: కళింగ యుద్ధంలో గెలిచిన అశోక చక్రవర్తి.. జరిగిన ప్రాణ నష్టానికి చింతించి తన దగ్గరున్న దైవ శక్తిని తొమ్మిది గ్రంథాల్లోకి పంపించి వాటిని మంచి కోసం వినియోగించమని ఆదేశిస్తూ తొమ్మిది మంది యోధులకు అప్పగిస్తాడు.
ఆ తొమ్మిదిమంది తమ తర్వాతి తరాలకు ఆ గ్రంథాలను వారసత్వంగా అందిస్తూ ప్రపంచాన్ని కాపాడుతుంటారు. అయితే వందల ఏళ్ల తర్వాత ఈ తొమ్మిది గ్రంథాల శక్తితో ప్రపంచాన్ని శాసించాలనే దుర్బుద్ధితో మహావీర్ నామా (మంచు మనోజ్).. ఒక్కో గ్రంథాన్ని చేజిక్కించుకోవడం మొదలుపెడతాడు. మరి ఈ తొమ్మిది గ్రంథాలూ అతడి సొంతం అయ్యాయా.. అతడిని అడ్డుకోవడానికి వచ్చిన వేద (తేజ సజ్జ) నేపథ్యమేంటి.. వీరి మధ్య పోరులో అంతిమ విజేత ఎవరు.. అన్నది మిగతా కథ.
కథనం, విశ్లేషణ: దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఎంచుకున్న కథ, తన విజన్ ఈ సినిమాలో గ్రాండ్ గా కనిపిస్తాయి. ఒక ఆసక్తికరమైన నేపథ్యాన్ని ఎంచుకొని భారీ విజువల్స్‌తో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు.
దైవ భక్తి వర్సస్ దుష్ట శక్తి నేపథ్యంలో పురాణాలతో ముడిపెట్టి రాసిన ఆసక్తికర కథకు.. బిగువైన కథనం, బలమైన పాత్రలు, చక్కటి నటనలు, వావ్ అనిపించే విజువల్స్.. రోమాంచితమైన సంగీతం.. ఇలా అన్నీ తోడవడంతో ‘మిరాయ్’ విజువల్ వండర్‌గా తయారైంది. ఎంతో కసరత్తు చేసిన కథ, ముఖ్య పాత్రలను తీర్చిదిద్దుకున్న విషయం తెరపై స్పష్టంగా అర్థమవుతుంది. తొమ్మిది గ్రంథాలకు సంబంధించి కథా నేపథ్యం ఆరంభంలోనే సినిమాపై ఆసక్తినిరేకెత్తిస్తుంది. అయితే దాన్ని మించి ఈ గ్రంథాలను చేజిక్కించుకుని ప్రపంచాన్ని ఏలాలనుకునే వ్యక్తి కథ ‘మిరాయ్’లో హైలైట్‌గా నిలుస్తుంది. మంచు మనోజ్ చేసిన మహావీర్ నామా అనే ఆ పాత్రే సినిమాకు ఆయువుపట్టు. ముందు మామూలు విలన్ పాత్రలాగే అనిపించినప్పటికీ.. దశల వారీగా ఆ క్యారెక్టర్ వెనుక కథను చెప్పిన తీరు ఆకట్టుకుంది.
హీరో తేజ సజ్జకు చేతికి వచ్చే మిరాయ్ అనేది ఒక ఆయుధం. దాన్ని కాపాడే భారీ పక్షి అవతారం అయిన సంపాతిని హీరో ఢీకొట్టి మిరాయ్‌ని దక్కించుకునే ఎపిసోడ్ ప్రథమార్ధానికి హైలైట్. ఈ ఎపిసోడ్ విజువల్ గా సినిమాను మరో స్థాయికి వెళ్తుంది. ఇక్కడి నుంచి చివరి వరకు హీరో పాత్ర చేసే అడ్వెంచర్స్ ద్వితీయార్ధాన్ని రసవత్తరంగా మార్చాయి. పతాక సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. తేజ సజ్జ తన అద్బుత నటనతో ప్రేక్షకులను అలరించాడు. హీరోయిన్ రితిక నాయక్ ఆకట్టుకుంది. ప్రధాన పాత్రల్లో శ్రియా, జగపతిబాబు, జయరాం లాంటి సీనియర్ నటులు తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాతో కార్తీక్ ఘట్టమనేని రచయితగా, దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు.
Also Read : సందేశభరిత వినోదాత్మక చిత్రం