ప్రపంచ దేశాల బలహీనతలను ఆసరా చేసుకుని వాటిని పాదాక్రాంతం చేయడం, అక్కడ ఉన్న సహజ వనరులను కొల్లగొట్టడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుత అజెండాగా మారింది. గత కొన్నాళ్లుగా జరుగుతున్న సంఘటనలను పరిశీలిస్తే నియంతగా ట్రంప్ దురాక్రమణ చర్యలకు పాల్పడుతున్నారని స్పష్టమవుతోంది. పనామా కాలువ, గ్రీన్‌ల్యాండ్, ఉక్రెయిన్ తమకు దాసోహం అయ్యేలా ట్రంప్ ఎత్తుగడలు ఫలింపచేసుకున్నారు. ఆయా దేశాల్లో ఉండే, రేర్ మినరల్స్ (అరుదైన ఖనిజాలు), చమురు, గ్యాస్ నిక్షేపాలను కొల్లగొట్టే ప్రణాళికలను రూపొందించుకున్నారు. ఇప్పుడు తాజాగా వెనెజువెలా దేశంపై దండెత్తడానికి సమర సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు కరేబియన్ సముద్రంలో భారీఎత్తున యుద్ధనౌకలు, జలాంతర్గాములు, ఫైటర్జెట్లు మోహరించి ఉన్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయని పసిగట్టిన వెజెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో కూడా యుద్ధాన్ని ఎదుర్కోడానికి సర్వసన్నాహాలు చేస్తున్నారు.
భారీ సంఖ్యలో లక్షలాది మంది పౌరులను సైన్యంలో చేర్చుకుంటున్నారు. దాదాపు 80 లక్షల మంది పౌరులను యుద్ధానికి సిద్ధం చేసినట్టు ప్రకటించారు. దాదాపు 25 వేల మంది సైనికులను కొలంబియా సరిహద్దులకు, చమురు శుద్ధి కర్మాగారాల ప్రాంతాలకు, సముద్ర తీరానికి తరలించడమే కాకుండా దేశవ్యాప్తంగా డ్రోన్లు ఎగురవేయడంపై ఆంక్షలు విధించారు. దేశంలో అమెరికా వ్యతిరేక భావనలను ముందుకు తేవడంతోపాటు పరిసర దేశాల మద్దతు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాతో పోలిస్తే వెనెజువెలా సైన్యం చాలా చిన్నది. 1,23,000 మంది సైనికులు, 8 మంది రిజర్విస్టులు, 2,20,000 మంది పౌర సైన్యం ఉంది. గతంలో మిత్రదేశంగా ఉన్న సమయంలో వెనెజువెలాకు అమెరికా నాల్గవతరం ఎఫ్16 యుద్ధ విమానాలను సరఫరా చేసింది. సుఖోయ్ 30, 198ం నాటి ఎఫ్16, ఇరాన్ డ్రోన్లు ఉన్నాయి.
మొత్తం 229 యుద్ధ విమానాలున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఆయుధ నిల్వలు కలిగిన అమెరికా వద్ద వివిధ రకాల 13,000 విమానాలు ఉన్నాయి. చైనా, రష్యాతో సంబంధాలున్నా అవి ఎంతవరకు వెనెజువెలాను ఆదుకుంటాయో చెప్పలేం. అయితే మదురో ప్రభుత్వాన్ని కూల్చడం తమ లక్షం కాదని, మాదకద్రవ్యాల రవాణాను అరికట్టడానికే భారీ సన్నాహాలు చేస్తున్నామని ట్రంప్ ప్రభుత్వం నమ్మించడానికి ప్రయత్నిస్తోంది. కానీ వెనెజువెలా నుంచి అమెరికాను మాదకద్రవ్యాలు ముంచెత్తుతున్నాయని ట్రంప్ చెబుతున్నారు. మాదకద్రవ్యాల ముఠాలతో వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు కూడా సంబంధాలున్నాయని ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా ఆరోపిస్తోంది. ఆయనను పట్టించే సమాచారం ఇస్తే ఏకంగా 50 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.430 కోట్లు) బహుమతి ఇస్తామని ప్రకటించింది కూడా.
కేవలం మాదకద్రవ్యాల ముఠాలను పట్టుకోవడానికి యుద్ధ స్థాయిలో అమెరికా భారీ ఎత్తున యుద్ధనౌకలను, వేలాది మంది సేనలను రంగంలోకి దింపడం విస్మయం కలిగిస్తోంది. మాదకద్రవ్యాల ముఠాలను పట్టుకుంటామన్న సాకుతో వెనెజువెలాలోని చమురు నిల్వలను కొల్లగొట్టడానికి ట్రంప్ పన్నిన పద్మవ్యూహమే ఇదంతా. స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ లెక్కల ప్రకారం 2021 నాటికి ఈ దేశంలో 48 వేల మిలియన్ టన్నుల చమురు నిల్వలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇది సౌదీలో చమురు నిల్వల కంటే అత్యధికం. ప్రపంచం మొత్తం మీద చమురు నిల్వల్లో 17 శాతానికి సమానం. కానీ ప్రపంచ చమురు వ్యాపారంలో వెనెజువెలా వాటా కేవలం 0.8% మాత్రమే. అగ్రరాజ్యం అమెరికాతోపాటు కెనడా, ఐరోపా సమాఖ్య తదితర దేశాలు కలిసి 350 ఆంక్షలు విధించడమే దీనికి కారణం. అయితే అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా, చైనా భయపడకుండా వెనెజువెలాలో 212 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది.
ఆ దేశం ఉత్పత్తి చేసే చమురులో 90 శాతం బీజింగ్ కొనుగోలు చేస్తోంది. అంతేకాదు చమురు క్షేత్రాల అభివృద్ధి కోసం వచ్చే సంవత్సరం మరో బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించుకుంది. 2007 నుంచి చమురుపై రుణ ఒప్పందాలు చేసుకుని 50 బిలియన్ డాలర్లు అందించింది. ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వెనెజువెలా చమురు నిల్వలు మొత్తం కాజేయాలన్న తీరని ఆకాంక్ష వెలిబుచ్చారు. గతంలో కూడా మదురో ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రంప్ ప్రయత్నించారు. అయితే అప్పటి అమెరికా ప్రభుత్వంలోని అనేక మంత్రులు ట్రంప్ ఆలోచనలను వ్యతిరేకించారు. 1835లోనే స్వాతంత్య్రం పొందిన వెనెజువేలా అమెరికా ఇంధన అవసరాలను మొదట్లో తీర్చ గలిగింది.
2006 నాటికే అమెరికాకు రోజుకు దాదాపు 1.4 మిలియన్ బారెల్స్ చమురు పంపేది. హ్యూగో చావెజ్ నేతృత్వంలో 1999లో సోషలిస్టు ప్రభుత్వం వెనెజువెలాలో అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. చావెజ్ అనంతరం అధ్యక్షుడైన నికొలస్ మదురోను అధికారం నుంచి తప్పించి తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నిలబెట్టాలని ట్రంప్ పభుత్వం పన్నాగాలు పన్నుతోంది. శాంతి చర్చలకు మదురో సిద్ధమంటున్నా అమెరికా ముందుకు రావడం లేదు. దీన్ని బట్టి వెనెజువెలాను స్వాధీనం చేసుకోవడమే ప్రధాన లక్షంగా ట్రంప్ ప్రభుత్వం వేచి ఉంటోంది. కరేబియన్ సముద్ర జలాల ద్వారా మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ పడవలపై అమెరికా మిలిటరీ దాడులు చేస్తోంది. వాస్తవానికి అమెరికాలోనే 200 నుంచి 750 బిలియన్ డాలర్ల విలువైన మాదక ద్రవ్యాల విక్రమాలు జరుగుతున్నాయన్నది ఒక అంచనా. మరి అలాంటప్పుడు వెనెజువెలానే దోషిగా చిత్రిస్తూ అమెరికా కాలుదువ్వుతుండడం ఎంతవరకు సమంజసం?
Also Read : నేపాల్‌కు సుశీల సారథ్యం