Saturday, September 13, 2025

మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిన మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై, 42 రోజుల పాటు శాంతియుతంగా నిరసన తెలిపి, తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చేసిన మహోన్నత ఘట్టం సకల జనుల సమ్మె అని పేర్కొన్నారు. 2011 సెప్టెంబర్ 12 రోజున కరీంనగర్ జనగర్జనలో ఉద్యమ సారథి కెసిఆర్ పిలుపు మేరకు యావత్ తెలంగాణ సమాజం ఒక్కటయ్యిందని అన్నారు. సమ్మెలో స్వచ్చంధంగా భాగస్వాములయ్యి, ఔర్ ఏక్ ధక్కా.. తెలంగాణ పక్కా అని దిక్కులు పిక్కటిల్లెలా తెలంగాణ ప్రజలు నినదించారని గుర్తు చేశారు. నిర్బంధాలను ఛేదించి, ఆంక్షలకు ఎదురొడ్డి, బెదిరింపులను లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ బిడ్డలు పోరాడారని పేర్కొన్నారు. సకల జనుల సమ్మెకు శనివారానికి(సెప్టెంబర్ 13కు) 14 ఏళ్ళు నిండిన సందర్భంగా.. సమ్మెలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి కెటిఆర్ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ, జై తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు.

Also Read: మూడేళ్ల తర్వాత.. ఒటిటిలోకి వస్తున్న సినిమా..

యావత్ తెలంగాణ ప్రజలు సింహాలై గర్జించిన రోజు : హరీష్‌రావు

తెలంగాణ రాష్ట్రం కోసం యావత్ తెలంగాణ ప్రజలు సింహాలై గర్జించిన రోజు నేడు, స్వరాష్ట్ర కాంక్షను సకల జనుల సమ్మె పేరిట ప్రపంచానికి చాటి చెప్పిన మహోజ్వల ఘట్టం నేడు అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు పేర్కొన్నారు. సరిగ్గా 14 ఏండ్ల క్రితం ఇదే రోజున మొదలైన ‘సకల జనుల సమ్మె’ 42 రోజుల పాటు నిరవధికంగా కొనసాగిందని అన్నారు. కెసిఆర్ పిలుపుతో ప్రారంభమైన సమ్మె తెలంగాణ ఉద్యమ దిశను మలుపు తిప్పింది, స్వరాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిందని వ్యాఖ్యానించారు. సకల జనుల సమ్మెకు ముందు రోజున, కరీంనగర్ ‘జనగర్జన’ సభలో కెసిఆర్ చేసిన ప్రసంగం చరిత్రాత్మకం అని చెప్పారు. ‘సకల జనుల సమ్మెలో రేపటి నుంచి బస్సు పయ్య తిరగది, బడి గంట మోగది, సింగరేణిలో ఒక్క బొగ్గు పెల్ల కూడా పెగలదు, ఎక్కడ కూడా రైలు పోదు’ అని ఇచ్చిన పిలుపు అన్ని వర్గాల ప్రజలను ఉత్తేజపరిచింది…ఉద్యమ జ్వాలను రగిలించిందని అన్నారు. జై తెలంగాణ.. జై కెసిఆర్ అంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News