బిఆర్‌ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రతిష్టాత్మకం కానుంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గులాబీ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాల్లో ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం అనుకూల ఫలితాలు వచ్చాయి. మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో రానున్న ఉప ఎన్నికలో అభ్యర్థిని గెలిపించుకోవడం గులాబీ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కెసిఆర్ నేతృత్వంలో వంద స్థానాలు ఖాయమని నేతలు గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ బలంగా ఉందని, ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అంటున్నారు. నవంబర్ నెలలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరిగే అవకాశం ఉంది.
ఈ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో బిఆర్‌ఎస్ గెలుపే గోపీనాథ్‌కు సరైన నివాళి ఇచ్చినట్లని పలు సందర్భాలలో పార్టీ నేతలు తెలిపారు. జూబ్లీహిల్స్ నుంచి బిఆర్‌ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌లో ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్ కార్యకర్తలతో కెటిఆర్ భేటీ అయ్యారు. సునీత పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సునీతకు కాకుండా ఇతరులకు టికెట్ ఇస్తే నియోజకవర్గంలో పార్టీ కేడర్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్న పార్టీ అధిష్టానం సునీతకు టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఈనెల 24న ట్యాంక్ బండ్ పై బిసి బతుకమ్మ