భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌కు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కేందుకు సిద్ధమవుతున్న హాట్ ఎయిర్ బెలూన్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేయడంతో సీఎంకు ప్రమాదం తప్పింది. మంద్సౌర్ లోని గాంధీ నగర్ ఫారెస్ట్ రిట్రీట్ వద్ద ఈ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి ఎయిర్ బెలూన్ ఎక్కడానికి సిద్ధమవుతుండగా బెలూన్ దిగువ భాగంలో మంటలు అంటుకున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేసి, ముఖ్యమంత్రి ట్రాలీని పట్టుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో వెంటనే ఆయనను అక్కడి నుంచి భద్రతా సిబ్బంది తరలించారు.
ప్రమాదం కాదన్న అధికారులు
అయితే ఈ సంఘటనపై మంద్సౌర్ జిల్లా కలెక్టర్ అదితి గార్గ్ వివరణ ఇచ్చారు. మంటలు వచ్చినట్టు వెలువడిన కథనాలు పూర్తిగా తప్పన్నారు. బెలూన్ను పరిశీలించేందుకు సిఎం వచ్చారని, సీఎం బెలూన్ ఎక్కలేదని చెప్పారు. మంటలు రావడంపై మాట్లాడుతూ బెలూన్ను లిఫ్ట్ చేసేందుకు అందులోని గాలిని హీట్ చేయడమనేది స్టాండర్డ్ ప్రాసెస్ అని చెప్పారు. ఏడేళ్ల అనుభవం ఉన్న బెలూన్ పైలెట్ మహమ్మద్ ఇర్ఫాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బెలూన్ కోసం ఎల్పీజీ, ఫైర్‌ప్రూఫ్ కెవ్లార్ మెటీరియల్ వాడతామని, పూర్తి భద్రతా ప్రమాణాలకు లోబడి ఈ ప్రక్రియ ఉంటుందని చెప్పారు.