న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గమని అమెరికా భావిస్తోంది. అందులో భాగంగాఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలను లక్షంగా చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో ఈయూ, జీ7 దేశాలు భారత్, చైనాలపై టారిఫ్‌లు విధించాలని ట్రంప్ పాలక వర్గం ప్రతిపాదనలు చేసింది. ఇందుకు జీ7 సభ్య దేశాలు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. జీ7 దేశాల ఆర్థిక మంత్రులు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య సుంకాల విధింపులపై చర్చ జరిగింది. ఈ చర్చకు సంబంధించిన విషయాలను అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్‌గ్రీర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
“ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి నిజంగా కట్టుబడి ఉంటే… రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకు రావాలని యూఎస్ వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ పిలుపునిచ్చారు. ఇందుకోసం మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై సుంకాలు విధించాలంటూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనలను ఉద్ఘాటించారు. ఇప్పటికే భారత దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించిన విషయాన్ని అక్కడ ప్రస్తావించారు. ఈ సందర్భంగా యుద్ధం ముగింపునకు కట్టుబడి ఉన్నామంటూ జీ7 సభ్యదేశాలు అమెరికాకు హామీ ఇచ్చాయి. ఈ క్లిష్ట సమయంలో అమెరికాతో కలిసి ఈ దేశాలు కూడా నిర్ణయాత్మక చర్యలు చేపడతాయని ఆశిస్తున్నాం” అని జామిసన్ గ్రీర్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ క్రమంలో భారత్-చైనాలపై సుంకాల విధింపునకు ఆయా దేశాలు కూడా సిద్ధమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా.. రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ఇంతకు ముందు ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాల ముందు కూడా ట్రంప్ ఇలాంటి ప్రతిపాదనలే చేశారు. అయితే ఈ విషయంలో ఈయూ దేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో అది సాధ్యపడలేదు. ఇవే ప్రతిపాదనలను ఆయన మళ్లీ జి7 దేశాల ముందు పెట్టడం గమనార్హం.
Also Read: నేపాల్‌కు సుశీల సారథ్యం