Saturday, September 13, 2025

మహిళలు, చిన్నారుల భద్రతకు త్వరలో నూతన విధానం:మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

ఈ నెల 22న మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులతో మహిళా సదస్సు నిర్వహించి వారి అభిప్రాయాల ఆధారంగా కొత్త మహిళా భద్రతా విధానాన్ని తీసుకురాబోతున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ముఖ్యంగా చిన్నారుల రక్షణను తమ ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా భావిస్తోందని స్పష్టం చేశారు. పిల్లలు అంటే మన భవిష్యత్తు అని, వారి రక్షణ అంటే మన భవిష్యత్తు రక్షణగా మంత్రి పేర్కొన్నారు. నగరంలోని ఒక హోటల్ ప్రాంగణంలో సిఐఐ, యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాసూమ్ సమిట్ 10వ వార్షికోత్సవానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి చిన్నారుల భద్రత, మహిళల రక్షణ, పోషకాహారం, మహిళా సాధికారత వంటి అంశాలపై ప్రసంగించారు. డీ.జీ. శికా గోయల్, సిఐఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ శివప్రసాద్ రెడ్డి, మాసూమ్ యంగ్ ఇండియన్స్ చైర్ జోష్నా సింగ్ అగర్వాల్, యంగ్ ఇండియన్స్ నేషనల్ చైర్మన్ తరంగ్ ఖురానా, మాసూమ్ కోచ్ భవిన్ పాండ్యా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పసి హృదయాల్లో నాటుకుపోయే భావనలే వారి జీవితాన్ని నిర్దేశిస్తాయని అన్నారు. చిన్నారి గాయపడితే ఆ గాయం జీవితాంతం వెంటాడుతుందని అన్నారు. అందుకే పిల్లలు నిర్భయంగా, స్వేచ్ఛగా, ధైర్యంగా జీవించే వాతావరణాన్ని కల్పించడం సమాజానికి ఉన్న మొత్తం బాధ్యత అని పేర్కొన్నారు. చిన్నారుల పోషకాహారంపై దృష్టి సారిస్తూ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోషణ మాసం నిర్వహించనున్నట్లు తెలిపారు. పిల్లల్లో పౌష్టికాహారం పెంపొందించేందుకు పరిశోధనలు జరిపి అంగన్వాడి మెనూలో మార్పులు చేశామని వివరించారు. పౌష్టికాహారం ప్రాధాన్యతపై నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల ప్రాముఖ్యతను గుర్తుచేసిన మంత్రి 1975లో ఇందిరాగాంధీ ప్రారంభించిన ఈ వ్యవస్థ, ఇప్పుడు పోషకాహారంతో పాటు ఆరోగ్యం, ఆనందం, ప్రాథమిక విద్య అందిస్తున్నదని వివరించారు.

Also Read: సింగరేణి ఓపెన్ మైన్స్‌లో మహిళా ఆపరేటర్లు

చిన్నారుల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం

చిన్నారుల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. అలాగే డ్రగ్స్ నియంత్రణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనరి పోలీస్ శాఖలో ప్రత్యేక నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి, నిఘాను పెంచినట్లు చెప్పారు. లైంగిక నేరాల నియంత్రణలో కేవలం శిక్షలకే పరిమితం కాకుండా శిక్షణా కార్యక్రమాలు కూడా ఉండాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఆడవారిని గౌరవించాలని తరగతి గదిలోనే నేర్పాలని సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలపై ఇళ్లలో, పాఠశాలల్లో, గ్రామాల్లో తప్పనిసరిగా చర్చ జరగాలని అన్నారు. తప్పు జరిగితే పిల్లలు ధైర్యంగా మాట్లాడే వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. మహిళా సాధికారతపై మాట్లాడుతూ మహిళా సంఘాలను బలోపేతం చేసి వారిని సామాజిక,

ఆర్థికంగా బలపరచడం ద్వారా చిన్నారుల రక్షణను సుస్థిరం చేస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ చెప్పినట్లుగా మహిళా ప్రగతితోనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రభుత్వ చర్యల గురించి మాట్లాడుతూ, హెల్పర్లను, కౌన్సెలింగ్, ప్రత్యేక బృందాల ద్వారా బాధిత చిన్నారులకు అండగా నిలుస్తున్నామని, పాఠశాలల్లో అమ్మాయిలకు స్వీయ రక్షణ శిక్షణ ఇవ్వడం జరుగుతోందని వివరించారు. మాసూమ్ కార్యక్రమంపై అభినందనలు తెలిపిన మంత్రి, మీరు పది సంవత్సరాలుగా పిల్లల భద్రత కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. సమాజంలో ఉండే మౌనాన్ని తొలగించి అమ్మాయిల భద్రతను చర్చించే వేదికను సృష్టించారని కొనియాడారు. తమ ప్రభుత్వం మీతో కలిసి పనిచేసి ప్రతి చిన్నారి భయపడకుండా స్వేచ్ఛగా కలలు కనగల వాతావరణాన్ని నిర్మిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News