డెయిర్ అల్ బలా : గాజా నగరంపై ఇజ్రాయెల్ ఉధృతంగా సాగించిన దాడుల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారని షియా ఆస్పత్రి వర్గాలు శనివారం వెల్లడించాయి. గాజా సిటీపై ఇటీవల ఇజ్రాయెల్ దాడులను ఉధృతం చేసింది. హమాస్ నిఘా విభాగాలు ఉన్నాయన్న ఆరోపణపై అనేక భవనాలను ధ్వంసం చేసింది. హమాస్ గట్టి పట్టున్న గాజా నగరం లోని చాలా భాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి వీలుగా నివాసీయులైన ప్రజలను తక్షణం ఖాళీ చేసి వెళ్లి పోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది.
గత రాత్రి ఒకసారి దాడి చేయగా, మళ్లీ తెల్లవారు జామున మరో దాడి జరిగింది. షేక్ రద్వాన్ పొరుగున ఉన్న ఒక ఇంటిపై జరిగిన దాడిలో ఒకే కుటుంబంలో తల్లి, ఆమె ముగ్గురు పిల్లలతోసహా పది మంది మృతి చెందారు. నగరాన్ని పదేపదే ఖాళీ చేయాలన్న హెచ్చరికలతో గత కొన్ని వారాలుగా అనేక మంది తమ నివాసాలను విడిచిపెడుతున్నారు. రవాణా ఖర్చులు భరించలేక వేరే నివాసాలు లభించక చాలా మంది ఇంకా నగరంలో ఉండిపోవలసి వస్తోంది. ఎక్కడా తమకు భద్రత లేదని చెబుతున్నారు.
అయితే మానవీయ జోన్‌గా పిలిచే దక్షిణ ప్రాంతానికి తరలిపోవాలని ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరిస్తోంది. ఉత్తర గాజాలో నివసిస్తున్న మిలియన్ మందిలో నాలుగోవంతు మంది నగరాన్ని విడిచిపెట్టారని ఆర్మీ అధికార ప్రతినిధి అవిచాయ్ ఆడ్రే చెప్పారు. గత 24 గంటల్లో పిల్లలతోసహా ఏడుగురు ఆకలి మంటలతో చనిపోయారని, దీంతో పోషణ లేక చనిపోయిన వారి సంఖ్య 145 మంది పిల్లలతోసహా మొత్తం 420 కి సంఖ్య పెరిగిందని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం వివరించింది. గాజాలో బందీలుగా ఉన్న వారి కుటుంబాలు దాడులు ఆపాల్సిందిగా ఇజ్రాయెల్ ఆర్మీని వేడుకుంటోంది. గాజాలో ఇంకా 48 మంది బందీలుగా ఉండగా, వారిలో 20 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నట్టు భావిస్తున్నారు.
Also Read: భారత్‌పై టారిఫ్‌లు విధించేందుకు జీ7 దేశాల అంగీకారం?