Saturday, September 13, 2025

68 జిఓను రద్దు చేసి హోర్డింగ్ ఏజెన్సీల సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

జిఓ 68ని రద్దు చేసి హోర్డింగ్ ఏజెన్సీల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జిఓ 68 ని రద్దు చేస్తామని, హోర్డింగ్‌లపై అధికార పార్టీ గుత్తాదిపత్యాన్ని తొలగించి వాటిపై ఆధారపడిన కుటుంబాలను రక్షిస్తామని గత జిహెచ్‌ఎంసి ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామినిచ్చిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 21 నెలలు దాటినా ఈ సమస్యలపై ఎలాంటి చర్యలు లేవని, ఇప్పటికైనా తక్షణమే వీటిని పరిష్కరించాలని కోరారు. తెలంగాణ ఔట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ బృందం వారి సమస్యలు తన దృష్టికి తెస్తూ,వాటి పరిష్కారానికి కృషి చేయాలని వినతిపత్రాన్ని సమర్పించిందని జాన్ వెస్లీ తెలిపారు. ఈ పరిశ్రమల ప్రకటనలపై వచ్చిన పన్నులతో స్థానికంగా రోడ్లు, వీధి దీపాలు, ఇతర అభివృద్ధి పనులు జరిగేవని,2020లో అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం జిఓ 68 ద్వారా హోర్డింగ్ ఏజెన్సీలను రద్దు చేసిందని,

కేవలం వారికి ఇష్టమైన మూడు పెద్ద ఏజెన్సీలకే లాభం కట్టబెట్టేందుకు పూనుకుందని ఆయన తన లేఖ ద్వారా సిఎం దృష్టికి తీసుకెళ్ళారు. చదువుకుని, ఉద్యోగాలు రాక జీవనోపాధి కోసం నిరుద్యోగులు పెట్టుకున్న ఈ 209 ఏజెన్సీల్లో ఉన్న సుమారు 50వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయన్నారు. ఏజెన్సీలన్నీ తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయాయని, పైగా గుత్తాధిపత్యంతో నడిపే రెండు ఏజెన్సీలు అసోసియేషన్ వాళ్ళని బెదిరింపులకు గురిచేస్తున్నాయని తన దృష్టికి వచ్చిందని వెస్లీ తెలిపారు. ఈ మూడు ఏజెన్సీలు మాత్రమే ఉండడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా పడిపోయిందన్నారు. ఒకసారి యాడ్ ఏజెన్సీ అసోసియేషన్ వారిని పిలిచి చర్చించాలని, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హోర్డింగ్ ఏజెన్సీలను పునరుద్ధరించేందుకు జీహెచ్‌ఎంసీతో పాటు, తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలకు కొత్త ప్రకటనల విధానాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని, చిన్నచిన్న ఏజెన్సీలు కూడా వ్యాపారం చేసుకునేలా టెండర్ల ప్రక్రియ ఉండేలా చూడాలని ఆయన ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Also Read: ఆయుర్వేద పద్ధతులను, యోగాను అణచి వేసే కుట్ర:మంత్రి కిషన్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News