Sunday, September 14, 2025

మోడీ పాలనలో భారత్ ‘ఒంటరి’

- Advertisement -
- Advertisement -

నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత విదేశాంగ విధానాన్ని ఒక కొత్త దిశలో నడిపించాలని ప్రకటించారు. ‘నెయిబర్ హుడ్ ఫస్ట్’ నుంచి ‘ఆక్ట్ ఈస్ట్’ వరకు విశ్వగురుగా భారతదేశాన్ని చూపించాలని ఆయన ఆకాంక్ష. కానీ, గత 11 సంవత్సరాలలో ఈ విధానం ఎన్నో లోపాలను, వైఫల్యాలను చవిచూసింది. నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ఈ విధానాన్ని విమర్శిస్తూ, అది దేశ భద్రతకు, అంతర్జాతీయ సంబంధాలకు హాని కలిగించిందని చెబుతున్నారు. ముఖ్యంగా, పొరుగు దేశాలతో సంబంధాలు, చైనా, పాకిస్థాన్‌లతో వివాదాలు, ప్రపంచశక్తులతో సమన్వయం వంటి అంశాలలో ఎన్నో తప్పులు జరిగాయి. ముందుగా, పొరుగు దేశాల విధానాన్ని పరిశీలిస్తే, మోడీ ప్రభుత్వం ‘నెయిబర్‌హుడ్ ఫస్ట్’ అని ప్రకటించినా అది వాస్తవంలో వైఫల్యాన్నే చవిచూసింది. నేపాల్‌లో రాజ్యాంగ సవరణల విషయంలో భారత్ జోక్యం చేసుకోవటం వల్ల ఆ దేశంతో మన సంబంధాలు దెబ్బతిన్నాయి. ‘కార్నెగీ ఎండావ్‌మెంట్ (విశ్లేషకులు ఈ జోక్యాన్ని విమర్శిస్తూ, అది నేపాల్‌లో భారత వ్యతిరేక భావనలనుపెంచి పోషించిందని చెప్పా రు.

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవటం కూడా భారతదేశానికి పెద్దదెబ్బ. హసీనా భారతదేశానికి మిత్రురాలు కావటంవల్ల గతంలో కంటే సంబంధాలు మెరుగుపడ్డాయి. కానీ, ఆమె పతనం తర్వాత ఆమెకు భారత్‌లో తలదాల్చుకొనే వసతులు, రక్షణ కల్పించటం, బంగ్లాదేశ్ ప్రజల్లో, తాత్కాలిక ప్రభుత్వం లోనూ భారత వ్యతిరేకత మరింత పెరిగింది. ‘ది ఫెడరల్’ విశ్లేషణలో ఈ సంఘటనను మోడీ విధానం ఊహించని ఫలితంగా పేర్కొన్నారు. మాల్దీవులు, శ్రీలంక వంటి దేశాలలో భారత్ ప్రభావం చైనా ఆధిపత్యానికి తలవంచాల్సి వచ్చింది. ‘కార్నెగీ నిపుణులు’ భారత్‌కు ఆర్థిక సామర్థ్యం లేకపోవటం వల్ల పొరుగు దేశాలను తన వైపు మళ్లించలేకపోయిందని విమర్శించారు.
చైనాతో సంబంధాలు మోడీ విధానం పెద్ద వైఫల్యం. 2020 గాల్వాన్ సంఘటన తర్వాత సరిహద్దు వివాదాలు పరిష్కారం కాలేదు.‘ఒఆర్‌ఎఫ్ విశ్లేషకులు’ రక్షణ బడ్జెట్ తక్కువగా ఉండటం వల్ల చైనాను ఎదుర్కోవటం కష్టమని జనరల్ విపి మాలిక్ వంటి నిపుణులు హెచ్చరించారనిచెప్పారు. మోడీ ప్రభుత్వం చైనా దూకుడును తక్కువగా అంచనా వేసింది.

ఫలితంగా భారత్ భూభాగాలు కోల్పోయింది. ‘ఇండియా టుమారో’లో రాహుల్ గాంధీ ఈ విధానాన్ని ‘పెద్ద తప్పు’ అని విమర్శించారు. ఇండియా అనుసరించిన విధానాల వల్లనే పాకిస్థాన్ -చైనాలను దగ్గర చేసిందని చెప్పారు. పాకిస్థాన్‌తో సంబంధాలు మరింత దిగజారాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో మోడీ విధానం పూర్తిగా విఫలమైంది. 2025లో జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైంది కానీ, అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగింది.‘ఫెయిర్ అబ్జర్వర్’ విశ్లేషకులు దీన్ని మోడీ ఘోర పరాజయంగా చూపారు. ట్రంప్ మధ్యవర్తిత్వం ప్రకటనలు భారత్‌ను ప్రపంచవ్యాప్తంగా అవమానపరిచిందని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు ‘పృథ్వీరాజ్ చవాన్’ ట్రంప్ -పాక్ ఆర్మీ చీఫ్ సమావేశాన్ని మోడీ విధానం వైఫల్యంగా ఘాటుగా విమర్శించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అమెరికాతో సంబంధాలు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా దెబ్బతిన్నాయి. సిక్కు నాయకుడు హత్య కుట్ర ఆరోపణలు, మాస్కో పర్యటన సమయంలో ఉక్రెయిన్ దాడులు వంటివి వివాదాలు సృష్టించాయి.

‘ది ఫెడరల్’ లో ఈ సంఘటనలను మోడీ విధానం ప్రశ్నార్థకమని విశ్లేషకులు చెప్పారు. ట్రంప్ అధ్యక్షత్వంలో 50% టారిఫ్‌లు విధించటం మోడీ దౌత్య వైఫల్యం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దీన్ని మోడీ పరాజయంగా విమర్శించారు. ‘ఒఆర్‌ఎఫ్’లో సిఎఎ, ఎన్‌ఆర్‌సి వంటి దేశీయ విధానాలు అమెరికాతో భారత్ సంబంధాలను బాగా దెబ్బతీశాయని చెప్పారు. రష్యాతో భారత సంబంధాలు కూడా గతంలో కంటే భిన్నంగా మారాయి. ఉక్రెయిన్ యుద్ధంలో మోడీ తటస్థత వల్ల రష్యా కూడా తన వైఖరిని స్థానాన్ని మార్చుకుంది. రష్యాపాకిస్థాన్ మధ్య 2.8 బిలియన్ డాలర్ల ఒప్పందం భారత్‌కు పెద్దదెబ్బ. కాంగ్రెస్ నాయకురాలు షమా మహమ్మద్ దీన్ని మోడీ ప్రభుత్వ వైఫల్యంగా, జైశంకర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ‘ఇండియా టుమారో’లో ముస్లిం దేశాలతో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయని, అమెరికా ప్రాపకం కోసం ఇజ్రాయెల్‌కు భారత్ అన్‌కండీషనల్ మద్దతు ఇవ్వటం వల్ల సాంప్రదాయకంగా అరబ్ వంటి మిత్రదేశాలు కూడా భారత్‌కు దూరమయ్యాయని భారత అలీన విధానానికి స్వస్తి చెప్పాలని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రపంచ వేదికలపై భారత్ స్థానం ఇప్పటికీ మెరుగుపడలేదు.

యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం, ఎన్‌ఎస్‌జి సభ్యత్వం వంటివి ఏవీ భారత్ సాధించలేకపోయింది.ఫెయిర్ అబ్జర్వర్‌లో ఈ వైఫల్యాలను మోడీ పరిమితులుగా చూపారు. దేశీయ రాజకీయాలు విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేయటం కూడా మరో పెద్ద లోపం. సిఎఎ వంటి చట్టాలు బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ సంబంధాలను మరింత లోతుగా దెబ్బతీశాయి. ఒఆర్‌ఎఫ్ నిపుణులు దీన్ని స్వయంకృతాపరాధంగా వర్ణించారు. మొత్తం గా మోడీ విదేశాంగ విధానం వ్యక్తిగత డిప్లమసీపై ఆధారపడి, సంస్థాగత బలాన్ని నిర్లక్ష్యం చేసింది. స్వాతి చతుర్వేది వంటి జర్నలిస్టులు హగ్స్, ఫ్రెండ్ షిప్ క్లెయిమ్స్ విదేశాంగ విధానానికి నిర్వచనం కాదని విమర్శించారు. భవిష్యత్తులో భారత్ తన విదేశాంగ విధానాన్ని ప్రపంచ పరిస్థితులకు, పోకడలకు అనుగుణంగా మార్చుకుని, సమ్మిళితత్వం, బలమైన ఆర్థిక సంబంధాలు, రక్షణ సామర్థ్యం ద్వారా పెంచుకోవాలి. లేకుంటే, ఈ లోపాలు దేశాన్ని సువిశాల ప్రపంచ ప్రాంగణంలో మరింత ఒంటరిని చేస్తాయి.

Also Read: ఆదివాసుల హక్కులకు ఏదీ రక్షణ?

డా. కోలాహలం రామ్ కిశోర్
9849328496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News