Sunday, September 14, 2025

లింగాపూర్ అటవీ బీట్‌లో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

- Advertisement -
- Advertisement -

అటవీ సిబ్బందిని అడ్డుకున్న గిరిజనులు
ఆదివాసీ మహిళల అరెస్టు
వార్త కవరేజీకి వెళ్లిన విలేఖరులు…అడ్డుకున్న అటవీ సిబ్బంది

మన తెలంగాణ/దండేపల్లి : మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం, లింగాపూర్ అటవీ బీట్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే..లింగాపూర్ గ్రామ శివారులోని 380 కంపార్ట్‌మెంట్‌లో గిరిజనులు పోడు భూముల కోసం అటవీ భూమిని ఆక్రమించుకొని గుడిసెలు వేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు, పోలీసులు శనివారం ఆ గుడిసెలను తొలగించేందుకు వెళ్లడంతో ఉద్రిక్తతకు దారితీసింది. గత కొద్ది రోజుల నుండి ఆదివాసీలు ఆక్రమించుకున్న భూమిలో తాత్కాలిక గుడిసెలు వేసుకొని పంటలు సాగు చేస్తున్నారు. వారిని అడవి నుంచి తొలగించే దిశలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వందలాది అటవీ శాఖ సిబ్బందిని ఉదయం నుండే మోహరించారు.

ఆరు జెసిబి యంత్రాలతో అటవీ భూమిలో గుంతలు తవ్వేందుకు అటవీ అధికారులు యత్నించగా ఆదివాసీ గిరిజనులు అడ్డుకున్నారు. శుక్రవారం విధుల్లో ఉన్న అటవీ సిబ్బందిపై కారంపొడి చల్లి దాడి చేశారని అటవీ అధికారులు ఆరోపించారు. దీనిపై దండేపల్లి పోలీస్‌స్టేషన్‌లో దాడి చేసిన గిరిజనులపై ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామునే అటవీ సిబ్బందితో పాటు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళారు. అటవీ అధికారులపై తాము దాడి చేయలేదని, వాగు నీటిలో తాము స్నానం చేస్తుండగా కొంత మంది అటవీ సిబ్బంది చూస్తూ ఫొటోలు, వీడియోలు తీశారని, దీంతో వాళ్లను పట్టుకున్నామని గిరిజనులు వాపోయారు. పట్టుకున్న నెపంతో అటవీ అధికారులు తమపై దాడి చేశారని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఆదివాసీ మహిళలు వాపోయారు.

ఈ గొడవకు సంబంధించి 14 మంది మహిళలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు వాహనాల్లో తరలించారు. ఈ సందర్భంగా జన్నారం ఎఫ్‌డిఒ రాంమోహన్‌రావు మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా ఆదివాసీలకు అటవీ భూములపై అవగాహన కల్పించామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదివాసీలతో మాట్లాడి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చినప్పటికీ గిరిజనుల్లో మార్పు రాలేదని అన్నారు. అటవీ సిబ్బంది విధుల నిర్వహణలో భాగంగా అక్కడికి వెళ్లగా మహిళలు దాడి చేశారని అన్నారు. కాగా, ఈ వార్త సేకరణ కోసం వెళ్లిన జర్నలిస్టులను అటవీ సిబ్బంది అధికారులు అడ్డుకున్నారు. ఫొటోలు తీయవద్దని, గిరిజనులు ఆక్రమించిన తాత్కాలిక గుడిసెల వద్దకు రావద్దని అడ్డుకున్నారు. దీంతో జర్నలిస్టులు అధికారుల వైఖరికి నిరసనగా కడెం కాలువపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అటవీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు.

Also Read: మత్స్యకారుడి వలకు చిక్కిన వింతైన భారీ చేప

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News