భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నపురాతన మండపాలు, శిల్పాలు
తిరుమల: తిరుమల శేషాచలగిరుల్లో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో నిర్మితమైంది. శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచుకోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంటగదులున్నాయి. శ్రీవారి ఆలయం అభివృద్ధికి ఎన్నో రాజవంశాలకు చెందిన రాజులు, రాణులు, సేనాధిపతులు, ఇంకెందరో భక్తులు ఇతోధికంగా విరాళాలు అందించి సహకరించారు. అద్భుత నిర్మాణమైన శ్రీవారి ఆలయంలో పలు ఉప ఆలయాలు, మండపాలు కొలువుదీరాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలోని మండపాలను ఆనాటి చక్రవర్తులు, రాజులు అద్భుతమైన శిల్ప కళా నైపుణ్యంతో నిర్మిచారు. ఇందులో మహాద్వారం, కృష్ణరాయమండపం, రంగనాయక మండపం, తిరుమలరాయ మండపం, అద్దాల మండపం – ఆఐనా మహల్, ధ్వజస్తంభ మండపం, కళ్యాణ మండపం తదితరాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పైకప్పు, స్థంభాలపై కృష్ణస్వామివారు, లక్ష్మీ నరసింహస్వామి, వరాహస్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామి తదితర దేవతా మూర్తులు, లక్ష్మీదేవి అమ్మవారి వివిధ రూపాలు, జంతువులు, లతలు, పుష్పాలతో కూడిన శిల్పాలతో నిర్మించారు. ప్రధాన గోపురం లేదా మహాద్వారమును 13వ శతాబ్ధంలో నిర్మించినట్లు ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడే కుడిగోడపై అనంతాళ్వారులు ఉపయోగించిన గునపం వ్రేలాడదీయబడి ఉంటుంది.
కృష్ణరాయమండపం :
మహాద్వారానికి ఆనుకొని లోపలి వైపు 16 స్థంభాలపై ముసలిపై ఉన్న సింహం, దానిపై కుర్చుని స్వారి చేస్తున్న వీరుల శిల్పాలతో కూడిన ఎతైన మండపమే కృష్ణరాయమండపం. ఈ మండపంలో కుడివైపున తిరుమల దేవి, చిన్నాదేవిలతో కూడిన శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు, ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతి రాయల రాగిప్రతిమ, ఆ పక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి.
రంగనాయక మండపం :
శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపాన్ని శ్రీరంగనాథ యాదవ రాయలు క్రీ.శ 1310 – 1320 మధ్య కాలంలో నిర్మించారు. ఈ మండమంలో వివిద రకాల శిల్పాలతో సుందరంగా మండప నిర్మాణం జరిగింది. క్రీ.శ 1320 – 1360 మధ్య కాలంలో శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు ఈ మండపంలో భద్రపరిచారు. అందువల్లే దీన్ని రంగనాయక మండపమని పిలుస్తున్నారు.
తిరుమలరాయ మండపం :
రంగనాయక మండపాన్ని అనుకుని పడమర వైపునకు ఉన్న ఎత్తయిన స్తంభాల మండపమే ఊంజల్‌మండపం లేదా తిరుమలరాయ మండపం అంటారు. ఈ మండపంలోని వేదిక భాగాన్ని క్రీ.శ. 1473లో సాళువ నరసింహరాయలు నిర్మించగా, క్రీ.శ.16వ శతాబ్ధంలో సభాప్రాంగణ మండపాన్ని ఆరవీటి తిరుమలరాయలు నిర్మించాడు. ఇందులోని స్థంభాలపై శ్రీ వైష్ణవ, పశు–పక్షాదుల శిల్పాలు ఉన్నాయి. ఈ మండపంలో రాజా తోడరమల్, అతని తల్లి మాతా మోహనా దేవి, భార్య పిటా బీబీ లోహ విగ్రహలు ఉన్నాయి. బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీవారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.
అద్దాల మండపం – ఆఐనా మహల్ :
కృష్ణరాయ మండపానికి ఉత్తరం దిక్కున ఉన్నదే అద్దాల మండపం లేదా ఆఐనా మహల్ అంటారు. దీనిని 36 స్థంభాలతో అద్భుతంగా నిర్మిచారు. ఇందులో మందిరం, అంతరాళం, గర్భగృహం ఉన్నాయి. ఇక్కడ ప్రతి రోజు స్వామివారికి డోలోత్సవం నిర్వహిస్తారు.
ధ్వజస్తంభ మండపం :
రెండవ గోపురమైన వెండి వాకిలిని తాకుతూ ధ్వజస్తంభ మండపాన్ని క్రీ.శ 1470లో విజయనగర చక్రవర్తి సాళువ నరసింహరాయులు నిర్మించారు. 10 రాతి స్థంభాలతో నిర్మిచిన మండపంలో బంగారు ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. ఈ స్థంభాలపై వివిద దేవతామూర్తుల శిల్పాలు, ఇంకా సృష్ఠికి సంబంధించిన స్త్రీ, పురుషుల సంబంధాలను తెలిపే అనేక శిల్పాలు పొందుపరిచారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్నే ధ్వజారోహణం అంటారు. ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీఠం. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.
వసంత మండపం:
తిరుమల శ్రీవారి ఆలయానికి మహాప్రదక్షిణ మార్గంలో నైరుతిమూలలో వసంత మండపం ఉంది.
కళ్యాణ మండపం :
శ్రీవారి గర్భాలయానికి దక్షిణంవైపు క్రీ.శ.1586లో శ్రీ అవసరం చెన్నప్ప అనే నాయకుడు కల్యాణ మండపాన్ని నిర్మించారు. 80 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడల్పుతో 27 స్థంబాలతో నిర్మించారు. ఇందులో మధ్య భాగంలో నాలుగు చిన్న స్తంభాలు ఉన్న గ్రానైట్ వేదిక ఉన్నది. పూర్వకాలంలో ఈ కల్యాణ వేదికపై శ్రీ మలయప్పస్వామి వారికి, శ్రీదేవి భూదేవిలకు కల్యాణోత్సవం నిర్వహించేవారు.
తిరుమామణి మండపం :
బంగారు వాకిలికి గరుడ సన్నిధికి మధ్యగల ప్రదేశం. సుప్రభాత సేవలో భక్తులు ఇక్కడి నుండే శ్రీవారి సేవలో పాల్గొంటారు.
స్నపన మండపం :
బంగారువాకిలి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే ‘స్నపనమండపం’. క్రీ.శ.614లో పల్లవరాణి సామవై ఈ మండపాన్ని నిర్మించి, భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించింది. ఈ స్నపనమండపాన్నే తిరువిలాన్ కోయిల్ అంటారు. ఆనందనిలయం జీర్ణోర్ధరణ సమయంలో ఈ మండపం నిర్మించబడిందని చెబుతారు.
రాములవారి మేడ :
స్నపనమండపం దాటగానే కుడివైపు ఎత్తుగా కనిపించేదే ”రాములవారిమేడ”. తమిళంలో మేడు అంటే ఎత్తయిన ప్రదేశం అని అర్థం. ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలున్నాయి. ప్రస్తుతం ఆనందనిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పిలువబడుతోంది అని కూడా అంటారు.
శయనమండపం :
రాములవారి మేడ దాటి లోపల ప్రవేశించిన వెంటనే ఉన్న గదే శయనమండపం. శ్రీవేంకటేశ్వరస్వామివారు వెలసిన గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయనమండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంమీద శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు.
కుల శేఖరపడి :
శయనమండపానికి, శ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖరపడి. పడి అనగా మెట్టు, గడప అని అర్థం.
గర్భాలయం :
కులశేఖరపడి అనే బంగారు గడపను దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. దీనినే ”ఆనంద నిలయం” అంటారు. ఈ ఆనంద నిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనందనిలయ విమానం అంటారు.
శ్రీ వేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు) :
గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిలిచివున్న దివ్యమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి. నిలబబడివున్నందున ఈ ఆర్చామూర్తిని ”….స్థానకమూర్తి….” అంటారు. అంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ”….ధ్రువమూర్తి….” అని, ”ధ్రువబేరం” అని కూడా అంటారు.