పాకిస్తాన్ లో వరదలు విధ్వంసం సృష్టించాయి. దక్షిణ పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరదలు సంభవిచండంతో దాదాపు 2.5 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారని.. దాదాపు 101 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. విధ్వంసం స్థాయి ఇంకా స్థిరంగానే ఉందని చెప్పారు. ముల్తాన్, ముజఫర్‌గఢ్, రహీమ్ యార్ ఖాన్ జిల్లాల్లోని పలు గ్రామాలు వరదలు ముంచెత్తాయి. వరదల్లో చిక్కుకున్న కుటుంబాలను రక్షించడానికి 1,500 కంటే ఎక్కువ పడవలను ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (PDMA) మోహరించారు. చీనాబ్, రావి, సట్లెజ్ నదుల వెంబడి ఉన్న గ్రామాల నుండి 12,427 మందిని తరలించారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
“వరద నీరు పెరగడంతో మా బస్తీ నుండి దాదాపు 15,000 మంది ప్రజలు ఇళ్లు వదిలి పెట్టి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇళ్ళు, పంటలు ధ్వంసమయ్యాయి. కొందరు ప్రజలు అద్దె పడవలో తప్పించుకున్నారు. కొంతమంది ఇప్పుడు సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందారు. మరికొందరు బహిరంగ ప్రదేశంలో నివసిస్తున్నారు. వరదల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఇద్దరు గ్రామస్తులు మునిగిపోయారు” అని స్థానిక నివాసి సయ్యద్ కౌసర్ షా పేర్కొన్నాడు.