యూరియా కోసం వెళ్లి వస్తున్న ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన గూడూరు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై గిరిధర్ రెడ్డి కథనం ప్రకారం.. దుబ్బగూడెంకు చెందిన బానోతు లాల్య(77), జోషి తండాకు చెందిన దరావత్ వీరన్న(46) ఇద్దరు కలిసి యూరియా బస్తాల తెచ్చుకోడానికి బొద్దుగొండ గ్రామానికి వెళ్లేందుకు టీవీఎస్ వాహనంపై వెళ్తుండగా జగన్నాయకులగూడెం క్రాస్ వద్ద మహబూబాబాద్ నుంచి గూడూరు వైపు వేగంగా నిర్లక్షంగా వస్తున్న బొలెరో వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బానోతు లాల్య తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
కాగా దారవత్ వీరన్నకు గాయాలు కాగా మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి 108లో తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై గూడూరు పోలీస్‌స్టేషన్‌లో లాల్య భార్య బానోతు లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొలెరో వాహనం డ్రైవర్ తమిళనాడు రాష్ట్రం తుత్తుకూడి జిల్లా అయ్యనతూరు గ్రామానికి చెందిన చొక్క లింగంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు.
Also Read: ఈ నెల 17 నుంచి పోషణ మాసం ప్రారంభం