పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంద్ర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైందని భారత వాతారణ కేంద్రం పేర్కొంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాక ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతందని తెలిపింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశలో కదిలి ఉపరితల ఆవర్తనంగా బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావర కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
మూడు రోజుల ముందుగా నైరుతి తిరోగమనం
దేశంలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాముఖ్యంగా భావించే నైరుతి రుతుపవనాల తిరోగమనంపై భారత వాతవరణ శాఖ(ఐఎండీ) కీలక అప్డేట్ ఇచ్చింది. రుతుపవనాల తిరోగమనం సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐఎండీ ముందుగా అంచనా వేయగా ఆదివారానికే పలు రాష్ట్రాల నుంచి నైరుతి వెనుదిరిగినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణంగా జూన్ 1న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయి. మొదట కేరళలోకి ప్రవేశించిన ఈ రుతుపవనాలు జులై 8 నాటికి దేశమంతటా విస్తరించి వర్షాలు అందిస్తాయి. తిరిగి సెప్టెంబర్ 17 నాటికి వాయువ్య దిశగా తిరోగమనిస్తూ అక్టోబర్ 15 నాటికి పూర్తిగా నిష్క్రమిస్తాయి. అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాల
నిర్ణీత సమయానికంటే ముందుగానే తిరోగమనానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఆదివారం వాయువ్య దిశగా రాజస్థాన్ నుంచి తిరుగుముఖం పట్టినట్లు ఐఎండీ పేర్కొంది. నైరుతి రుతుపవనాల తిరోగమన రేఖ ఆదివారం 30.5 ఉత్తర అక్షాంశం, 73.5 తూర్పు రేఖాంశాల మీదుగా శ్రీ గంగానగర్ నాగపూర్, జోద్పూర్, బార్మార్ మీదుగా కొనసాగుతోందని తెలిపింది. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా మే 24న కేరళలో ప్రవేశించాయి. 2009 తర్వాత రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావడం ఇదే మొదటిసారి. 2009లో రుతుపవనాలు మే 23న ప్రవేశించాయి. జులై 8 సాధారణ తేదీకి తొమ్మిది రోజుల ముందే దేశ వ్యాప్తంగా విస్తరించాయి.
Also Read: పారిపోయిన జైలు ఖైదీలను పట్టుకున్న నేపాల్ పోలీసులు