న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై పదేపదే అరవడం కంటే ఎన్నికల సంఘం ఓటు చోరీపై దర్యాప్తునకు దిగడం మంచిదని ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ చెప్పారు. దేశంలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష నేత రాహుల్ చెపుతున్నారు. ఎన్నికల సంఘం వీటికి సరైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. దీనికి బదులుగా ఆయనపై అభ్యంతరకర రీతిలో దురుసుగా మాట్లాడటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఆరోపణలపై సరైన రీతిలో దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇది ఎన్నికల సంఘానికి దేశానికి చాలా మంచిదే అవుతుందని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఖురేషీ చెప్పారు.
ఇక రాహుల్ వ్యాఖ్యలు కొన్ని రాజకీయ ప్రేలాపనలుగా ఉంటున్నాయని, అయితే ఫిర్యాదీ లేవనెత్తుతున్న విషయాలను విచారించడం ఎన్నికల సంఘం అధికారిక బాధ్యత అని తేల్చిచెప్పారు. తాను గతంలో ఎన్నికల సంఘంలో కీలక బాధ్యతల్లో ఉన్నందున సంస్థపై ఆరోపణలు, విమర్శలు వస్తే బాధపడుతానని, అందుకే స్పందిస్తున్నానని తెలిపారు. ఎన్నికల సంఘం పటిష్టతకు తనవంతుగా ఒకటో రెండో పునాది రాళ్లు వేసి ఉన్నానని ఈ దశలో స్పందించడం తన బాధ్యత అన్నారు. త్వరలోనే ఖురేషీ రాసిన డెమోక్రసీస్ హార్ట్‌ల్యాండ్ పుస్తకం ఆవిష్కరణ నేపథ్యంలో ఈ విషయం ప్రస్తావించారు.