Monday, September 15, 2025

బీసీ అస్తిత్వవాదాన్ని నిలపడం ఇప్పుడు తెలంగాణలో పూరించాల్సిన ఖాళీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అస్తిత్వం అన్న మాటకి మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి?

తెలంగాణాకి మాత్రమే పరిమితమైన, ప్రత్యేకమైన గంగా జమునా తెహజీబ్‌లో పెనవేసుకున్న పేగుబంధం. జీవితాన్ని యథాలాపంగా కాక ఒక సం బురంలా గడిపే జీవనం. సబ్బండ వర్ణాలు ఏకమై, కలసి మెలసి జీవనం సాగిస్తూ అన్ని రకాల ఆధిపత్యాల మీద ఎగురవేసే పోరు జెండా. ఒక ధిక్కార స్వరం. తెలంగాణా అస్తిత్వాన్ని ఒక్క మాటలో వివరించలేము. అదొక జీవన విధానం.

సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాల్లో, ఆ అస్తిత్వ ప్రతిఫలం, ప్రయోజనం, విస్తృతి ఎలా ఉంది? ఎలా ఉండాలి అని మీరు అనుకుంటారు?

మీ ప్రశ్నకి ముందు తెలంగాణా, ఏర్పాటు తరువాత అని ఉన్నట్టు అయితే, ఆ అస్తిత్వ ప్రతిఫల నం, విస్తృతి ఈ దశాబ్దంన్నర కాలంలో గణనీయంగానే ఉన్నది. భావితరాలకు తెలంగాణా వారసత్వా న్ని, అందులోనూ బహుజన వారసత్వాన్ని అందించేలా కరికులంలో మార్పులు చేర్పులు చేసుకున్నా ము. సరికొత్త గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నాము. స్థూలంగా, తక్కువ కాలంలో జరగాల్సింది కొంతమేరకు జరిగింది. తెలంగాణ కోసం పోరుబాటలో ముందున్న బడుగు, బలహీన వర్గాలకు దక్కవలసిన వాటా దక్కవలసి ఉంది. తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకించిన ఆధిపత్య వర్గాల వాళ్లే, పదవులు అనుభవిస్తూ వస్తున్నారు. సంపద సృష్టించుకున్నారు. బీసీల చారిత్రక, సామాజిక, సాంస్కృతిక వారసత్వాన్ని, బీసీల దామాషా పద్ధతిలో దక్కాల్సిన సమ వాటాని రాజ్యాంగపరంగా కానీ, అధికారికపరంగా కానీ ఆచరించిన దాఖలాలు లేవు. బహుజన చరిత్ర, సంస్కృతికి సంభవించిన ఆనవాళ్లు ఎక్కడా లేకుండా చేసారు. ప్రభుత్వ కార్యాక్రమాలలో జ్యో తి వెలిగించి, భరత నాట్యం వంటి కళారూపాలతో ప్రారంభిస్తారు. బహుజన కళారూపాలతో ప్రారంభించరు. బహుజన దళిత సాంస్కృతిక చిహ్నాలకు ఎక్కడా చోటు ఉండదు.రాష్ట్ర సాకారం తర్వాత ఆటగాళ్లు మారారు కానీ, ఆటలో గుణాత్మక మార్పు రాలేదు. తమిళ అస్తి త్వం లాగా తెలంగాణ అస్తిత్వం చిరకాలం నిలవాలంటే, బీసీ అస్తిత్వ ఖాళీని అది పూరించాలి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సృజన రంగంలో తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకి, విస్తరణకి చోటు దొరికిందా? ఎలాంటి నూతన మార్పులు జరిగా యి అనుకుంటున్నారు?

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువా త సాహిత్య, సాంస్కృతిక కళా రంగాలలో గణనీయమైన మా ర్పు కనిపించింది. అయితే ఆ మార్పు విస్తృతి అనుకున్నంతగా, ఉండవలసినంతగా లేదు. దివంగతులైన తెలంగాణా కవులను, రచయితలను స్మరించుకోవడం, పాఠ్య పుస్తకాలను సవరించుకోవడం, లాంటి విషయంలో విస్తరణకు చోటు దొరికింది అని అనిపిస్తుంది. కానీ అది పాక్షిక సత్య మే! ఉదాహరణకి తెలంగాణా సినిమా రంగానికి సంబంధించి అవార్డులు ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఆ నిర్ణాయక కమిటీకి ఆంధ్రా వాళ్ళను చైర్మన్‌గా చేయడం లాంటివి అస్సలు నప్పని విషయాలు. సందర్భం వచ్చిన ప్రతిసారీ రెండు తెలుగు రాష్ట్రాలు అని, ఆంధ్రాతో ఈక్వేట్ చేసి మాట్లాడినట్టు కనిపిస్తుంది కానీ ఇంకా చాలా చోట్ల ఆంధ్రా ఆధిపత్యమే కొనసాగుతున్నది. సాహిత్య అకాడమీ అవార్డులలో గత పదేళ్లలో తెలంగాణా వాళ్లకు వచ్చిన అవార్డులు ఎన్ని? ఇలా లోలోపలికి వెళితే చాలా వున్నాయి.

మరీ ముఖ్యంగా గ్లోబలీకరణ అనంతర పరి స్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా సృజన రంగంలో, ఎంతో వేగవం తంగా వివిధ రకాల సంస్కృతుల కలగ లుపు జరుగుతున్న స్థితిలో ఉంది. తెలంగాణా స్వీయ అస్తిత్వేతర సంస్కృతులు, సాహిత్య, కళారంగాల నుండి మంచిని తెలుసు కోవడం, నేర్చుకోవడం, తమ సృజనాత్మక రంగాల్లో సమ్మిళితం చేసుకోవడం అవసరమను కుంటున్నారా?

ఇది ఒక్క తెలంగాణా సృజన రంగానికే కాదు అన్ని ప్రాంతాల, అన్ని భాషల సృజన రంగాలకు అవసరమే! ఆదాన ప్రదానాలు లేకపోతే ఏ రంగమైనా నిలువ నీటిలాగా నిలిచి, కొంతకాలానికి పనికిరాకుండా పోతుంది. సృజనకు సంబంధించిన సరికొత్త అంశం ఏదైనా తనలోకి తీసుకోవడం తెలంగాణాకి ఆదినుండి అలవాటే.

తెలంగాణా అస్తిత్వ, సంస్కృతి పరిరక్షణ కోసం నిర్దిష్టంగా మీరు చేసే సూచనలు ఏమిటి?

మరుగునపడిన తెలంగాణా రచనలను ఇంకా వెలుగులోకి తీసుకుని రావలసే ఉన్నది. ఉద్యమ కాలం లో తిరిగి రాయటం మొదలుపెట్టిన తెలంగాణా చరిత్రలోనూ బహుజన దృక్పథంతో చూసినప్పుడు కొన్ని ఖాళీలు ఉన్నాయి. వాటిని పూరించాలి. గ్లోబల్ ఆలోచనలతో, స్థానిక కార్యాచరణకి మెరుగు పెట్టాలి.బీసీ కవులు, రచయితలు, కళాకారులు, సృజనకారులు, సామాజిక కార్యకర్తలు తమకున్న భిన్నభావజాలాలను స్థిరంగా ఉంచుకుంటూనే బీసీ కులాల నుంచి వచ్చిన తాము, తమ వర్గాలకు చేయవలసినదేమిటన్న ప్రశ్నకు జవాబుదారీగా ఉండాలి. నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో ఎత్తుపల్లాలను జయిస్తూ, బీసీ అస్తిత్వం నిలబెట్టేందుకు కృషి చేయాలె. సృజనకారులు బీసీ ఐక్యతను సాధించాలి. సాహిత్యం లో బీసీ అస్తిత్వాన్ని అణచిపెట్టే ఆదిపత్యాల కుట్రలను గమనించి వాటిని ధిక్కరించాలి. తెలంగాణ అస్తిత్వవాదం గెలిచింది. ఇక ఇపుడు పూరించాల్సిన ఖాళీ బీసీ అస్తిత్వవాదాన్ని నిలపాలి. అదే తెలంగాణ అస్తిత్వవాదాన్ని పరిపూర్ణం చేస్తుంది.

జూలూరి గౌరీశంకర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News