Monday, September 15, 2025

అంతా మిథ్యేనా

- Advertisement -
- Advertisement -

కనురెప్పల మాటున కలల స్వప్నం
అవనికి పచ్చని చీర కట్టినట్టు ప్రకృతి సోయగం
నీలి ఆకాశానికి గొడుగు పట్టినట్టు రంగు రంగుల హరివిల్లు
అంటీ అంటనట్టు తామరాకు మీద ఉన్న నీటి బిందువులు
పింఛం విప్పి నాట్యమాడుతున్న మయూరి
రివ్వున ఎగిరే తుమ్మెదలు చేసే వినసొంపైన సంగీతం
ఎత్తయిన గిరుల నుంచి జాలువారుతున్న జలపాతపు సవ్వడులు
కొండ కోనల నడుమ మెలికలు తిరుగుతూ
గలగలా ప్రవహించే నదీ ప్రవాహం
లేడి పిల్లల చెంగు చెంగున గంతులు

మల్లె పువ్వుల సుగంధ పరిమళాలతో
ఆ ప్రాంతం భూలోక స్వర్గాన్ని
తలపిస్తోంది
నా మనసుకు రెక్కలొచ్చి
స్వేచ్ఛగా స్వైర విహారం చేస్తోంది
సువిశాలమైన ప్రకృతి నడుమ
హాయిగా సంచరించడం
అనుభూతిని కలిగిస్తోంది
ఇంతలో జలపాతపు తుంపరులు
నా వదనాన్ని తాకుతునట్లనిపించింది

కళ్ళు తెరచి చూసే సరికి
ఎదురుగా అమ్మ చేతిలో నీళ్ళ చెంబు
అదే అరిగిపోయిన సీలింగ్ ఫ్యాన్
గిరా.. గిరా.. రొట్టకొట్టుడు శబ్ధం
కిటికీ సందుల్లోంచి కాంతి కిరణాల నడుమ
ధూళి కణాలు నా చెంపను తాకుతున్నాయ్
తనువు వెళ్లలేక, తలపుతో తృప్తిపడుతూ
అంతా, మిథ్యేనా అనుకున్నా

కోనేటి నరేష్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News