కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పది కోట్ల రూపాయల పరువునష్టం దావా వేశారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణ చేశారని పేర్కొంటూ రూ. 10 కోట్లకు సిటిసివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని ఆగస్టు 11వ తేదీన సంజయ్‌కు కెటిఆర్ లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణ చెప్పడానికి బండి సంజయ్ నిరాకరించడంతో కెటిఆర్ సిటిసివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన సిటిసివిల్ కోర్టు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 15వ తేదీన హాజరు కావాలని ఆదేశించింది.
ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిరాధార ఆరోపణలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, కెటిఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్‌ఐబి (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) దుర్వినియోగం, ఫోన్ ట్యాపింగ్, ఆర్ధిక అవకతవకలకు సంబంధం ఉందని ఆరోపించారన్నారు. ఈ వ్యాఖ్యలు పలు టీవి చానెళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో తన పరువుకు భంగం కలిగిందని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు. బండి సంజయ్ కేవలం రాజకీయ కక్షతో విపరీతమైన నిందారోపణలతో దుష్ప్రచారానికి పాల్పడ్డారని కెటిఆర్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి ఇటువంటి భాధ్యతారహితమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజాప్రతినిధుల విశ్వసనీయత, గౌరవం పట్ల తీవ్రమైన పరిణామాలు ఉంటాయని పిటిషన్‌లో వివరించారు.
కెటిఆర్ డిమాండ్లు
నిరాధార ఆరోపణలు చేసిన బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చేప్పాలని పిటిషన్‌లో కెటిఆర్ డిమాండ్ చేశారు. తన పరువు నష్టం కలిగించే విషయాలను ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా నిందితులను నిరోధించే ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, మీడియా పోర్టల్‌స నుంచి పరువు నష్టం కలింగించే కథనలు వీడియోలు, పోస్టులు తక్షణమే తొలగించాలని కెటిఆర్ తన డిమాండ్‌లను పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also Read:అంధకారంలో 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు : కెటిఆర్