Monday, September 15, 2025

ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను ప్రభుత్వం ఇష్టారీతిన మారుస్తోంది: హరీష్‌రావు

- Advertisement -
- Advertisement -

రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) కోసం అలైన్‌మెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిన మారుస్తోందని, రైతులు తమ భూములు కోల్పోకుండా నిలదీస్తామని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు.సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గ్రామాల రైతులు సోమవారం హరీష్ రావును కలిశారు. ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. అలైన్‌మెంట్ మార్చి పేద రైతుల పొట్ట కొట్టడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ అనాలోచిత చర్యల వల్ల రైతులు భూములు కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. సిఎం సొంత భూములకు మేలు కలిగేలా అలైన్‌మెంట్ మార్చడం దుర్మార్గం అని మండిపడ్డారు. రైతుల ఆవేదన సిఎం రేవంత్‌రెడ్డికి అర్థం కావడం లేదా..? అని ప్రశ్నించారు. అలైన్‌మెంట్ మార్పుతో కేంద్రం ఆర్‌ఆర్‌ఆర్‌ను తిరస్కరించే పరిస్థితి ఉందని అన్నారు.

రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌తో రేవంత్ రెడ్డి ఆడుతున్న ఆటలు పేద రైతులకు శాపంలా మారాయని మండిపడ్డారు. ఉత్తర భాగాన అలైన్‌మెంట్ మార్పు వల్ల సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలంలోని గిరిమాపూర్, తుమ్మరపల్లి, అలియాబాద్, మారేపల్లి, రాంపూర్ తాండ, గోటిలగుట్ట తండా,మాచేపల్లి తండా, శివన్న గూడెం, గంగారం గ్రామాలు తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. ఈ గ్రామాల్లో ఎక్కువగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, రైతులే ఉన్నారని, అలైన్‌మెంటు మార్పుతో పేద బడుగు బలహీనవర్గాలకు చెందిన రైతులే తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. రైతులు భూములు కోల్పోకుండా మొదటగా త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను బిఆర్‌ఎస్ ప్రభుత్వం గిర్మాపూర్ చేవెళ్ల మీదుగా ప్రతిపాదించిందని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం తన స్వలాభం కోసం వికారాబాద్, పరిగి, కొడంగల్ మీదుగా ట్రిపుల్ ఆర్ మార్గాన్ని అష్టవంకరలుగా తిప్పుతూ పచ్చటి పొలాలను మాయం చేసే కుట్రకు తెరలేపారని ఆరోపించారు.

సొంత భూముల కోసం అలైన్‌మెంట్లు మార్చడం వల్ల వేల కోట్ల భారం రాష్ట్ర ప్రజలపై పడుతున్నదని అన్నారు. అందిన కాడికి దోచుకోవడం కోసం త్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మారుస్తున్న తతంగంపై వెంటనే విచారణ జరగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం,రైతుల ప్రయోజనాలు ఫణంగా పెట్టే చర్యలు ఆపకపోతే బిఆర్‌ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. సమస్యను పరిష్కరించే వరకు భారత రాష్ట్ర సమితి పోరాటం చేస్తుందని హరీష్‌రావు తెలిపారు.

Also Read: బండి సంజయ్‌పై పది కోట్ల పరువు నష్టం దావా వేసిన కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News