న్యూఢిల్లీ: ఉత్తర జార్ఖండ్‌లోని బోకారో ప్రాంతంలో నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం అన్నారు. సోమవారం ఉదయం జార్ఖండ్‌కు చెందిన హజారీబాగ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు తుడిచిపెట్టుకుపోవడంతో నక్సలిజం ఈ ప్రాంతంలో తుడిచిపెట్టుకపోయినట్లేనని పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో సహదేవ్ సోరెన్ అలియాస్ పర్వేశ్, రఘునాథ్ హేంబ్రమ్ అలియాస్ చంచల్, బీర్‌సేన్ గంఝు అలియాస్ రామ్‌ఖేలవన్ హతయ్యారని, వారి మీద బూరి బహుమతి కూడా ఉందని పోలీసులు తెలిపారు. సహదేవ్ సోరెన్‌పై రూ. 1కోటి, రఘునాథ్ మీద రూ.25 లక్షలు, గంఝు మీద రూ. 10 లక్షల రివార్డు ఉందని ఐజి(ఆపరేషన్స్) తెలిపారు.
బొకారో, గిరిదిహ్‌కు చెందిన పంతిత్రి అడవుల్లో కోబ్రా, హజారీబాగ్, గిరిదిహ్ పోలీసు సిబ్బంది ఈ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సమాచారం. గత రెండు రోజుల్లో భద్రతా బలగాల సిబ్బంది, నక్సల్స్ మధ్య జరిగిన రెండో ఎదురుకాల్పులు ఇవి. ‘ఈ ఆపరేషన్ తర్వాత, ఉత్తర జార్ఖండ్‌లోని బొకారో ప్రాంతంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోయింది. త్వరలో యావత్ దేశం కూడా నక్సలిజం సమస్య నుంచి విముక్తం అవుతుంది’ అని షా ‘ఎక్స్’లో హిందీ పోస్ట్ పెట్టారు. 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి నక్సలిజంను తుడిచివేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు.