గత రెండు నెలలుగా మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా భయపెట్టిన చిరుత ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. దీంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు, మూడు నెలలుగా పట్టణంలోని తిరుమల దేవుని గుట్ట, వీరన్న పేట తదితర కాలనీలలో చిరుత కనిపించింది. మరికొద్ది రోజులకు చిరుత గుట్ట మీద కొచ్చి సేద తీరడం , తిరిగి వెళ్లిపోవడం చేసింది. ఒక్కొక్కసారి ఇండ్ల సమీపంలో కూడా చిరుత సంచరిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు సమాచారం ఇవ్వడంతో అది చిరుతా, కాదా అనే నిర్ధారణకు కూడా వారు కూడా మొదట రాలేకపోయారు. అయితే, మళ్లీ చిరుత సంచారం కనిపించడంతో చర్యలకు ఉపక్రమించారు.
డ్రోన్ల సహాయంతో దాని జాడ కనిపెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగపడలేదు. చిరుత సంచార ప్రాంతంలో బోనులో మేకను ఉంచి కూడా అధికారులు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ చిరుత తప్పించుకుంది. ఎట్టకేలకు అటవీ అధికారులు మరో బోను ఏర్పాటు చేయడంతో ఆదివారం ఆ బోనులో చిరుత చిక్కింది. అటవీ అధికారులు సిసి కెమెరాల ఆధారంగా గుర్తించి దానిని బంధించారు. బోనులో చిక్కిన చిరుత పారిపోయేందుకు జరిగిన ప్రయత్నంలో నోటికి గాయాలయ్యాయి. బోనులో ఉన్న చిరుతను అటవీ అధికారులు తీసుకొని వెళ్లారు. దీంతో రెండు చిరుత భయంతో వణికిపోయిన ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
Also Read: బండి సంజయ్‌పై పది కోట్ల పరువు నష్టం దావా వేసిన కెటిఆర్