Tuesday, September 16, 2025

కొడంగల్‌లో అంగన్‌వాడీల మెరుపు ధర్నా

- Advertisement -
- Advertisement -

ప్రీప్రైమరీ వ్యవస్థతో అంగన్‌వాడీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతుందని, ప్రీప్రైమరీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు వికారాబాద్ జిల్లా, కొడంగల్‌లో కదం తొక్కారు. కొడంగల్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి ముందు భారీ ఎత్తున అంగన్‌వాడీ కార్యకర్తలు గుమికూడి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సిఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ధర్నా నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఒక దశలో పోలీసులపై అంగన్‌వాడీ కార్యకర్తలు, పోలీసులు ఒకరిపై ఒకరు చేయి చేసుకునేంతగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి చేయి దాటిపోతున్న సందర్భంగా రంగంలోకి దిగిన పరిగి డిఎస్‌పి శ్రీనివాస్, కొడంగల్ సిఐ శ్రీధర్‌రెడ్డి సమయస్ఫూర్తితో వ్యవహరించి అంగన్‌వాడీ కార్యకర్తలను శాంతింపజేశారు. అనంతరం వారిని కొడంగల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అంగన్‌వాడీ కార్యకర్తలకు మద్దతుగా వచ్చిన సిఐటియు నాయకులను సైతం పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా అంగన్‌వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ.. ప్రీప్రైమరీ వ్యవస్థను తీసుకురావడం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలు పూర్తి స్థాయిలో నిర్వీర్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రాథమిక పాఠశాలల్లో స్వీపర్లుగా పనిచేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రీప్రైమరీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ వ్యవస్థ ప్రారంభం నుండి చాలీచాలని వేతనాలతో జీవితాలను గడుపుతూ చిన్నారులకు సేవచేస్తున్న తమను ప్రభుత్వం గుర్తించకపోగా వ్యవస్థ మనుగడకే ముప్పు తీసుకురావడం ఎంతో శోచనీయమన్నారు. ప్రీప్రైమరీ వ్యవస్థ రద్దుతో పాటు అంగన్‌వాడీ వ్యవస్థ బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు వారిని పొంత పూచీకత్తుపై వదిలివేశారు.

Also Read: బండి సంజయ్‌పై పది కోట్ల పరువు నష్టం దావా వేసిన కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News