ప్రజలకు పాస్‌పోర్టు సేవలు మరింత చేరువ కానున్నాయి. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్, రాయదుర్గంలో పాస్‌పోర్ట్టు సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని రాయదుర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పీఏసీ చైర్మెన్ ఆరెకపూడి గాంధీ, తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పాస్‌పోర్టు సేవా కేంద్రం జాయింట్ సెక్రటరీ డాక్టర్ కె.జె శ్రీనివాస్, రీజినల్ పాస్ పోర్టు అధికారి స్నేహజ, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సామాన్యులకు సైతం పాస్ పోర్టు సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. హైదరాబాద్ లో కొత్తగా మరో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా కేంద్రం చొరవ చూపాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు.
నగరం నలువైపులా వేగంగా అభివృద్ధి చెందుతోందని, రోజురోజుకీ పెరుగుతున్న జనాభాకు మరింత మెరుగైన సేవలు అందాలంటే మరో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అవసరమని ఈ సందర్భంగా ఆయన వివరించారు. అన్ని హంగులతో సకల సౌకర్యాలతో పాస్‌పోరు ్ట సేవా కేంద్రం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. శేరిలింగంపల్లి ప్రజలకు పాస్‌పోర్టు కు సంబంధిత సేవలు మరింత చేరువలో, వేగవంతంగా అందుబాటులోకి వస్తాయని, ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏటా దేశవ్యాప్తంగా సగటున కొత్త పాస్‌పోర్టు కోసం కోటి మందికి పైగా దరఖాస్తు చేసుకుంటున్నారని, ఇందులో తెలంగాణ వాటా సుమారు 11 లక్షల వరకు ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గతంలో పాస్‌పోర్టు కోసం నెలల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చేదని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేస్తూ తెలంగాణ పోలీసులు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.
సాంకేతికతను ఉపయోగించుకుని పౌర సేవలను సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజల ముంగిటకే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కొత్త పాస్ పోర్ట్ సేవా కేంద్రం నగర ప్రజలకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఆధార్ కార్డు మాదిరిగా ప్రతి ఒక్కరు పాస్ పోర్ట్ తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. గతంలో గల్ఫ్ దేశాలకు కార్మికుల మాదిరి విదేశాలకు వెళ్లే వారని, ఇప్పుడు విద్యా, ఉపాధి అవకాశాలు నిమిత్తం ఎంతోమంది విదేశాలకు వెళ్తున్నారని తెలిపారు. భారతీయుడిగా గుర్తింపు ఉండడానికి పాస్ పోర్ట్ అవసరమని , అందువల్ల అందరు తీసుకోవాలన్నారు. పాస్‌పోర్టు అనేది భారతీయుల అంతర్జాతీయ గుర్తింపు పత్రం అని, అత్యవసర పరిస్థితుల్లో అవసరం ఏర్పడే ముందే యువత పాస్‌పోర్టు తీసుకోవాలని సూచించారు. కొత్త భవనంలో రోజుకు 1000 స్లాట్లు అందుబాటులో ఉండడం వల్ల సేవల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు.
ఈ కేంద్రం శేరిలింగంపల్లి ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలను అందించడంతో పాటు, అత్యవసర అవసరాల సమయంలో వేగవంతమైన సేవలు అందించేలా రూపుదిద్దుకుందన్నారు. 2014లో దేశవ్యాప్తంగా 110 పాస్‌పోర్టు సేవా కేంద్రాలుండగా, నేడు ఆ సంఖ్య 550కు పైగా పెరగడం ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగించిందని,పాస్‌పోర్టు జారీ ప్రక్రియను సులభతరం చేసి వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంతకుముందు షేక్‌పేట లోని ఆనంద్ సిలికాన్ చిప్ భవనంలో కొనసాగుతున్న పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఇప్పుడు రాయదుర్గం సిరి బిల్డింగ్‌లోని మార్చామని అన్నారు. అత్యాధునిక సదుపాయాలతో మంగళవారం ప్రారంభమైన ఈ కేంద్రం ఇకపై పూర్తిస్థాయిలో ప్రజలకు అన్ని సేవలను అందిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Also Read: ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్..