న్యూయార్క్ : గత కొన్ని దశాబ్దాలుగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక తనపై అసత్య ప్రచారాలని వ్యాప్తి చేస్తోందని ఆరోపిస్తూ ఆ పత్రికపై 15 బిలియన్ డాలర్ల‘(రూ.1.32 లక్షల కోట్ల’)కు అమెరికా అధ్యక్షుడు సోమవారం దావా వేశారు. ఈ పత్రికతోపాటు ఆ పత్రిక జర్నలిస్టులు నలుగురిపై ఫ్లోరిడా లోని యుఎస్ డిస్ట్రిక్టు కోర్టులో దావా దాఖలైంది. తనపై అనేక కథనాలు వ్యతిరేకంగా ప్రచురించారని, దాంతోపాటు ఒక పుస్తకాన్ని కూడా ఆ పత్రిక జర్నలిస్టులు ఇద్దరు రచించి 2024 ఎన్నికల వరకు ప్రచురించారని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ పరువుకు నష్టం కలిగేలా దురుద్దేశ్యపూర్వకంగా ఇవన్నీ ప్రచురించారని దావాలో పేర్కొన్నారు.
అయితే దీనిపై న్యూయార్క్ టైమ్స్ ఇంతవరకు స్పందించలేదు. ఆ పత్రిక రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్ పార్టీకి వర్చువల్ మౌత్‌పీస్‌గా మారిందని , అధ్యక్షపోటీలో నా ప్రత్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా నిలిచిందని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా న్యూయార్క్‌టైమ్ కథనాలు ప్రచురిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌నకు సంబంధాలు ఉన్నాయంటూ ఆ పత్రిక ప్రచురించిన కథనం సంచలనం రేపింది. ఈ కథనాల నేపథ్యంలో ట్రంప్ ఆ పత్రికపై దావా వేశారు. ఇతర మీడియా సంస్థలపై కూడా ట్రంప్ దావా వేశారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ , మీడియా మొగల్‌పై 10 బిలియన్ డాలర్లకు దావా వేశారు. రూపర్ట్ మర్దోక్ అనే ఆస్ట్రేలియన్‌అమెరికన్ వ్యాపారవేత్తకు చెందిన మీడియా మొగల్‌లో అత్యధిక సంపన్నుడు జెఫ్రీ ఎపిస్టీన్‌తో ట్రంప్‌నకు సంబంధాలు ఉన్నాయన్న కథనం జులైలో వెలువడింది.