న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ ప్రక్రియకు బీజేపీ మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి అమిత్‌షా వెల్లడించారు. చొరబాటుదారుల ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా ఢిల్లీ లోని త్యాగరాజ్ స్టేడియంలో స్థానిక ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. “చొరబాటుదారులను కాపాడేందుకే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇటీవల ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించింది. వారి ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. దేశ ఓటర్లను విశ్వసించడం లేదు. హస్తం పార్టీ అసలు స్వరూపాన్ని గుర్తించే సమయం ఆసన్నమైంది. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ప్రత్యేక సమగ్ర సవరణకు బీజేపీ మద్దతిస్తోంది ” అని అమిత్‌షా పేర్కొన్నారు.
ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో 25కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని అమిత్‌షా తెలిపారు. గత 11ఏళ్లలో 60 కోట్ల మంది పేదలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించినట్టు చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడుల ద్వారా ప్రధాని మోడీ దేశ సరిహద్దుల్లో భద్రతను కాపాడుతున్నారని ప్రశంసించారు. ‘ ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పారన్నారు.