భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడలు మేళవింపుతో నూతన విధానం ఉండాలి
విజన్ డాక్యుమెంట్ 2047లో విద్యా విధానానికి ప్రత్యేక అధ్యాయం
విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేపట్టాం
73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం
పేదరిక నిర్మూలనకు విద్య తప్ప మరో ఆయుధం లేదు
తెలంగాణ నూతన విద్యా విధానంపై సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష
తమ అభిప్రాయాలు, అనుభవాలను వెల్లడించిన విద్యావేత్తలు
మనతెలంగాణ/హైదరాబాద్: విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దేశ విద్య విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్న లక్ష్యంతో పిల్లల భవిష్యత్ కోసం ప్రణాళిక బద్దంగా పనిచేయాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గమని, 1 నుంచి 12 తరగతుల వరకు సమూల మార్పులు కావాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ నూతన విద్యా విధానంపై బుధవారం సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో మన విద్యావిధానం సరితూగడం లేదని, ప్రతి యేటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులవుతుంటే వారిలో 15 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖకు రూ.21 వేల కోట్లు కేటాయిస్తే అందులో 98 శాతం జీతాలకే ఖర్చు అవుతుందని సిఎం రేవంత్ చెప్పారు. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడంమే తన ధ్యేయమని, విద్య విషయంలో సమాజానికి మేలు జరుగుతుందంటే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొవడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుత విద్యా విధానంలో భాష ఉన్న వారి దగ్గర జ్ఞానం లేదని, జ్ఞానం ఉన్న చోట భాష లేదని, రెండు ఉన్న చోట నైపుణ్యాలు లేవని, కానీ, ఈ మూడింటి కలబోతగా విద్య ఉండాలని సిఎం పేర్కొన్నారు.
11 వేల ప్రైవేటు స్కూళ్లలో 34 లక్షల మంది విద్యార్థులు
నూతన పాలసీలో భాగంగా విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరగాలని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గతంలో తెలంగాణ విద్యలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయన్నారు. విద్యలో ప్రభుత్వ పాత్ర తగ్గిపోతుందని అందుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. స్కూల్ ఎడ్యుకేషన్‌లో లోపాలు ఉన్నాయని సిఎం రేవంత్ తెలిపారు. 11 వేల ప్రైవేటు స్కూళ్లలో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఆయన చెప్పారు. విద్య కోసం తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్ధిక మంత్రిని కోరినట్లు సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
విద్యా ప్రమాణాల స్థాయిలు పెరగలేదు
గతంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు భూముల పంపకం, నిధుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టేవని, ఇప్పుడు పంపకానికి భూములు, తగినన్ని నిధులు లేవని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం పేదరిక నిర్మూలనకు విద్య తప్ప మరో ఆయుధం లేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా రంగం ప్రాధాన్యతను గుర్తించినందునే తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ దేశంలో విశ్వ విద్యాలయాలు, ఐఐటీలు వంటి ఉన్నత విద్యా సంస్థలను స్థాపించారని సిఎం రేవంత్ గుర్తు చేశారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఉన్న కాలంలో ఉద్యోగావకాశాలకు అనేక పరిమితులు ఉన్నాయని సిఎం అన్నారు. సరళీకృత ఆర్థిక వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగినప్పటికీ విద్యాప్రమాణాలు ఆ స్థాయిలో పెరగకపోవడంతో వాటిని అందిపుచ్చుకోవడంలో మనం విఫలమవుతున్నామని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలు ఒకటో తరగతి
ప్రైవేటు పాఠశాలలు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీతో తరగతులను ప్రారంభిస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ప్రారంభమవుతున్నాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నర్సరీ కోసం ప్రైవేటు పాఠశాలలో చేరిన వారు తిరిగి ప్రభుత్వ పాఠశాలల వైపు చూడడం లేదన్నారు. విద్యార్థుల రాకపోకలు, తగిన శ్రద్ధ చూపుతారన్న కారణంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారని సిఎం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ఆ రకమైన ధీమా కల్పించగల్గితే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చుతారని తెలంగాణ విద్యా విధానం రూపకల్పనలో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సిఎం సూచించారు.
విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయులు
విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయులు ఉండాలన్న ఉద్దేశంతోనే తాము అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని సిఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టేలా వారికి పదోన్నతులు కల్పించడంతో పాటు బదిలీలు చేపట్టామన్నారు. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం చేపట్టామని సిఎం తెలిపారు. ఉస్మానియా, కాకతీయ విశ్వ విద్యాలయాలు గతంలో సైద్దాంతిక భావజాలలకు నిలయంగా నిలిచి ప్రజా సమస్యలపై ఆందోళనలు, ఉద్యమాలు చేపట్టేవని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వ విద్యాలయాల స్థాయి వరకు విద్యా ప్రమాణాలు పడిపోవడం నైపుణ్యాల లేమితో ఉద్యోగాలు లభించకపోవడంతో విద్యార్థులు డ్రగ్స్ బారినపడి జీవితాలను కోల్పోతున్నారని సిఎం అన్నారు. మన చదువులు భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో ఉండాలని సిఎం సూచించారు. దేశంలో ఐటీఐలు ప్రారంభించినప్పుడు ఉన్న డీజిల్ ఇంజన్ మెకానిక్, ఫిట్టర్ వంటి సంప్రదాయ కోర్సులే నేటికీ ఐటీఐల్లో కొనసాగుతున్నాయని సిఎం తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఆధునిక పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అవసరమైన నైపుణ్యాలు అందించే కోర్సులను అందించేందుకు ఐటీఐల్లో కోర్సులను మార్చామని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆశించిన స్థాయిలో తెలంగాణ విద్యా విధానం అమలయ్యేందుకు వివిధ ఫౌండేషన్లు, ఎన్జీఓల సహకారం తీసుకోవాలని సిఎం సూచించారు.
ప్రాథమిక దశ నుంచి యూనివర్సిటీల వరకు సమూల ప్రక్షాళన
ఇప్పటి వరకు విద్యా రంగంపై తాము చేసిన కృషితోనే తాము సంతృప్తి చెందడం లేదని ప్రాథమిక దశ నుంచి యూనివర్సిటీల వరకు సమూల ప్రక్షాళన చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రానున్న 25 ఏళ్ల వరకు విద్యా వ్యవస్థకు దిశానిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని సిఎం అన్నారు. డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించనున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047లో తెలంగాణ విద్యా విధానానికి చోటు కల్పిస్తామని సిఎం వెల్లడించారు. ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక, నైపుణ్య విద్యలుగా విభజించుకొని ఇందులో ఉన్న విద్యావేత్తలు తమ అభిరుచులకు అనుగుణంగా సబ్ కమిటీలుగా ఏర్పడి అత్యుత్తమ డాక్యుమెంట్ రూపొందించాలని సిఎం కోరారు. విద్యా వ్యవస్థ వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం కాకుండా నిరుపేదలకు లబ్ధికలిగేలా ఉండాలని తాము ఆకాంక్షిస్తున్నామని సిఎం తెలిపారు.
గణాంకాల కన్నా నాణ్యత ప్రధానం: కేశవరావు
తెలంగాణ విద్యా విధానం చైర్మన్ కేశవరావు మాట్లాడుతూ విద్యా కమిషన్, ఇతర భాగస్వాములతో తాము విస్తృత సంప్రదింపులు చేశామన్నారు. గణాంకాల కన్నా నాణ్యత ప్రధానమని, విద్యార్థి కేంద్రంగా బోధన ఉండాలన్నది తమ అభిప్రాయమన్నారు. ఏఐ లాంటివి ఎన్ని వచ్చినా అవి గురువుకు ప్రత్యామ్నాయం కావన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐ.వి.సుబ్బారావు మాట్లాడుతూ దేశ యువతలో మూడో వంతు నీట్‌గా ఉన్నారని దాని అర్ధం నాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ అని ఓ సర్వే తేల్చిందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల పెంపునకు చేసిన కృషి అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సేవలను విద్యా రంగానికి వినియోగించుకోవాలని, విద్యా వలంటీర్‌గా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి మాట్లాడుతూ తాము స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నామని ఒక్క ఏడాదిలోనే 180 పేటెంట్లు పొందామని తెలిపారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. విద్యా విధానం కొలువుల సాధనకే కాకుండా అత్యుత్తమ మానవుడిగా తీర్చిదిద్దేదిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఎమ్మెల్సీలు ఏ.వి.ఎన్.రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, విద్యావేత్తలు మోహన్ గురుస్వామి, ప్రొఫెసర్ సుబ్బారావు, సీఐఐ శేఖర్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, అక్షరవనం మాధవరెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఫ్రొపెసర్ గంగాధర్, విశ్రాంత ఐఏఎస్‌లు మిని మాథ్యూ శ్రీమతి రంజీవ్ ఆచార్య, ప్రొఫెసర్ శాంతా సిన్హా తదితరులు మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, అధికారులు జయేశ్ రంజన్, శ్రీదేవసేన, కృష్ణ ఆదిత్య, నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: