దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులపై వివాదం కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కోర్టులో తీవ్ర వాదోపవాదాల అనంతరం ధర్మాసనం ఇచ్చిన పాక్షిక ‘స్టే’తో ముస్లింలలో కొంత ఉపశమనం, మరి కొంత నిరుత్సాహం కలిగించింది. తుది తీర్పు వెల్లడించే వరకు, ముస్లింలకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగించాలని ముస్లిం సంఘాలు, మత పెద్దలు నిర్ణయించారు. మరోవైపు మజ్లీస్ పార్టీని మరింతగా బలోపేతం చేస్తూ దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్న ఆ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వక్ఫ్ చట్టం ఓ అస్త్రంగా మారిందని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా ముస్లింలను జాగురుత పరుస్తూ, తమ వైపు తిప్పుకోవడానికి ఇదొక సదవకాశంగా, బలమైన ఆయుధంగా పరిణమించింది. వక్ఫ్ చట్టాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలను ఎదుర్కొకుండా ముందుగానే జాగ్రత్త పడ్డారు.
ఒకవైపు ముస్లిం పర్సనల్ లా బోర్డు ముందుండి న్యాయ పోరాటం చేస్తుండగా, అసద్ లోక్‌సభలో చట్టానికి వ్యతిరేకంగా గొంతెత్తడం, మరోవైపు మజ్లీస్ పార్టీ తో పోరాటాలు చేయిస్తూ ప్రజాక్షేత్రంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే చర్యలకు దిగారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ 18న నాంపల్లి దారుస్సలాంలోని మజ్లీస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచీ జనాలు తరలి వచ్చారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు బ్యానర్‌పై ఈ బహిరంగ సభ నిర్వహించినా, ప్రాంగణం మాత్రం మజ్లీస్ పార్టీదే. జమాయితీ ఉలేమా-ఇ-హింద్ వంటి సంస్థలు మద్దతు ప్రకటించగా, ఆమ్ఆద్మీ పార్టీ, సిపిఐ, డిఎంకె, జెడియు కూడా మద్దతు ప్రకటించాయి. బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలనూ ఆహ్వానించగా, ఆ పార్టీ చోటా నాయకులను పంపించాయి.
ఇంకా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లోనూ మజ్లీస్ సభలు నిర్వహించింది. నెక్లెస్ రోడ్డులో క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. జిల్లా కేంద్రాల్లోనూ ఆందోళనలు కొనసాగించింది. నగరంలోని మాసాబ్ ట్యాంక్ వద్ద గల హాకీ స్టేడియంలో మహిళా సదస్సు నిర్వహించింది. ఇలా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్లోనూ అసద్ సభలు, సమావేశాలు నిర్వహించి వక్ఫ్ సవరణ చట్టంతో ముస్లిం సమాజానికి ఎదురవుతున్న నష్టం గురించి వివరించారు. మజ్లీస్ పార్టీ అనేగానే ఆ పార్టీ పాతనగరానికే పరిమితమనే భావన దేశవ్యాప్తంగా ఉంది. హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి అసద్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇంకా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను కైవసం చేసుకుని తిరుగులేని పార్టీగా మనుగడ సాగిస్తున్నారు. మజ్లీస్‌ను ఓడించేందుకు వివిధ పార్టీలు ప్రయత్నించి విఫలమయ్యాయి.
ముఖ్యంగా మజ్లీస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన మజ్లీస్ బచావో తహరిక్ (ఎంబిటి) ఎదురొడ్డి నిలవలేకపోయింది.మజ్లీస్ పార్టీ శాఖలను వివిధ రాష్ట్రాలకూ విస్తరించాలన్న బలమైన సంకల్పం, పట్టుదలతో అసద్ ఉన్నారు. అసదుద్దీన్ ఒవైసీ తాత ఫక్రీం మిల్లత్ అబ్దుల్ వాహీద్ అఖిల భారత మజ్లీస్ ఇత్తేహదుల్ ముస్లీమీన్ (ఎఐఎంఐఎం) ను స్థాపించారు.ఆ రోజుల్లోనే అబ్దుల్ వాహీద్ ప్రముఖ న్యాయవాదిగా, ఇస్లాం స్కాలర్‌గా పేరు గడించారు. కుల, మతాలకు అతీతంగా, అణగారిన పేద ప్రజలకు అండగా నిలవాలన్న సంకల్పంతో మజ్లీస్‌ను ఒక స్వచ్ఛంద సంస్థగా స్థాపించారు. కాలక్రమేణా రాజకీయ పార్టీగా అవతరించింది. అసద్ తండ్రి ‘సాలార్’గా పేరొందిన సుల్తాన్ సలావుద్దిన్ ఒవైసీ కూడా ఈ దిశగా పార్టీని ముందుకు నడిపించడంలో కృతకృత్యులయ్యారు. పార్టీ పరిమితిని పాతనగరానికే కాకుండా వివిధ రాష్ట్రాలకు విస్తరించాలని మహారాష్ట్ర, కర్నాటకలో పలు ఎన్నికల్లో ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కడప, కర్నూలు తదితర ప్రాంతాల్లో శాఖలను విస్తరించారు.
ఇప్పుడు అసద్ దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఎంపి, ఎంఎల్ఎ, కార్పొరేషన్ల ఎన్నికల్లో తన బలమైన అభ్యర్థులను దించుతూ ముందుకు సాగుతున్నారు. ఇక్కడ కూడా అసద్ వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నారు. అసోంలో ఎఐయుడిఎఫ్, కేరళలో ముస్లిం లీగ్, కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి ఉన్నందున, ఆ రాష్ట్రాల్లోకి మజ్లీస్‌ను తీసుకెళ్ళే ప్రయత్నం చేయడం లేదు. అక్కడ కూడా మజ్లీస్ శాఖలను విస్తరిస్తే అక్కడ ముస్లింలకు అండగా ఉన్న పార్టీలకు నష్టం కలుగుతుందనేది ఆయన భావన. ఈ రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాల్లో మజ్లీస్‌ను విస్తరించేందుకు కృషి చేస్తున్న అసద్ చేతికి ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్టం ఓ ఆయుధంగా అవకాశం కలిసి వచ్చింది. వక్ఫ్ ఆస్తులన్నీ రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధనను వక్ఫ్ సవరణ చట్టంలో పొందుపరచడం ముస్లిం వర్గాలను షాక్‌కు గురి చేసింది. దేశం లో వందల ఏళ్ళుగా వేల సంఖ్యలో ‘వక్ఫ్ బై యూజర్’ (అంటే ఎలాంటి పత్రాలు లేకుండా) ఆస్తులు ఉన్నాయని మజ్లీస్తోపాటు వందకు పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.
ఇతర సామాజిక వర్గానికి చెందిన వారిని వక్ఫ్ బోర్డులో సభ్యులుగా నియమించాలని సవరణ చట్టంలో పేర్కొనడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు పిటీషనర్లు. హిందూ మత ట్రస్టు బోర్డుల్లో అన్యమతస్థులకు, ముఖ్యంగా ముస్లింలకు చోటివ్వగలరా? అని సుప్రీం కోర్టు డిఫెన్స్ లాయర్‌ను ప్రశ్నించడంతో ముస్లిం సంఘాలు, ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇంకా అసద్ హర్షం వ్యక్తం చేశారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించి కలెక్టర్ల నిర్ణయాధికారాన్ని కోర్టు నిలిపివేయడం, వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరుల సంఖ్యను కుదించడం వంటి ఆదేశాలతో తాత్కాలిక ‘స్టే’ తో 128 పేజీలతో ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. అత్యున్నతమైన న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, న్యాయం జరుగుతుందన్న భావన ముస్లిం వర్గాల్లో వ్యక్తమవుతోంది. వక్ఫ్ చట్టాన్ని కేంద్రం పూర్తిగా విరమించుకునేంత వరకూ న్యాయ, ప్రజా పోరాటాలు కొనసాగించాలని మజ్లీస్తోపాటు అనేక ముస్లిం సంఘాలూ పట్టుదలగా ఉన్నాయి. దీనిపై కోర్టు మధ్యంతర తీర్పే కాబట్టి తుది తీర్పు వరకూ వేచి చూడాల్సిందే.
Also Read : దేశానికి దిక్సూచిలా మన విద్యా విధానం
- వీరన్నగారి ఈశ్వర్‌రెడ్డి
98499 98086