Thursday, September 18, 2025

నిరుద్యోగులతో ఎందుకీ చెలగాటం?

- Advertisement -
- Advertisement -

ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత నిరుద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి. చేసిన బలిదానాలకు అర్థం లేకుండాపోయింది. ప్రారంభించిన ఉద్యమాలు, ఆత్మార్పణలు అన్నీ వృథా ప్రయాసే అనే నిరాశలో, నిరుత్సాహంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఒక రకమైన మానసిక సంఘర్షణ చేస్తున్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో దశాబ్దాలుగా ఉద్యోగాల కోసం ఈ ప్రాంత నిరుద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటారు. విసుగు చెంది ఇక స్వరాష్ట్రంలోనే తమ ఆకాంక్షలు నెరవేరుతాయని 1969 లో తొలి తెలంగాణ ఉద్యమం నడిపి విద్యార్థులు అమరులయ్యారు. ఆ తర్వాత కూడా ఈ ప్రాంత విద్యార్థి, నిరుద్యోగులకు నష్టం జరగడాన్ని తట్టుకోలేక మలిదశ తెలంగాణ ఉద్యమం లో 1200 మంది ఆత్మార్పణ చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను దేశానికి అర్థం అయ్యేలా చేశారు.

ఇది చరిత్ర.. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు 2014 అయ్యాక కూడా నిరుద్యోగులు, విద్యార్థుల ఆకాంక్షలు ఆవిరై ఒకతరం భవిష్యత్ నాశనం అయింది. వేసిన ఉద్యోగ ప్రకటనలు అయితే కోర్టు మెట్లు ఎక్కడంతోనే మొదటి దఫా ప్రభుత్వం పనితనం అయింది. రెండో దఫా ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు లీకేజీలతో గడిచింది. దీనితో విసుగు చెందిన నిరుద్యోగ, విద్యార్థి యువకులు మొన్న జరిగిన ఎన్నికలలో నూతన ప్రభుత్వం కోసం గత ప్రభుత్వాన్ని తిరస్కరించారు. ప్రస్తుత ప్రభుత్వం గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా మొదటగా టిఎస్‌పిఎస్‌సి బోర్డ్‌ను ప్రక్షాళన చేశారు. ఇంకా టిఎస్‌పిఎస్‌సిలో ఖాళీగా వున్న ఉద్యోగాలను మొదటగా భర్తీ చేసిన తర్వాతే ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాలని అనుకున్నారు.

వేసే ఉద్యోగ ప్రకటనలు కోర్టుమెట్లు ఎక్కకుండా జాగ్రత్త తీసుకోవాలి అని, ఉద్యోగ క్యాలెండర్ మేనిఫెస్టోలో చేర్చారు. నోటిఫికేషన్ వచ్చాక మాత్రం ఒక సంవత్సరంలో పూర్తి అయ్యేలా జవాబుదారీతనంతో, పారదర్శకతతో చేస్తేచాలని కోటి ఆశలతో వున్నారు. వివిధ ఉద్యోగ ప్రకటనలకు అర్హత వున్న అందరూ ఎగ్జామ్ రాసేలా సమయాన్ని ఇచ్చేలా ప్రణాళికతో నిర్వహించాలని తలచారు. కానీ జరిగింది, జరుగుతున్నది చూస్తుంటే నిరుద్యోగులకు అన్యాయం ఇప్పటికీ జరుగుతున్నదని తెలుస్తున్నది. ఎందుకంటే గ్రూప్ 2 ఎగ్జామ్‌ను పోస్ట్‌లు పెంచకుండా వాయిదా వేశారు. గ్రూప్ 3 పోస్ట్‌లను కూడా పెంచలేదు. గ్రూప్1 పరీక్షపై అనేక నీలినీడలు వున్నాయి. దాదాపు 20 రకాల కేసులు హైకోర్టులో పెండింగ్‌లో వున్నాయి.

కానీ కోర్టులో అఫిడవిట్ వేయడం టిజిపిఎస్‌సికి రావట్లేదు. అసలు సమస్య జిఒ నెంబర్ 55ను తీసివేసి జిఒ నంబర్ 29 ను తీసుకొచ్చి రిజర్వేషన్ సూత్రానికి విరుద్ధంగా ప్రిలిమ్స్‌లో పాస్ అయిన అభ్యర్థులను మెయిన్స్‌కి ఎంపిక చేశారు. ప్రిలిమ్స్ పరీక్షలో క్వశ్చన్‌లకు జవాబులు తప్పుగా ఇచ్చారని అభ్యర్థులు కమిషన్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా కూడా పట్టించుకోకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూర్ఖంగా వ్యవహరించింది. ఇలా చేసే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎపిపిఎస్‌సి 2011లో ఇచ్చిన గ్రూప్ 1 రెండుసార్లు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మెయిన్స్ ఎగ్జామ్స్‌పై పలు కేసులు వేయడం వలన వాటిని విచారణ చేసిన హైకోర్టు నిన్న తీర్పును వెలువరిస్తూ మెయిన్స్ మూల్యాంకనం మళ్ళీ చేయాలని, అది సాధ్యం కాకపోతే మళ్ళీ మెయిన్స్‌ను నిర్వహించాలని తీర్పు ఇచ్చింది.

గత ప్రభుత్వంలో రెండు సార్లు ప్రిలిమ్స్‌ను రద్దు చేశారు. ఇప్పుడు ప్రిలిమ్స్ నిర్వహించినా అనేక అపోహలు, అనుమానాలు, అపార్థాలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తీరని మానసిక వేదన, ఆవేదనతో ఇబ్బందిపడ్డారు. కేసులో అన్నీ కోర్టు పరిధిలో పరిష్కరించాకే మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని తమ బాధను, మూగ వేదనను ఎవరి చెప్పాలో తెలియక మానసిక క్షోభను అనుభవిస్తూ మెయిన్ ఎగ్జామ్స్ రాశారు. కానీ తుదకు ఈ రోజు సెలెక్ట్ అయిన అభ్యర్థులు, సెలెక్ట్ కాని అభ్యర్థులు ఇద్దరు సంతోషం పోగొట్టుకున్నారు. ప్రభుత్వం ఒక రకంగా యుద్ధప్రాతిపదికన గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను పరీక్షలు నిర్వహించి, రిజల్ట్ ప్రకటించి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చింది. కానీ గ్రూప్1 విషయం లో కూడా ఎగ్జామ్ నిర్వహించాలని అనుకుందే కానీ నిరుద్యోగుల అపోహలను గుర్తించలేకపోయింది.

ప్రభుత్వ తప్పు ఇక్కడ లేకున్నా టిజిపిఎస్‌సి ఏం చేస్తున్నట్టు? ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరు చైర్మన్‌లు మారినా ఈ అవకతవకలకు ముగింపు పలుకలేరా? వీరికి సరిగా ఎగ్జామ్స్ నిర్వహించడం రాకపోతే చాలా మంది నిరుద్యోగులు వున్నారు. వారి ద్వారా టిజిపిఎస్‌సి బోర్డు ఏర్పాటు చేస్తే వారే తోటి నిరుద్యోగులకు పారదర్శకంగా, జవాబుదారీగా, విజయవంతంగా నిర్వహించి చూపిస్తారు. గత ప్రభుత్వం లాగే ప్రతిదీ కోర్టు మెట్లు ఎక్కితే జాబ్ క్యాలెండర్ వేసి ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారు? వీటన్నింటికీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించాలి. అనుమానాలు, అపోహలను తొలగించాల్సిన బాధ్యత రాజ్యాంగ సంస్థ అయిన పబ్లిక్ సర్వీస్‌కమిషన్‌పై వుంది. ప్రభుత్వం కూడా తగిన చొరవ తీసుకోవాలి. గత ప్రభుత్వ తప్పులను ఈ ప్రభుత్వం కూడా చేస్తే ఇక నిరుద్యోగుల ఆకాంక్షలు ఎవరు తీర్చాలి? ఇంకా ఎన్ని దశాబ్దాలు ఈ అన్యాయం చూస్తూ వుండాలి? తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాల్సిన అవసరం వుంది.

ఇప్పటికే ఒక తరానికి అన్యాయం జరిగింది. ఇంకో తరానికి అదే జరుగుతున్నది. నిరుద్యోగుల జీవితాలు గత 12 సంవత్సరాల్లో తలకిందులు అయ్యాయి. నిరుద్యోగులు గ్రామగ్రామాన తిరిగి ప్రజలలో చైతన్యం కలిగించి ఈ ప్రభుత్వ ఏర్పాటులో తగు కృషి చేసిన ఈ రాష్ట్ర నిరుద్యోగులకు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో కూడా తగిన న్యాయం ఇప్పటికీ జరగట్లేదు. ఇప్పటికి అయిన ప్రభుత్వం, మేధావులు మౌనం వీడి జరుగుతున్న పొరపాట్లను సరిచేయాల్సిన తక్షణావసరం వుంది. జాబ్ క్యాలెండర్ యుపిఎస్‌సి తరహాలో ప్రకటించి ప్రతి ఎగ్జామ్‌కి తగిన సమయం ఇవ్వాలి. అవసరం అయితే నిరుద్యోగులతో మీటింగ్ ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ఇవి అన్నీ జరిగేలా, నిరుద్యోగుల జీవితాలలో మార్పు వచ్చేలా చేస్తారని యావత్తు తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ యువకులు తెలియజేస్తున్నారు.

Also Read : రేవంత్ ఓ నియంత: కెటిఆర్

  • ఆర్. భాస్కర్ రెడ్డి
    91105 42007
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News