Thursday, September 18, 2025

ప్రపంచవేదికపై బ్రాహ్మణుల బతుకు చిత్రం

- Advertisement -
- Advertisement -

భారతదేశంలో కుల వ్యవస్థ అనేది సుదీర్ఘమైన చారిత్రక, సామాజిక, ఆర్థిక చర్చలకు కేంద్రంగా ఉంది. ఈ చర్చలు తరచుగా దేశరాజకీయాల పరిధిలోనే కొనసాగుతాయి. కానీ అప్పుడప్పుడు అంతర్జాతీయ వేదికలపైనా వివాదాలను రేకెత్తిస్తాయి. అటువంటి ఒక సందర్భమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో చేసిన వ్యాఖ్యలు. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకొని, దానిని శుద్ధిచేసి పశ్చిమదేశాలకు విక్రయించడం ద్వారా భారతదేశం ‘క్రెమ్లిన్‌కు లాండ్రోమాట్’గా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియలో ‘బ్రాహ్మణులు భారత ప్రజల డబ్బులతో లాభపడుతున్నారు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు అమెరికాలో ‘బోస్టన్ బ్రాహ్మణులు’ అనే పదం సంపన్నమైన, ఉన్నత వర్గాలకు రూపకంగా వాడుకలో ఉన్నప్పటికీ, భారతదేశంలోని సున్నితమైన కులసమస్యను అంతర్జాతీయ రాజకీయాల్లోకి లాగింది. నవరో వ్యాఖ్యలపై భారత రాజకీయ వర్గాల నుంచి తీవ్రమైన, భిన్నమైన ప్రతిస్పందనలు వచ్చాయి.

అధికార పార్టీ బిజెపి ఈ వ్యాఖ్యలను ‘జాతి వివక్ష’, ‘అవాస్తవం’, ‘సాంస్కృతికంగా సున్నితం కానివి’ అని ఖండించింది. అయితే కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ మాత్రం నవరో వ్యాఖ్యలను బహిరంగంగా సమర్థించారు. అగ్ర కులాల యాజమాన్యంలోని కార్పొరేట్ సంస్థలు రష్యా నుంచి చవకగా చమురుకొని, అధిక ధరలకు అమ్ముతున్నాయని, దీనివల్ల సాధారణ భారతీయులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఈ భిన్నమైన ప్రతిస్పందనలు, కుల ఆధారిత చర్చలు విదేశీ వివాదంలో దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించబడ్డాయో స్పష్టం చేస్తాయి. ఒక అంతర్జాతీయ ఆర్థిక సమస్యను కుల ఆధారిత ఆరోపణలుగా మార్చడం, భారత సమాజంలోని కులవిభేదాలు ఎంత సున్నితమైన, శక్తివంతమైన అంశమో తెలియజేస్తుంది. ఈ రాజకీయ ఆరోపణలకు, ప్రతీకారాలకు అతీతంగా బ్రాహ్మణుల ‘దోపిడీ’ అనే వాదనను సూక్ష్మంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

‘దోపిడీ’ అనేది ఒక నిర్దిష్ట వర్గంపై జరుగుతున్న ఆర్థిక, సామాజిక అన్యాయాన్ని సూచిస్తుంది. ఆ వాదన ప్రామాణికతను సంపద, ఆదాయం, ఉద్యోగ ప్రాతినిధ్యం, రిజర్వేషన్ల వంటి అంశాలపై లభించే ఆధారాలు, గణాంకాలు, విద్యాపరమైన అధ్యయనాల ద్వారా విశ్లేషించాలి. బ్రాహ్మణుల సామాజిక, -ఆర్థిక స్థితిగతులపై ఉన్న వివాదాస్పద, విరుద్ధమైన డేటాను నిశితంగా పరిశీలించాలి. మధ్యయుగ భారతదేశంలో క్రీ.శ. 1వ శతాబ్దం మధ్యకాలం నుంచి, బ్రాహ్మణులు కేవలం పురోహితులుగా మాత్రమే కాకుండా వ్యవసాయదారులు, వ్యాపారులు, యోధులుగా, పాలకులుగా కూడా పనిచేశారని అనేక చారిత్రక గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఉదాహరణకు బౌద్ధ గ్రంథాలైన పాలి కానన్, జాతక కథలు బ్రాహ్మణులు వ్యవసాయం, వడ్రంగం వంటి వృత్తులలో నిమగ్నమైనట్టు పేర్కొన్నాయి. హోయసల సామ్రాజ్యం రికార్డులలో గుర్రాలు, ఏనుగులు, ముత్యాల వ్యాపారంలో బ్రాహ్మణ వర్తకులు ఉన్నట్టు నమోదయ్యాయి.

ఉత్తర భారతదేశంలోని మొఘల్ సామ్రాజ్యంలో కంటే దక్కన్ సుల్తానేట్‌ల పరిపాలనలో తెలుగు నియెగి బ్రాహ్మణులు, మరాఠీ బ్రాహ్మణులు అకౌంటెంట్లు, మంత్రులు న్యాయ విభాగాలలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ చారిత్రక ఆధారాలు, సంప్రదాయ వృత్తులకు మించిన వారి భాగస్వామ్యాన్ని చూపిస్తాయి. ఈ చారిత్రక సామాజిక హోదా బ్రాహ్మణులకు ఒక బలమైన సామాజిక, సాంస్కృతిక మూలధనాన్ని (cultural capital) అందించింది. ఈ మూలధనంలో కుటుంబ నెట్‌వర్క్‌లు, సామాజిక గుర్తింపు, విద్య పట్ల ఒక అంతర్లీన ప్రాధాన్యం ఉన్నాయి. ఈ కారణంగా ఆధునిక భారతదేశంలో ఉన్నత విద్య, లాభదాయకమైన వృత్తులలో బ్రాహ్మణులు అధికంగా ప్రాతినిధ్యం వహించడానికి ఈ చారిత్రక నేపథ్యం ఒక కారణం. సంప్రదాయకంగా జ్ఞానం, విద్యకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం వల్ల బ్రాహ్మణ కుటుంబాలు తమ పిల్లలకు విద్యను ప్రోత్సహించాయి.

దీనివల్ల వారు ఆధునిక భారతదేశంలో ఉన్నత విద్యా సంస్థలకు, ప్రభుత్వ ఉద్యోగాలకు, కార్పొరేట్ రంగంలో ఉన్నత స్థానాలకు సులభంగా చేరుకున్నారు. ఈ సామాజిక మూలధనం అనేది వ్యక్తిగత తెలివితేటలు లేదా కృషికి మాత్రమే కాకుండా, సామాజిక, -ఆర్థిక నిర్మాణం నుంచి వచ్చిన ప్రయోజనంగా చెప్పవచ్చు. భారతదేశంలో కుల వ్యవస్థ ఆధారంగా ఆర్థిక అసమానతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సంపద పంపిణీకి సంబంధించిన డేటా ఈ అసమానతను బలంగా సూచిస్తోంది. ‘టు వర్డ్ ట్యాక్స్ జస్టిస్ అండ్ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా’ అనే నివేదిక ప్రకారం భారతదేశంలోని బిలియనీర్ల మొత్తం సంపదలో దాదాపు 90 శాతం (88.4శాతం) అగ్రకులాల చేతుల్లోనే ఉంది. అదే విధంగా 2018- 19 నాటి అఖిల భారత అప్పులు, పెట్టుబడుల సర్వే (ఎఐడిఐఎస్) ప్రకారం అగ్ర కులాలు జాతీయ సంపదలో దాదాపు 55 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

ఈ గణాంకాలు కుల వ్యవస్థకు సంబంధించిన చారిత్రక విభజనలు సంపద పంపిణీపై ఇప్పటికీ తీవ్రప్రభావం చూపుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి. ఆదాయం, వృత్తి ప్రాతినిధ్యంలో కూడా ఇదే ఆధిపత్యం కనిపిస్తోంది. 2011-12 భారతీయ మానవ అభివృద్ధి సర్వే (ఐహెచ్‌డిఎస్) డేటా ఆధారంగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం బ్రాహ్మణుల తలసరి కుటుంబ ఆదాయం రూ. 58,200 గా ఉంది. ఇది ఎస్‌సి, ఎస్‌టి కులాల వారీ తలసరి ఆదాయం రూ. 19,400 కంటే మూడు రెట్లు ఎక్కువ. నైపుణ్యం కలిగిన ఉద్యోగాలలో బ్రాహ్మణులు 30% వాటా కలిగి ఉన్నారు. ఇది బ్రాహ్మణేతర అగ్రవర్ణాల (12%), ఒబిసిల (8%), ఎస్‌సి, ఎస్‌టిల (6%) కంటే గణనీయంగా అధికం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో బ్రాహ్మణుల చారిత్రక ప్రాతినిధ్యం కూడా ఈ ఆధిపత్యాన్ని చూపిస్తోంది. 2012లో ది ఎకనామిక్, పొలిటికల్ వీక్లీ (ఇపిడబ్ల్యు) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో టాప్ 1000 కంపెనీల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో 44% మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఇది వారి జనాభా వాటా కంటే చాలా ఎక్కువ.

అదే విధంగా 1990లో ఖుష్వంత్ సింగ్ రాసిన ‘బ్రాహ్మిన్ పవర్’ అనే వ్యాసం దేశ జనాభాలో కేవలం 3.5% ఉన్న బ్రాహ్మణులు సీనియర్ సివిల్ సర్వీసులలో 63%, ఐఎఎస్ అధికారులలో 72% ఉన్నారని పేర్కొంది. ఈ గణాంకాలు రిజర్వేషన్ల విధానం విస్తృతంగా అమలులోకి రాకముందు ఉన్న తీవ్రమైన అసమానతలను చూపిస్తాయి. బ్రాహ్మణులు, అగ్రకులాలు సామాజిక-, ఆర్థిక నిచ్చెనలో అత్యున్నత స్థానంలో ఉన్నారని స్పష్టం చేస్తాయి. అయినప్పటికీ ఇది సమాజంలోని సంపద పంపిణీలోని వైరుధ్యాన్ని మాత్రమే సూచిస్తుంది. ఒకవైపు కార్పొరేట్, ప్రభుత్వ రంగాల్లో ఉన్నత స్థానాలను ఆక్రమించిన సంపన్నమైన ‘క్రీమీ లేయర్’ ఉన్నప్పటికీ, మరోవైపు సంప్రదాయ వృత్తులపై ఆధారపడిన పూజారులు, పండితులు వంటివారు పేదరికం, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఈ ఆర్థిక అసమానత, బ్రాహ్మణ వర్గంలోనే ఉన్న సామాజిక-, ఆర్థిక వైరుధ్యాలను సూచిస్తోంది. భారతదేశంలో ‘బ్రాహ్మణుల దోపిడీ’ అనే వాదనకు బదులుగా కులవ్యవస్థ కారణంగా అణగారిన వర్గాలైన ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలు ఎదుర్కొంటున్న వివక్ష దోపిడీకి కూడా కారణమవుతోంది. 1990లో మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా ఒబిసిలకు రిజర్వేషన్లు విస్తరించబడ్డాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగాలలో బ్రాహ్మణుల అసాధారణ ప్రాతినిధ్యాన్ని తగ్గించడానికి దోహదపడింది. రిజర్వేషన్ల విధానం అనేక వివాదాలకు దారితీసింది. కొన్ని వర్గాలు ఇది ప్రతిభను అడ్డుకుంటుందని, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల ప్రజలకు అన్యాయం చేస్తుందని వాదించాయి. ఈ వాదనలకు ప్రతిస్పందనగా, 2019లో భారత ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల (EWS – Economically Weaker Sections) వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. ఈ కోటా ఇప్పటికే ఉన్న 50% రిజర్వేషన్లకు అదనంగా అమలులోకి వచ్చింది.

ఈ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. ఇడబ్ల్యుఎస్ కోటా ప్రవేశంతో మొత్తం రిజర్వేషన్ల శాతం 59.50 శాతానికి పెరిగింది. ఇడబ్ల్యుఎస్ కోటా ప్రవేశం భారత రాజకీయాల్లో ఒక కొత్త చర్చను రేకెత్తించింది. పీటర్ నవరో చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో కుల వ్యవస్థ గురించి ఒక సున్నితమైన, వివాదాస్పద చర్చను తిరిగి లేవనెత్తాయి. భారతదేశంలో ‘బ్రాహ్మణుల దోపిడీ’ జరుగుతోందనే వాదనకు విస్తృతమైన, బలమైన గణాంక ఆధారాలు లేకపోయినా, బిలియనీర్ల సంపదలో అగ్రకులాల ఆధిపత్యం, ఆదాయంలో గణనీయమైన వ్యత్యాసాలు, ఉన్నతస్థాయి ఉద్యోగాలలో వారి అధిక ప్రాతినిధ్యం, భారతదేశంలో ఆర్థిక అసమానతలకు కులవ్యవస్థ ఇప్పటికీ ఒక ప్రధాన కారణమని స్పష్టంగా సూచిస్తోంది. కార్పొరేట్, ప్రభుత్వ రంగాల్లో అధికారం, సంపదను పంచుకుంటున్న ఒక శక్తివంతమైన వర్గం, సంప్రదాయ వృత్తులపై ఆధారపడి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న మరో వర్గం భారతదేశంలో ఉన్నాయి.

ఈ అంతర్గత వైరుధ్యం, కుల ఆధారిత చర్చలను మరింత క్లిష్టంగా మారుస్తోంది. ఆర్థిక సమస్యలు కులంతో ముడిపడి ఉన్నప్పటికీ కులాన్ని మాత్రమే సమస్యగా చూపించడం సమాజంలో ఉన్న ఇతర ఆర్థిక, సామాజిక అసమానతలను పక్కకు నెట్టే అవకాశం ఉంది. బ్రాహ్మణుల సామాజిక, -ఆర్థిక స్థితిగతులు ఒక సంక్లిష్టమైన వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. చారిత్రక సామాజిక మూలధనం, వ్యవస్థాగత ప్రయోజనాల కారణంగా బ్రాహ్మణవర్గం మొత్తంగా అధిక సంపద, అధికారంతో కూడిన స్థానంలో ఉంది. భారతదేశంలో ఆర్థిక అసమానతలకు, సమాన అవకాశాల లోపానికి ప్రధాన కారణం కుల వ్యవస్థ. నిజమైన సామాజిక-, ఆర్థిక న్యాయం సాధించాలంటే సంపద, విద్య, ఉద్యోగ అవకాశాలు కులం, కుటుంబ నేపథ్యం, ఇతర అనుసంధానాలకు అతీతంగా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను నూరు శాతం అమలు పరిచే విధానం, ప్రతి వ్యక్తి సామర్థ్యం, కృషి ఆధారంగా అందుబాటులో ఉండాలి.

Also Read : ప్రపంచాన్ని శాసిస్తున్నాం: రాజ్‌నాథ్

  • మేకల ఎల్లయ్య
    9912178129
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News