అమరావతి: గత వైసిపి ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందని ఎపి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం సరపరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారని అన్నారు. బెల్టు షాపులు, నకిలీ మద్యం అమ్మకాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్సిలు తోట త్రిమూర్తులు, శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నలకు కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వంలో మద్యం విషయంలో అంతా మంచి జరిగిందని వైసిపి చెప్పడం సిగ్గు చేటని, మద్యం కుంభకోణంపై సిట్ విచారణ జరుగుతోందని తెలియజేశారు.
త్వరలో వాస్తవాలు బయటకొస్తాయని, మద్యం దుకాణదారులు తప్పు చేస్తే జరిమానా, రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నాం అని కొల్లు పేర్కొన్నారు. మద్యం సరఫరా పర్యవేక్షణకు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసి అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో మద్యం పాలసీని చాలా పారదర్శకంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తాము అమలు చేసే మద్యం పాలసీని పక్క రాష్ట్రాలు కూడా అధ్యయనం చేస్తున్నాయని, మద్యం నియంత్రణకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని అన్నారు. నాసిరకం మద్యం అమ్మిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
Also Read : ఎపి శాసనమండలిలో గందరగోళం… వాయిదా