ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల యుఎఇలో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అయితే ఈ మెగా టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును బిసిసిఐ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ జట్టులో ఎవరికి చోటు దక్కుతుందా? అనే ఊహాగానాలు చాలా వస్తున్నాయి. అయితే డాషింగ్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు జట్టులో చోటు దక్కే అవకాశం లేదనే మాట బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌ను (Shreyas Iyer) కచ్చితంగా జట్టులోకి తీసుకోవాలని మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు.
‘‘శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గురించి తప్పకుండా చర్చ జరగాలి. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో మధ్య ఓవర్లలో శ్రేయస్ కంటే గొప్పగా ఆడిన మొనగాడు లేడు. ప్రత్యర్థిని అతడు ఒత్తిడిలోకి నెడతాడు.. అవసరమైన సమయంలో బౌండరీలు సాధిస్తాడు. తన తోటి బ్యాటర్‌పై ఒత్తిడి లేకుండా తానే అంతా చూసుకుంటాడు. గత ఐపిఎల్‌లో శ్రేయస్ అదరగొట్టాడు. భారీ అంచనాలు, ఒత్తిళ్ల నడుమ.. తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా ఆడాడు.
చాలా మంది ఆటగాళ్లను ఐపిఎల్ ప్రదర్శనల ద్వారానే ఎంపిక చేశారు. వరుణ్ చక్రవర్తి. రింకూ సింగ్, హర్షిత్ రాణా, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్.. ఇలా అందరూ ఐపిఎల్ ప్రదర్శనల ద్వారానే జట్టులోకి వచ్చారు కదా! అలా చేస్తూ.. శ్రేయస్ అయ్యర్ కూడా ఆసియా కప్‌కు అర్హుడే. ప్లేయింగ్ 11 నుంచి తిలక్ వర్మను తప్పిస్తే.. శ్రేయస్ మూడు లేదంటే నాలుగో స్థానంలో సరిగ్గా సరిపోతాడు. అలా కాకుండా ఐదో స్థానంలో అతడిని ఆడిస్తే.. అది టి-20ల్లో లోయర్ ఆర్డర్ లాంటిదే’’ అని ఆకాశ్ పేర్కొన్నారు.