‘నలభయ్యేళ్లుగా దాచుకున్న నిధి పబ్లిక్ కి పెడుతున్నా- ఏ శిష్యుడికి ఏ గురు వూ ఏనాడూ ఇవ్వని నిక్షేపం- మరో భాగంలో రాయడానికి దాచుకుంటూ రాస్తున్న ఫస్ట్ పార్ట్- ఫస్ట్ వాల్యూమ్. ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరా లు, ఎన్ని పగళ్ళు, ఎన్ని రాత్రులు, ఎన్ని విజిట్లు, ఎన్ని ఇన్‌వైట్లు, ఎన్ని ఆనందాలు, ఎన్ని ఆశ్చర్యాలు. నాకింత మెమోరీ ఉందా అని అనుకునేటంత జ్ఞాపకాలు రాసుకుంటున్నా! ఇది కేవలం నా కోసం, నా గొప్పలు చెప్పుకోవడం కోసం. నాకు బాపూ రమణ గార్లు పర్సనల్‌గా తెలుసోచ్ అని చెప్పుకోవడం కోసం. నాకు నీకన్నా ఎక్కువ తెలుసోయ్ అనే మిత్రులకు తాము కూడా రాయాలనిపించడం కోసం ఈ పుస్తకం.. ‘అని చిత్రకారుడు, కార్టూనిస్టు, రచయిత ‘బ్నిం’ ఇటీవల వెలువరించిన ‘బాపు గారితో నేను’ పుస్తక నేపథ్యంగా రాసుకుంటారు.
ఇందులో శిష్యుడు ప్లస్ ఏకలవ్య శిష్యుడు కలిస్తే ఎంత గురుభక్తి ఉంటుందో అంతా. అలాగే రాధకు మించిన ఆరాధనతో తన ప్రేమనంతా ఇలా అభిమానంతో తన అక్షరాలుగా, బాపు చిత్రాలుగా మన ముందు వెల్లువలా ఈ పుస్తకంగా ఒలకబోస్తారు.
ఆత్రేయపురం పూతరేకులకే కాదు భమిడిపల్లి నరసింహమూర్తి జోకులకు కూడా అని చెప్పబడే పరిస్థితిని తెచ్చుకోకుండా గత నాలుగు దశాబ్దాలుగా ఆయన హైదరాబాద్‌లోని వారాసిగూడ నుంచే కలాన్ని, కుంచెను ఝళిపిస్తున్నారు. ‘బ్నిం’ అని నామకరణం కాక ముందు నుంచే అంటే 1975 అక్టోబర్ 3నుంచి అపురూ ప చిత్రకారుడు బాపుతో మొదలైన ఆత్మీయానుబంధపు పరంపరను ఈ పుస్తకం డాక్యుమెంట్ చేసింది. నాలుగు దశాబ్దాల క్రితం అందిన ఆనాటి బాపు ఉత్తరాన్ని, ఆ ఉత్తరాన్ని మోసుకొచ్చిన కవరుతో మొదలుపెట్టి బోలెడు సంగతులను బ్నిమ్మానందంగా, రామచక్కని చిత్రాలతో ఇందులో నిక్షిప్తం చేశారు.
తెలుగులో బహుశా ఇలాంటి పుస్తకం ఇదే కావచ్చు. ఎందుకంటే ఇందులో ఉత్తరాలు, కవర్లు, అందుకున్న పుస్తకాలు, గీసిన బొమ్మలు, లెటర్ హెడ్లు, విజిటింగ్ కార్డులు, ఆహ్వాన పత్రికలు, సందర్భాలను వివరించే పెయింటింగులు, బాపు సినిమాల పబ్లిసి టీ మెటీరియల్, గ్రీటింగ్ కార్డ్, పుస్తకాల ముఖచిత్రాలు, షూటింగ్ సందర్భాల ఫోటోలు, యాడ్ స్టోరీ బోర్డులు, కార్టూన్లు, కథలకు వేసిన చిత్రాలు, పత్రికలు ప్రచురించిన కథనాల నకళ్ళు, పత్రికల కవర్ పేజీ లు, ఇలా లేనివి లేనేలేవు. వీటన్నింటిలో యమా హైలెట్ ఏంటంటే శ్రీరమణ ‘మిథునం’ కథకు బాపు వేసిన ముఖచిత్రం మనందరికీ బాగా గుర్తు. కానీ దీనికి ముందు బాపు వేసిన, అంత బాగాలేని, ‘బ్నీం’ తిరస్కరించిన కవర్ పేజీ ఇక్కడ అపురూపనిధిగా కనబడుతుంది. అలాగే ‘తిరుప్పావై’కి బొమ్మలు వేస్తూ బాపు ఒకసారి శ్రీరాముడికి రెండు పాదాలూ దక్షిణ పాదాలుగా వేసి, పొరపాటు గ్రహించి ఆ చిత్రాన్ని ఈ అపర ఆంజనేయుడైన ఈ బ్నిమ్ముడికి బహుమతిగా ఇచ్చారు. దాన్ని జాగ్రత్తగా దాచి మన కంట పడేశారీ పుస్తకంలో.
మంచి చిత్రాలు ఎక్కడైనా, ఎప్పుడైనా దొరకవచ్చు. కానీ ఇలాంటివి మాత్రం ఇందులోనే లభిస్తాయి. నెల క్రితం ఈ పుస్తకం మొత్తం చదివాను. కానీ, ఈ మాటలు రాయాలని మళ్ళీ చదవడం మొదలెడితే మహదానందంగా సాగిపోయింది. దానికి కారణం ఏంటంటే ఎన్నో రకాల విషయాలను అందంగా, ఆసక్తికరంగా మన ముందు ‘బ్నీం’ఉంచగలగడం.
కోటప్పకొండ శివాలయానికి బాపుతో వేయించి న పెయింటింగులు ఇక్కడ చాలా అలరిస్తాయి. అలాగే ‘లీలా జనార్ధనం’ సంబంధిం చి కూడా మనకు చక్కటి బాపు చిత్రాలు మనసును కట్టిపడేస్తాయి. అందుకే ‘తర్వాత వస్తున్న బొమ్మలు ఎక్కడ అచ్చు కానివి చూడండి’ జాగ్రత్తగా అన్నట్టు సూచన కూడా చేస్తారు ఈ రచయిత. అలాగే ఈటీవీ సీరియల్ ‘శ్రీభాగవతం’కు సంబంధించి కూడా చిత్రీకరణ సమయంలో సేకరించిన అద్భుతమైన చిత్రాలు, ఆసక్తికరమైన విషయాలు ఇందులో కనబడతా యి. బాపు పట్ల కేవలం లవ్ మాత్రమే ఉన్న ఈ ఏకలవ్యుడికి ఎంత ప్రేమంటే ఆయనకు ఇడ్లీ అంటే ఎంత ఇష్టమో, దాన్ని ఎలా తింటారో.. అలాగే గురువు తినే ఉప్మా తాలూకు ఫొటో, అలాగే ఆయన కలిపి పెట్టిన ఆవకాయ అన్నం, ఇలాంటివి సైతం ఫొటోలు సాక్ష్యంగా అందిస్తారు.
అయితే ఇందులో మనకు ఆసక్తి మాత్రమే కాదు, స్ఫూర్తి కలిగించే విషయమేమిటంటే ముక్కు మొహం తెలియని వ్యక్తికి, కేవలం రాతా గీతా ద్వారా కొంత మాత్రమే తెలిసిన యువకుడికి హిమవన్నగం వంటి బాపు ఎంతగా సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా, ఇంకా అవసరమైన పుస్తకాలు, పత్రికలు పంపి సాయం చేశారో అనేవి. అంతకుమించి ఎప్పటికప్పుడు ఆయనకు ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నూరి పోయడంతో పాటు శిష్యుడి ఇంటికే అతిథిగా వచ్చి ప్రోత్సహించడం అనేవి బాపుకు సంబంధించి తెలిసిన వ్యక్తిత్వంలోని పెద్దగా తెలియని ఉదాత్తతను, గొప్పతనాన్ని తేటతెల్లం చేస్తాయి.
చాలా విలువైన ఈ పుస్తకం ధర 501/- రూపాయలు లేదా 30 పౌండ్లు. తనను ఇంద్రధనస్సుగా మార్చిన సప్త వర్ణాలు అంటే బాపు, రమణ, నవోదయ రామ్మోహనరావు, ఎమ్‌వి ఎల్, బివిఎస్ రామారావు, శ్రీ రమణ, శంకు గార్లకు టోకుగా అంకితం ఇచ్చిన ఈ పుస్తకరచనలో కళాత్మకత, తపన పుష్కలంగా కనబడతాయి.
కొన్ని సందర్భాల్లో ఇవ్వబడిన ఫొటోల ఈస్తటిక్ క్వాలిటీకి ప్రమాదం అనిపిస్తే ఆ పేజీకి సంఖ్య ఇవ్వకుండా స్కిప్ చేశారు. అయినా విమర్శకులకు కొంత వెసులుబాటు నివ్వాలని 22వ పేజీ తర్వాత 13వ పేజీ వస్తున్నట్టు చమత్కారం చేశారు. పుస్తకం కేవలం 116 పేజీలే అయినా చాలా ప్రత్యేకమైంది కనుకనే ప్రచురించిన అక్షజ్ఞ పబ్లికేషన్స్ వారు దీన్ని వీక్లీ సైజులో, మంచి కాగితం వాడి, రంగుల్లో ముద్రించిన తీరూ ‘ఓహ్ చాలా బాగుంది’ అనిపించేలా శ్రద్ధ తీసుకున్నారు. చిత్రకారులకు, కార్టూనిస్టులకు, సినిమా వాళ్లకు, జర్నలిస్టులకు, రచయితలకూ ఎంతో దోహదపడే విలువైన పుస్తకమిది. కళాభిరుచి ఉన్నవారందరికీ తమ బుక్ షెల్ఫ్‌కు భూష ణం కాదగ్గదీ గ్రంథం. ఆసక్తి ఉన్నవాళ్లు రచయి త బ్నీం గారిని లేదా సెల్‌ల్ 8712729057, 8341450673 ద్వారా సంప్రదించవచ్చు.
నాగసూరి వేణుగోపాల్