Sunday, July 13, 2025

‘హాట్’ సీటుపై ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు 14 మంది నేతలు ప్రధాన మంత్రి పదవిని అలంకరిస్తే అందులో అత్యంత పెద్ద వయస్సు మొరార్జీ దేశాయ్ ది. అత్యంత చిన్న వయసులో ప్రధానమంత్రి అయినవాడు రాజీవ్ గాంధీ. మొరార్జీ దేశాయ్ ఎమర్జెన్సీ అనంతరం 81వ ఏట ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ హత్య అనంతరం అత్యంత చిన్న వయసులో తన 40 ఏటనే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవీబాధ్యతలు స్వీకరించారు. మొరార్జీ దేశాయ్ 81వ ఏట ప్రధానమంత్రి అయిన రెండు సంవత్సరాల్లోనే పదవినుండి దిగిపోయారు. అలాగే రాజీవ్ గాంధీ ఒక పూర్తి టర్మ్ ప్రధానమంత్రిగా ఉండి, తన 49వ ఏట ఆ పదవినుంచి వైదొలిగారు. భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 75వ ఏట ప్రధానమంత్రిగా పదవిలో ఉండగా మరణించారు. అలాగే చరణ్ సింగ్ 77వ ఏట ప్రధానమంత్రి అయితే పివి నరసింహారావు 71వ ఏట ప్రధానమంత్రి అయ్యారు.

ఐకె గుజరాల్ తన 78వ ఏట ప్రధానమంత్రి కాగా, భారతీయ జనతా పార్టీ తొలి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి 75వ ఏట ప్రధానమంత్రి అయి, 81ఏళ్ళకు దిగిపోయారు.మరో కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 72 ఏళ్లకు ప్రధానమంత్రి పదవి చేపట్టి, 10 సంవత్సరాలపాటు.. అంటే తన 82వ సంవత్సరంవరకు అధికారంలో ఉన్నారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ 58వ ఏట ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు ఈ ప్రధానమంత్రుల వయస్సు లెక్కలు ఎందుకు అనుకోవచ్చు ఎవరైనా. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి కొంత కాలంగా ఈ చర్చ జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ ఆలోచన ప్రకారం 75 ఏళ్ల వయస్సు దాటితే పదవినుంచి వైదొలగక తప్పదు అన్న చర్చ జరుగుతున్నది. ఇటువంటి సంప్రదాయాన్ని సాకుగా చూపించే 2014లో తాను ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ.. భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కిషన్ అద్వానీ, మురళీ మనోహర్ జోషిలాంటి వాళ్ళను పదవులకు దూరంగా ఉంచారనే ప్రచారం ఉంది.

నిజంగా బిజెపి ఇటువంటి నిబంధన ఏదైనా విధించుకున్నదా లేకపోతే సంప్రదాయంగా కొనసాగించాలని అనుకున్నదా స్పష్టత లేదు కానీ ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేత మోహన్ భాగవత్ ఇటీవల ఒక పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ 75 ఏళ్లు పూర్తి కాగానే పదవీ విరమణ చేయాలనే ఒక ప్రస్తావన తీసుకురావడంతో మళ్లీ చర్చ మొదలైంది. రేపు సెప్టెంబర్ నెల నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 75 ఏళ్లు పూర్తవుతాయి. అలాగే ఈ నిబంధనలను గుర్తు చేసిన మోహన్ భాగవత్ వయస్సు కూడా 75 ఏళ్ళు దాటుతుంది. త్వరలో వీరిద్దరూ పదవులనుండి తప్పుకొని వేరేవారికి అవకాశం ఇస్తారా అన్నది వేచిచూడాలి. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం వెంటనే స్పందించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకా చాలాకాలం అధికారంలో ఉంటారని ప్రకటించారు.

మోహన్ భాగవత్ మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మరాఠా సామ్రాజ్య మొదటి పీష్వా, సంఘ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లె అభిప్రాయాన్ని ప్రస్తావిస్తూ ‘75 ఏళ్ల శాలువా మనమీద కప్పారంటే మనం ఒక నిర్దిష్ట వయసుకు చేరుకున్నామని అర్థం. అప్పుడు మనం పక్కకు జరిగి వేరే వాళ్ళు పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలి’ అన్నారు. ఈ వ్యాఖ్యలనే భాగవత్ గుర్తు చేశారు. బహుశా ఇప్పుడిక ఎవరైనా తనను సత్కరించడానికి శాలువాలు తీసుకొస్తే తనను పదవినుంచి తప్పుకోమని చెబుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావిస్తారేమో. ఇక మోహన్ భాగవత్ ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ మాట అన్నారో తెలియదు కానీ, వెంటనే కాంగ్రెస్, శివసేన తదితర విపక్ష నాయకులంతా నరేంద్ర మోడీ దిగిపోవాల్సిందే అంటూ రాగాలు మొదలుపెట్టారు. ఎంతవరకూ నిజమో తెలియదు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది మొదట్లోనే నాగపూర్ వెళ్లి ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో పెద్దలతో ఈ విషయంపై చర్చించారన్న ప్రచారం పెద్దయెత్తున జరుగుతున్నది.

2024లో మూడోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఇంకా నాలుగు సంవత్సరాల పదవీకాలం ఉండగా ఆ పదవినుంచి వైదొలుగుతారా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. కొంతకాలంగా ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాల్ని లేదా సలహా సూచనలని తీసుకోకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలో నరేంద్ర మోడీ స్వతంత్రంగా ముందుకు తీసుకుపోతున్నారనే వాదన అయితే బలంగా ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ సాంప్రదాయాన్ని పాటించి దిగిపోవాలని ఆర్‌ఎస్‌ఎస్ ఒత్తిడి తెచ్చినా ఆయన దాన్ని శిరసావహిస్తారా లేదా అన్నది కూడా ఎవరి ఊహకు అందని విషయం. ఏదిఏమైనా ఇది ఆర్‌ఎస్‌ఎస్ భారతీయ జనతా పార్టీ అంతర్గత నిర్ణయాలమీద ఆధారపడి ఉంటుంది కాబట్టి విపక్షాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి నుంచి తొలగిపోవాలని ఎంతగా కోరుకున్నా వాళ్ల కోరికల మీద ఆధారపడి ఆర్‌ఎస్‌ఎస్- బిజెపి నిర్ణయాలు ఉండవన్న విషయం తెలిసిందే.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పిల్లలు లేరు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో తన మిత్రపక్షం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడులాంటి వాళ్లకు ఉన్న సమస్యలు కూడా లేవు. ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి తొలగిపోవాల్సి వస్తే తమ పార్టీలోనే సమర్ధుడైన మరో నాయకుడికి ఆ పదవి కట్టపెట్టాల్సిందే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అధికార ఎన్‌డిఎలో భాగస్వామ్యపక్షం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయిన చంద్రబాబు నాయుడు ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఆయన కూడా 75వ పడిలో ఉన్నారు కాబట్టి. ఆయనకు వారసుడు ఉన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆ వారసుడికి పార్టీని, అధికారాన్ని దఖలు చేసే ఆలోచనలు చంద్రబాబునాయుడు చేస్తున్నట్టుగా జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం అవుతుంది.

ఆర్‌ఎస్‌ఎస్, దాని ఆదేశాలమేరకు నడుచుకునే భారతీయ జనతా పార్టీ పదవుల విషయంలో ఇటువంటి నిబంధన ఏమైనా విధించుకున్నదా లేదా అన్నది అలా ఉంచితే, అటువంటి నిబంధన ఒకటి ఉండడం ఏ రాజకీయ పక్షానికైనా మంచిదే. యువ నాయకత్వానికి అధికారంలో భాగస్వామ్యం కల్పించడం, సీనియర్లు వారికి మార్గనిర్దేశం చేయడం అవసరం కూడా. ఇది కేవలం రాజకీయాలకే కాకుండా అన్ని రంగాలకూ వర్తిస్తుంది. కొత్త తరం నాయకత్వ బాధ్యతలు చేపట్టడమనేది మనిషి శరీరంలో కొత్త రక్తం ప్రవహించడం లాంటిది. అది అన్ని సందర్భాల్లోనూ ఆహ్వానించదగ్గ పరిణామం. భారతీయ జనతా పార్టీ- ఆర్‌ఎస్‌ఎస్ ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వస్తాయో తెలియదు కానీ, దీని మీద చర్చ అయితే జరుగుతున్నది.. జరగవలసిన అవసరం కూడా ఉన్నది. రాజకీయాలలో వృద్ధతరం గురించి, వారు వైదొలగి యువతరానికి అధికారం అప్పగించాలన్న వాదన గురించి జరుగుతున్న చర్చకు లింక్ చేసి మనం గత వారం రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న పరిణామాల్ని గురించి కూడా మాట్లాడుకోవచ్చు.

ఒక పక్క వయసు మళ్ళిన వారిని పదవీ విరమణ చేయించాలన్న చర్చ జరుగుతుంటే మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు, శాసనసభ్యుడు రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసి అమర్నాథ్ యాత్రకు వెళ్ళిపోయారు. అక్కడినుండి ఆయన హిందీలో చేసిన ఒక ట్వీట్ లో 11 సంవత్సరాల క్రితం ప్రజాసేవ, దేశసేవ, హిందుత్వ రక్షణ ఉద్దేశాలతో భారతీయ జనతా పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను అని చెప్పారు. పార్టీ కూడా తనమీద నమ్మకంతో మూడుసార్లు తెలంగాణలోని గోషామహల్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించిందన్నారు. పార్టీ తనకు కల్పించిన అవకాశానికి నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ కార్యక్రమం ఏమిటో ఆయన ఇంకా ప్రకటించక ముందే, ఎక్కడో అమర్నాథ్ యాత్రలో ఉండగానే, షరా మామూలుగానే సామాజిక మాధ్యమాల్లో ఆయన భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన దగ్గర నుండి భారత రాష్ట్ర సమితి వైపు చూస్తున్నారని, ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అపాయింట్‌మెంట్ కోసం అడిగారని రకరకాల ప్రచారాలు మొదలైపోయాయి.

రాజాసింగ్ భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి చేసిన రాజీనామాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ కేంద్ర అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపితే, ఆయన దాన్ని ఆమోదించేశారు. రాజాసింగ్ గత పది, పదిహేను సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కోసం పని చేస్తున్న తీరు, పార్టీపట్ల ఆయన నిబద్ధత గమనించిన వాళ్ళందరికీ ఇది కొంచెం ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. అసలు భారతీయ జనతా పార్టీతో సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా బయటనుంచి పరిణామాలనన్నింటినీ గమనిస్తున్నవాళ్లు కూడా భారతీయ జనతా పార్టీకి రాజాసింగ్ అధ్యక్షుడు అవుతాడు అని అనుకున్నారు. ఒకసారి తెలంగాణ శాసనసభలో రాజాసింగ్ ఒక్కడే బిజెపి సభ్యుడిగా పోరాటం చేసినవాడు. భారతీయ జనతా పార్టీ కోసం హిందుత్వ

పరిరక్షణ పేరుతో ఆయన నిలబడిన తీరు అందరికీ తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేసే ఆలోచనతో పార్టీ కార్యాలయానికి వెళ్లి, అది సాధ్యపడని వాతావరణం ఉండటంతో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసానని ప్రకటించిన రాజాసింగ్ ను నివారించే ప్రయత్నం కానీ, సముదాయించే ప్రయత్నం కానీ జరిగినట్టు లేదు. ఆయనేమీ కొందరు కొత్త వేషగాళ్ళలా ఐ యామ్ అన్ అపాలజిటికల్లీ సనాతన హిందూ అని కాషాయాలు ధరించి గొంతు చించుకొని అరవలేదుగానీ, కట్టర్ హిందూత్వవాదిగా మాత్రం పేరు పొందారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగంగానే తీవ్ర హిందుత్వవాది అయిన రాజాసింగ్ ను దూరం పెట్టి కొంత సౌమ్యుడు, అన్ని వర్గాలవారినీ కలుపుకు పోగలిగినవాడు అని మాజీ శాసనమండలి సభ్యుడు, సీనియర్ నాయకుడు రామచందరరావుకు అధ్యక్షపీఠం అప్పగించిందా అన్న చర్చ జరుగుతున్నది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పూర్తిచేసి కేంద్రానికి ఆదర్శంగా నిలిచానని చెపుతూ, ఇప్పుడు వెనుకబడినవర్గాలకు, స్థానికసంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు జోరుగా ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెబుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వెనుకబడిన వర్గాల నాయకులకు కాకుండా ఒక అగ్రకులానికి చెందిన నేతకు కట్టబెట్టడం చర్చనీయాంశం అయింది. తెలంగాణ శాసనసభలో ఇప్పుడు బీజేపీ బలం ఎనిమిది నుండి ఏడుకు తగ్గింది. పార్టీకి తాను చేసిన రాజీనామాపత్రాన్ని కిషన్ రెడ్డికి పంపిస్తూ రాజాసింగ్ తన శాసనసభ్యత్వం గురించి కూడా అసెంబ్లీ స్పీకర్ కు తెలపమని ఆయనకే చెప్పారు. రాజాసింగ్ పార్టీ సభ్యత్వానికి చేసిన రాజీనామాను బిజేపి అంగీకరించగలదే కానీ శాసనసభ్యత్వంనుండి

తొలగించే అధికారం ఉండదు. ఇప్పుడు ఆయన సభలో స్వతంత్ర సభ్యుడిగా కొనసాగుతారా లేక పార్టీ ద్వారా సంక్రమించిన సభ్యత్వం కాబట్టి యాత్రల నుండి తిరిగి వచ్చాక స్పీకర్ ఫార్మాట్ లో శాసన సభ్యత్వానికి రాజీనామా సమర్పించి ఆమోదింప జేసుకుంటారా చూడాలి. అదే జరిగితే రాష్ట్ర రాజధాని నగరంలో ప్రతిపక్షాలు గెలిచిన రెండు స్థానాల్లో శాసనసభకు ఉప ఎన్నికలు తప్పవు. కొద్ది రోజుల క్రితం జూబిలీ హిల్స్ స్థానంనుండి ప్రాతినిధ్యం వహించిన బీఆర్‌ఎస్ శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్ మరణించిన కారణంగా అక్కడ ఉపఎన్నిక తప్పనిసరి అయింది. అధికారంలో ఉన్న పక్షాన్ని ఓడించి ఉప ఎన్నికలలో తమ స్థానాలను తిరిగి దక్కించుకోవడం బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు సాధ్యం అవుతుందా? వేచి చూడాల్సిందే.

amar devulapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News