తిరుపతి: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులను మాయమాటలతో మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది. గత వారం రోజుల క్రితం భక్తురాలు శ్రీమతి ఊర్వశి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గూగుల్ ద్వారా వసతి కోసం వెతికే క్రమంలో శ్రీనివాసం రెస్ట్ హౌసెస్ అనే వెబ్ సైట్ లో ఇచ్చిన మొబైల్ నెంబర్ 8062180322 ను సంప్రదించగా, అభిమన్యు అనే వ్యక్తి తాను శ్రీనివాసం కాంప్లెక్స్ లో రిసెప్షన్ కి చెందిన వాడినని తప్పుడు సమాచారంతో పరిచయం చేసుకున్నాడు.
సదరు భక్తురాలికి వసతి కల్పిస్తామని నమ్మబలికి కొంత మొత్తాన్ని వసూలు చేశాడు. డబ్బు చెల్లిస్తే వసతి టికెట్ ను పిడిఎఫ్ పంపిస్తామని హామీ ఇచ్చాడు. డబ్బు తీసుకున్న తర్వాత సదరు నిందితుడు తన ఫోన్ కాల్స్ , వాట్సాప్ మేసేజ్ లకు స్పందించకుండా మోసం చేశాడు. దీంతో నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసపోయానని గ్రహించిన సదరు భక్తురాలు 1930 క్రైమ్ హెల్ప్ లైన్ కు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Also Read: కులవివక్ష లేనిదెక్కడ?
ఇటీవల టిటిడి సేవల పేరుతో నకిలీ వెబ్ సైట్లు ద్వారా భక్తులను మోసం చేస్తున్న ఘటనలు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టిటిడి సూచించింది. భక్తులను అనుమాస్పద వ్యక్తులు, దళారులు ప్రలోభ పెడితే ముందుగా టిటిడి విజిలెన్స్ విభాగానికి చెందిన సదరు నెంబర్ కు 0877 – 2263828 ఫోన్ చేసి అనుమానాలను భక్తులు నివృత్తి చేసుకోవాలని టిటిడి సూచించింది. నకిలీ దర్శన టికెట్లు, వసతి పేరుతో దందా చేస్తే వెంటనే సదరు మోసపూరిత వ్యక్తులు, దళారుల వివరాలను ఫోన్ చేసి టిటిడి విజిలెన్స్ దృష్టికి తీసుకురావాలని టిటిడి కోరింది.
శ్రీవారి దర్శనం, వసతి కోసం టిటిడి అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in లేదా ttdevasthanams mobile app ద్వారా మాత్రమే ఆన్ లైన్ లో తమ ఆధార్ కార్డ్ ఆధారంగా టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని భక్తులకు సూచించింది. ఇతర వివరాలకు టిటిడి టోల్ ఫ్రీ నెంబర్ 155257 కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని టిటిడి కోరింది.