గుహహతిలో కారు ఢీకొని 21 ఏళ్ల విద్యార్థి మృతి చెందిన ఘటనలో అస్సామీ నటి నందిని కశ్యప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కశ్యప్ తన కారుతో ఢీకొన్న తర్వాత అక్కడి నుండి పారిపోయారని.. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థి మరణించాడని తెలుస్తోంది. హిట్ అండ్ రన్ కేసుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టి బుధవారం నటిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం జూలై 24న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గౌహతిలోని దఖింగావ్ ప్రాంతంలో జరిగింది. బాధితుడు నల్బరి పాలిటెక్నిక్‌లో చదువుతున్న విద్యార్థి సమియుల్ హక్‌గా గుర్తించారు.
కశ్యప్ నడుపుతున్న స్కార్పియో కారు సమియుల్ ఇంటికి తిరిగి వస్తుండగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఘటన తర్వాత నటి ఆగకుండా.. అక్కడి నుండి పారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తలకు, కాళ్ళకు తీవ్ర గాయాలు కావడంతో సమియుల్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. తర్వాత అతను చికిత్స పొందుతూ చనిపోయాడు. నందిని కశ్యప్ మొదట్లో వైద్య ఖర్చులను భరిస్తానని హామీ ఇచ్చారని, కానీ ఆసుపత్రికి ఎప్పుడూ హాజరు కాలేదని సమియుల్ కుటుంబం ఆరోపించింది. ప్రమాదం జరిగిన పరిస్థితులపై న్యాయం చేయాలని, సమగ్ర దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే, ప్రమాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. బాదితుడి కుటుంబ ఆరోపణలను నందిని కశ్యప్ ఖండించారు. ఈ ఘటనలో భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్)లోని అనేక సెక్షన్ల కింద నటిపై పోలీసులు అభియోగాలు మోపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.