Monday, May 5, 2025

త్వమేవ సర్వం మమదేవదేవ…. దైవమా నీవే నా సర్వస్వం

- Advertisement -
- Advertisement -

ముకుంద రామారావు గారు ప్రముఖ కవీ సంశోధకులూ. వీరి ‘అదే కాంతి – మధ్యయుగంలో భక్తి కవిత్వం: సామాజిక నేపథ్యం‘2022లో వెలువడిన గ్రంథం. ‘అదే కాంతి‘ హఠాత్తుగా ఊడిపడే work కాదు. ఇటువంటి పుస్తకం రాయాలంటే కవిత్వమంటే ఎంత ప్రేమ ఉండాలో కవిత్వ చరిత్ర పరిశోధనకు అంతగానూ పూనుకోవాలి. ఈ పుస్తకానికి ఉన్న ఆధార గ్రంథావళి లిస్టే మూడు పేజీలుంది! ఈ పుస్తకం మనకు అందించడానికి ముకుంద రామారావు గారు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. భక్తి భారతదేశానికి మాత్రమే చెందిన భావప్రక్రియ కాకున్నా భక్తి ఉద్యమం మాత్రం మన దేశానికి చెందినదే. కులాలుగా విడిపోయిన భారతీయ సమాజంలో నిమ్నకులజాతులకు దేవాలయ ప్రవేశార్హతే లేకుండేది.

ఇంటికీ ఇంటివారి సేవకే పరిమితమైపోయిన స్త్రీలకు వేరే సామాజిక జీవనం మృగ్యమై పతివ్రతగా బతుకునీడ్చగలిగితే దక్కేదల్లా పరలోకాల్లో పతిసేవా భాగ్యమే. ఇటువంటి సామాజిక నేపథ్యంలో భక్తి ధిక్కారానికీ తిరుగుబాటుకూ పరచింతనకూ నాందీ ప్రస్తావన కావడంలో విశేషమేమంటే ఈ ఉద్యమం 11, -12 శతాబ్దాల పాటు మన దేశంలో ప్రవర్ధిల్లడమే. కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా కులతత్త్వం, అణచివేత ఉన్న మాదిరిగానే భక్తి ఉద్యమం రగిలి దేశమంతా రాజుకొని పాకి, సమాజాన్ని ప్రశ్నించి, దైవం తోడ్పాటుగా తోడుగా అఖిల మానవ సమతావాదానికి తొలిమెట్టు అయింది. భక్తి సహజంగా వ్యక్తికి ప్రసాదించే అతి ముఖ్యమైన వరం స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ పొందిన భక్తి కవులు దైవం ఒక్కటే అన్నంత బిగ్గరగా మనుషులంతా ఒక్కటే అన్నారు. ఇది పరతంత్రులు అనగలిగే మాట కాదు. ఈ అవగాహనకు వ్యక్తి స్వేచ్ఛయే మూలం. దైవభక్తి స్వేచ్ఛనూ అది ప్రసాదిస్తుంది.
మీకీ కింది విషయాలు (facts & factoids) తెలుసా?

ade kanthi

భారతదేశంలో భక్తి కవిత్వం 6వ శతాబ్దం నుంచి దాదాపు 18వ శతాబ్దం దాకా కొనసాగింది.
భక్తి కవుల్లో కొద్దిమంది బ్రాహ్మణులు మినహా, నిమ్న కులాల వారూ స్త్రీలే అధికం.
12వ శతాబ్దానికి చెందిన కన్నడ ప్రాంతపు కదిరె కాయకద కాలవ్వె మొదటి దళిత కవయిత్రి. మాదర చెన్నయ్య తొలి దళిత కవి.
తెలంగాణాకు చెందిన పొన్నికంటి తెలగన్న (1520-1600) మొదటి అచ్చతెలుగు కావ్యం – యయాతి చరిత్ర – రాశాడు. ఒక మహమ్మదీయ ప్రభువుకు అంకితమిచ్చిన మొదటి కావ్యం ఇదే.
‘భారతీయుడు‘ అన్న మాట వీరబ్రహ్మం ఆనాడే
ప్రయోగించాడు.
మొదట హరిజన్ అనేమాట వాడినది గుజరాత్‌కు చెందిన గంగాసతి. అయితే, ఆమె అది హరిభక్తులనే అర్థంలోనే ప్రయోగించింది.
ఈ వ్యాసంలో ఇందులోని కవులనందర్నీ పరిచయం చెయ్యబూనడం దుస్సాహసం. అయితే, మచ్చుతునక లు కొన్ని చూపెట్టాలి. ఇవన్నీ రచయిత అనువాదాలే.
“నేను బతికినా చచ్చినా అతను
పట్టించుకోవడం లేదు.
ఎవరికీ తెలియని దొంగ,
ఆ మోసకారి గోవర్ధనుడు
నావైపు కనీసం చూడడం లేదు.”
“పచ్చిపుండు మీద చింతపండు రసం పిండినట్టు
కేవలం నన్ను వెక్కిరిస్తూ అక్కడ నిలుచోవద్దని
ప్రార్థిస్తున్నాను” ఆండాళ్ (కోదై).
అని తన భర్తగా ఊహించుకున్న దైవాన్ని ఇలా నిందించింది గోదాదేవి. “కాయకవే కైలాస”, అంటే కాయకష్టమే కైలాసమని అర్థం. ఇది కన్నడప్రాంతానికి చెందిన వీరశైవ భక్తి కవుల మేనిఫెస్టో.
“ఆ వచనాలన్నీ ఒకే ఒక్క పదం అనిపించాయి”
అల్లమప్రభు (12వ శతాబ్దం).
“ఒరే మూర్ఖుడా నాకు ఆభరణాలు ఎందుకు,
ఆచ్ఛాదన ఎందుకు?” అని అరిచింది తన పైబట్టలతో సహా సర్వాన్నీ త్యజించిన అక్క మహాదేవి. అంతే కాక, ఈమె అన్నీ విడిచి జుత్తుతో దేహన్ని కప్పుకొని, “నేను కప్పుకున్నది సిగ్గుతో కాదు ఇతరుల కోసం అన్నది. ‘అందరూ వాడే నీటితో వండిన ఆహారాన్ని అందరితో తినకూడదనే వారికి దూరం జరగడమే మేలు సర్వజ్ఞా” అని సర్వజ్ఞుడు సవర్ణులనే అశుంఠా ఉండమన్నాడు.
“చిన్న అద్దంలో ఏనుగుని బంధించినట్టు
నాలో నిన్ను బంధించుకుంటాను
పురందర విఠలా” పురందరదాసు
“మతము మత్తు మందు గూర్చు
మార్గమ్ము కారాదు
హితము గూర్చ వలయునెల్లరకును”
అని అప్పుడే హెచ్చరించాడు వీరబ్రహ్మం ‘పదాలు అతన్ని పట్టుకోలేవు.. అయినా అన్ని పదాలూ అతనిలో ఉన్నాయి అంటుంది ముక్తా’ అని మరాఠా ప్రాంతానికి చెందిన 13వ శతాబ్దపు కవయిత్రి ముక్తాబాయి (ఈమె జ్ఞానేశ్వరుని చెల్లెలు) ఒక కొత్త వరవడినిచ్చింది. “ప్రభువా నేను వేశ్యనైపోయాను. కేశవా నీ ఇంటికోసం నేను బయలుదేరుతున్నాను” అని మొరపెట్టుకుంది 13వ శతాబ్దపు మరాఠా భక్తికవయిత్రి జానాబాయి.
“ఓ ప్రభూ నీకు మొదటి చరణం లేదు
నిన్ను మొదలుపెట్టడం చాలా కఠినం” అన్నాడు తుకారామ్.
“బిగ్గరగా అరుస్తాయి వేదాలు, నినదిస్తాయి పురాణా లు స్త్రీలకు ఒరిగేదేమీ లేదు” అంటూ చాలామంది ఆధునిక స్త్రీవాద కవయిత్రులకు భిక్ష పెట్టింది బహిణాబాయి (మరాఠా ప్రాంతం, 1628-1700).
“దూదిని దూదేకులవాడు శుద్ధి చేసినట్టు
ప్రేమ నన్ను శుద్ధి చేసింది, అమ్మా” అని అన్నది సూఫీ సాంప్రదాయానికి చెందిన షా అబ్దుల్ లతీఫ్ భితాయి (గుజరాత్ ప్రాంతం, 1689-1752).
“సదా వివేకంతో భుజించాను, ఆకలి నాకు బాగా తెలుసు” అన్న వగబొంద్ మహా కవయిత్రి కాశ్మీర్‌కు చెందిన మననశీల వాక్కుల లల్లా (1320-1392). లల్లా వాక్కులలో దైన్యం, ధైర్యం, దృఢవిశ్వాసం అసమానమైనవి! ఈమె epitaph చూడండి.
“తంత్రాలు మాయమయ్యాక మంత్రాలు మిగిలాయి
మంత్రాలు మాయమయ్యాక మనస్సు మిగిలింది
మనస్సు మాయమయ్యాక
శున్యం మిగిలింది
శూన్యం పూర్తిగా శూన్యంలో
విలీనమైపోయింది.”
“ఎవరి కోసమైతే నేను
వెతుకుతూ పోయానో
నేను ఉన్నదగ్గరే అతనిని
కనుగొన్నాను
అతనిప్పుడు నేనయ్యాడు, పూర్వం నేను ‘మరొకడు’
అనుకొన్నాను” ఇది కబీర్ దాస్ కనుగొన్న బ్రహ్మసత్యం.
“ఒక కప్పు ప్రేమని తాగి అన్నింటినీ మరచిపో యాను” అని బుల్లేషా తన్మయం చెందాడు. ప్రభువుని తెలుసుకున్న బుల్లేషాకు అపరిచితులంటూ ఎవరూ లేరు.
“నా బాడుగ సమయం అయిపోయింది, ఇక నీతో నేను ఉండలేను.” అని అన్న వారిస్ షాకు జీవితమంతా అర్థమయిందని పాఠకులకు అర్థమౌతుంది.
“పండితుడు ధార్మిక గ్రంథాలను
వల్లె వేస్తూనే ఉంటాడు.
కానీ భక్తుడు వాటి సారాంశాన్ని గ్రహిస్తూంటాడు.”
అని అన్న అస్సామీ భక్తకవి ప్రముఖుడు శంకరదేవ (1449-1568) అసలు నిజాన్ని చెప్పాడు.
“సర్వోన్నత సత్యం మనిషి.. అతని కంటే ఎక్కువ ముఖ్యమైనది ఏదీలేదు” అని బారు చండీదాస (బెంగాల్ ప్రాంతం, 15వ శతాబ్దం) తెలుసుకున్నాడు. అతనికి దైవం ప్రత్యక్షమయింది.
ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ ఈ వ్యాసకర్త మనసులో ముందు ఆధునిక కవిత్వపు టెక్నిక్స్ కదలాడాయి. ఇప్పుడు రాస్తున్న కవుల శైలీధోరణులూ అప్పటి కవులవే. కొత్త కవులు కొత్తగా చెబుతున్నదేదీ లేదు. భక్తి కవులకు (వ్యక్తికి) ప్రసాదించిన స్వేచ్ఛ అనుపమానమయింది. అది భగవత్సాక్షాత్కారాన్నే ఇవ్వగలిగినప్పుడు మిగతావన్నీ ఒక లెక్ఖా? రెండు వచనాలో దోహాలో చూస్తే చాలు, భక్తికవులు ఎంతటి ఉన్నతులో తెలిసిపోతుంది. మనం తేలిపోతాం. ఈ మూల్యాంకనం ముఖ్యం కాదు. ఇది మనది అనుకోవడం ముఖ్యం. మనిషి ఉన్నంతకాలమూ భక్తి ఉంటుంది, కనుక భక్తి కవిత్వమూ ఉంటుంది.

వెల్చేరు నారాయణరావు గారి ముందుమాట ఉంది ఈ గ్రంథానికి. ఇటువంటి బృహత్ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ రచయితైనా ఒక రచనాపరిధిని (scope of work) ఏర్పరుచుకోవాలి. ముకుందరామారావు గారు ఇందులో భక్తి ఉద్యమం సాధించిన ఆధ్యాత్మిక, సామాజిక విజయాలను లెక్కించి చూపినా, ఈ గ్రంథంలో రచయిత భక్తి ఉద్యమం అసంపూర్ణ విజయాలను అంతగా పట్టించుకోలేదు. ఇది రచయిత రచనా పరిధికి అవతలవైపే ఉండే విషయం. ఉదాహరణకు, 12 శతాబ్దాలపాటు సాగిన ఈ ఉద్యమం బౌద్ధ జైనాలనుంచి స్వీకరించినది ఉన్నా, వాటిని హైందవాన్ని తోసి రాజనకుండా అడ్డుకున్నాయి. భక్తికవులు పూజాపునస్కారాల్ని ఎంత నిరసించినా, ఏకో నారాయణ అని ఎలుగెత్తి చాటినా, ఇవాళ్టికీ తంతులూ తతంగాలూ తగ్గలేదు, కులతత్త్వం రూపు మాసిపోలేదు. దీనికి మూల కారణమయిన వ్యక్తి psycheను ఈ ఉద్యమం ఎంత గా అంచనా వేసినదీ ఇంకా తేలలేదు. ఇటువంటి సమస్యలు న్నా ముకుంద రామారావు గారి ఈ పుస్తకం తెలుగులో వచ్చిన మంచి reference గ్రంథంగా నిలిచిపోతుంది. ముకుంద రామారావు గారి ఈ work తెలుగులో వచ్చిన విపులమైన విమలమైన పరిచయం. 700పైచిలుకు పేజీలున్న ఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యడం ఏమంత సులువైన పని కాదు. ఇదొక చిన్ని ప్రయత్నం, అంతే!
వాసు, బెంగళూరు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News