Wednesday, September 3, 2025

1400 దాటిన ఆఫ్ఘన్ భూకంప మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన అతి భారీ భూకంపంలో ఇంతవరకూ 1400 మందికి పైగా మరణించారు. 3 వేలమందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని భయాందోళన చెందుతున్నారు. కొద్ది దశాబ్దాలలో సంభవించిన అతి పెద్ద భూకంపంతో దేశం అల్లకల్లోలమైందని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంలో పర్వతమయమైన ప్రావిన్స్ లలో రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రరతో సంభవించిన భూకంపంతో ఆ ప్రాంతం అంతా నాశనమైపోయింది. కేవలం కునార్ ప్రావిన్స్ లోనే 1,411 మంది చనిపోయారని,3,124 మంది గాయపడ్డారని తాలిబన్ ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మంగళవారం వెల్లడించారు. పొరుగున ఉన్న నంగర్హార్ ప్రావిన్స్ లో మరో 12 మంది చనిపోయారని, వందలాది మంది గాయపడ్డారని కూడా తెలిపారు.

కునార్ ప్రావిన్స్ లో శిథిలాలకింద చిక్కుకున్న వారిలో ఎవరైనా బతికి ఉంటారేమోనన్న ఆశతో భారీగా గాలిస్తున్నారు. పగలూ, రాత్రి అని లేకుండా నిర్విరామంగా సహాయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మారుమూల గ్రామాల నుంచి గాయపడిన వారిని ఆస్పత్రులకు చేర్చే కృషి సాకుతోంది. స్నేహితుడికోసం వెదుకుతూ వాడిర్ గ్రామానికి వచ్చిన ఒబైదుల్లా స్టోమాన్ అనే వ్యక్తి గ్రామం నేలమట్టం అయిపోవడంతో విధ్వంసాన్ని చూసి చలించిపోయాడు. కొండచరియలు పడి రోడ్లు మూసుకుపోవడంతో ఇంకా సహాయక బృందాలు కొన్ని గ్రామాలకు వెళ్లే అవకాశమే లేకుండా పోయింది. జలాలాబాద్ కు 27 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూ ఉపరితలం నుంచి ఎనిమిది కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించింది. భూకంప బాధిత గ్రామాల్లో ఈ మధ్య ఇరాన్, పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చిన 40 లక్షలమందికి పైగా ఆఫ్ఘన్లు నివసిస్తున్నారు.

నుర్గల్ జిల్లా వాడిర్ గ్రామం నుంచి ఆఖ్లాక్ అనే 14 ఏళ్ల బాలుడిని హెలికాప్టర్లో జలాలాబాద్ కు తరలించారు. అతడి కుటుంబం లోని ఐదుగురు చనిపోయినట్లు తెలిపాడు. ఆఫ్ఘనిస్తాన్ , ముఖ్యంగా హిందూ కుష్ పర్వత శ్రేణిలో తరచు భూకంపాలకు గురవుతుంది. 2023 అక్టోబర్ లో పశ్చిమ హరాత్ ప్రావిన్స్ లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 1500 మందికి పైగా చనిపోయారు. 63 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. 2022 జూన్ లో పాక్టికా తూర్పు ప్రావిన్స్ లో సంభవించిన భూకంపంలో వెయ్యిమందికి పైగా చనిపోయారు. పదివేల మంది నిరాశ్రయులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News