Saturday, September 13, 2025

సుస్థిర విధానాలతోనే సాగు బాగు

- Advertisement -
- Advertisement -

భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా పురోగమిస్తూ త్వరలోనే ప్రపంచ 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుండటం సంతోషకరమే. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై 50% దిగుమతి సుంకాలు విధించడం వల్ల మన జిడిపి 0.3 శాతం తగ్గనున్నట్లు, జిఎస్‌టి సంస్కరణలు, మార్కెట్ల విస్తరణతో ఆ నష్టాల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల వల్ల మన ఎగుమతులపై తీవ్ర ప్రభావంపడి వేలాది మంది జీవనోపాధి కోల్పోతున్నారు. ఈ సుంకాలు అమెరికాపై కూడా ప్రభావం కలిగించగలవనే హెచ్చరికలతో తాజాగా భారత్ గొప్ప దేశమని, ప్రధాని మోడీ గొప్ప నాయకుడని ట్రంప్ మాటమార్చినా, అమెరికా సహజ మిత్రదేశమని మోడీ స్పందించినా భారీ సుంకాలపై నిర్దిష్ట ప్రకటన ఏదీ రానందున భారత్ ప్రత్యామ్నాయ అవకాశాలను అన్వేషించడం అనివార్యం. ద్వెపాక్షిక వాణిజ్యంలో భారత్‌కు ఎక్కువ మిగులు ఉండటాన్ని సాకుగా చూపి అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు అనుమతించాలని ట్రంప్ పట్టుపడుతున్నారు.

అయితే భారత్‌లో 86 % మంది చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధులపై తీవ్రప్రభావం చూపే వ్యవసాయోత్పత్తుల దిగుమతులకు అనుమతించేది లేదని భారత ప్రభుత్వం కరాఖండిగా చెబుతుండటం డాలర్ ప్రభువులకు ఆగ్రహం కలిగిస్తోంది. అమెరికాలో వేలాది ఎకరాల్లో భారీ యంత్రాలతో సేద్యం చేయడం, ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తుండటం సాగు ఖర్చులు తగ్గి మిగులును భారత్, తదితర దేశాలకు ఎగుమతి చేయడానికి అమెరికా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. 146కోట్ల జనాభాతో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌పై ఒత్తిడి తెచ్చి జన్యుపరంగా అభివృద్ధి చేసిన విత్తన రకాలను, వ్యవసాయోత్పత్తులను ఎగుమతి చేసి లాభాలు దండుకోవాలని అమెరికా తహతహలాడుతోంది. అయితే కోట్లాది మంది గ్రామీణ పేదలు, రైతుల జీవనోపాధులపై పెనుప్రభావం చూపే వ్యవసాయోత్పత్తుల దిగుమతులకు మన దేశం ఎంతమాత్రం అంగీకరించడం లేదు.

అమెరికా తదితర అంతర్జాతీయ భాగస్వాములతో చర్చలు జరిపేటప్పుడు భారత ప్రజల ఆహార భద్రత, రైతుల ప్రయోజనాలను కాపాడటం ప్రభుత్వాల విహిత కర్తవ్యం. గత ఆగస్టులో బ్రిటన్‌తో కుదుర్చుకున్న సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంలో కూడా మన వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు గల అవకాశాలను అందిపుచ్చుకుంది. అయితే పాడి ఉత్పత్తులు, వంటనూనెలు, ఆపిల్స్, ఓట్స్ ఎగుమతులకు అవకాశం లభించలేదు. జపాన్, యుఎఇ, ఆస్ట్రేలియా, సింగపూర్, దక్షిణ కొరియా వంటి డజను దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నా వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై భారత్ దృఢ వైఖరిని అవలంబించింది. ఎలాంటి రాయితీలకు అనుమతించలేదు.

మన వ్యవసాయ రంగం నుండి 1961లో 47.6% జాతీయ ఆదాయం లభించగా, ప్రస్తుతం సేద్యపు రంగ వాటా జిడిపి 15 శాతంగా ఉన్నట్లు గణాంకాలు ఘోషిస్తున్నాయి. భారత్ 1991 నుండి సరళీకృత ఆర్థిక విధానాలు అవలంబిస్తున్న నాటినుండి వ్యవసాయ రంగం జిడిపి క్రమంగా తగ్గుతూ వస్తోంది. 1991లో సేద్యం, అనుబంధ రంగాల నుండి 29.5 శాతం జిడిపి రాగా, 2001 నాటికి అది 22.3 శాతానికి, 2011లో 14.4 శాతానికి తగ్గింది. గత 15 ఏళ్లుగా సేద్యపు రంగ జిడిపి 15 శాతంగా ఉంటున్నది. అయితే దేశ శ్రామిక శక్తిలో 55% మందికి జీవనోపాధి కల్పిస్తున్నది వ్యవసాయం, అనుబంధ రంగాలే కావడం గమనార్హం. దేశ శ్రామికులు, రైతులు అందునా పల్లె ప్రజల రోజువారీ జీవితాలతో విడదీయలేని బంధంగల సేద్యం, మత్స్య, పశుపోషణ రంగాలు సహజంగానే భారత రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

తొలి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుండి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వరకు ఎవరు ప్రధాని అయినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ రంగాల ప్రాధాన్యతను, జీవనోపాధులను గమనంలోకి తీసుకునే విధాన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఇటీవల భారత అమెరికా వాణిజ్య చర్చల్లో కూడా ఈ అంశాలు ప్రముఖంగా చోటుచేసుకున్నాయి. తమ వ్యవసాయ, పాడి ఉత్పత్తులు, విత్తనాల దిగుమతికి అనుమతించాలని, సుంకాలను సరళీకరించాలని అమెరికా చేస్తున్న ఒత్తిడులకు భారత్ తలఒగ్గలేదు. కోట్లాది మంది మన అన్నదాతలు, మత్స్య, పశుపోషకుల జీవితాలను పణంగా పెట్టే విషమ షరతులకు అంగీకరించే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రభృతులు స్పష్టం చేయడం సరైనదే.

భారత్ ఎగుమతులలో వ్యవసాయ ఉత్పత్తులకు కూడా గణనీయస్థానం ఉంది. 2013లో 314 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య ఎగుమతులు, 2024 నాటికి 437.10 మిలియన్ల డాలర్లకు పెరిగాయి. ఈ దశాబ్ద కాలంలోనే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 22.7 బిలియన్ల నుండి 48.15 బిలియన్ డాలర్లకు అంటే 112 శాతం పెరగడం విశేషం. ఈ ఏడాది మార్చి 31 వరకు వాణిజ్య ఎగుమతులు 437 బిలియన్ డాలర్లుగా పెద్దగా పెరుగుదల లేకపోయినా వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు 51.9 బిలియన్ డాలర్లకు 6.4 శాతం పెరిగాయి. మన వాణిజ్య ఎగుమతులలో సేద్యపు రంగ ఉత్పత్తుల వాటా 11 శాతం. మన దేశం ప్రధానంగా బాసుమతి బియ్యం, ఇతర రకాల బియ్యాలు, సుగంధద్రవ్యాలు, చక్కెర, గొడ్డుమాంసం, నూనెలు, పండ్లు, కూరగాయలు, చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తులు ముఖ్యమైనవి.

వ్యవసాయోత్పత్తులు ఎగుమతి చేస్తున్న పది ప్రఖ్యాత దేశాలలో భారత్ కూడా ముఖ్యమైనదే. 2021లో భారత వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు 2.4 శాతం కాగా, దిగుమతులు 1.7 శాతంగా ఉన్నట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ వెల్లడించింది. అయితే అమెరికా వంటి అగ్రరాజ్యాలు సుంకాలను ఆయుధాలుగా ప్రయోగించి దిగుమతులను నిరోధిస్తున్నందున ఎగుమతుల విస్తరణకు వివిధ దేశాలలో గల అవకాశాలను అన్వేషించి మన దేశం మార్కెట్ లను విస్తరించుకోవడం అవసరం. అప్పుడే మన ఎగుమతుల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతాము. దేశంలో ద్రవ్యోల్బణ రేటు మన వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రభావితం చేస్తోంది. దేశంలోని ధరలను బట్టే బియ్యం, గోధుమ, చక్కెర, ఉల్లిగడ్డల ఎగుమతులను అనుమతిస్తున్నారు.

2023 -24లో వీటి ధరల పెరుగుదలను అడ్డుకోవడానికి ఎగుమతులను నిరోధించారు. అలాంటి సందర్భాలలో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేయలేక విశ్వసనీయత కోల్పోవాల్సి వస్తోంది. అందువల్ల నిలకడ అయిన ఎగుమతుల విధానం ఉంటే మేలని ఎగుమతి దారులు అంటున్నారు. ప్రపంచ విపణిలో ముడి చక్కెరకు మంచి గిరాకీ ఉంది. ఈ ఏడాది అక్టోబర్ నుండి భారత చక్కెర ఉత్పత్తి 350 లక్షల టన్నుల మేర ఉండగలదని, 285 టన్నులు దేశీయ వినియోగానికి పోగా, 65 లక్షల టన్నులు ఎగుమతికి అందుబాటులో ఉంటుంది. సకాలంలో ఎగుమతులను అనుమతించకపోతే దేశంలో చక్కెర ధరలు తగ్గుతాయి. ఏ సమయంలో ఎంత ఎగుమతి చేయాలో నిర్ణయాన్ని తమకే ఇవ్వాలని చక్కెర పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. హఠాత్తుగా ఆంక్షలు ఎగుమతి సుంకాలు విధించడం వల్ల ధరలు తగ్గి అన్నదాతలు ఆదాయం కోల్పోయి దుస్థితికి గురవుతున్నారు.

ఉల్లి ఎగుమతులపై రెండేళ్ళ క్రితం నిషేధం విధించడం వల్ల ధరలు పడిపోయి మహారాష్ట్రలో రైతులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు నిషేధాన్ని ఎత్తేసినా ప్రయోజనం లేకపోయింది. పంటను రైతులు కల్లాల్లోనే వదిలేసి సాగు ఖర్చుకూడా రాక అప్పుల పాలయ్యారు. నిలకడలేని ఎగుమతి దిగుమతి విధానం వల్ల రైతుల విశ్వాసాన్ని కోల్పోతున్నామని రైతు ఉత్పత్తిదార్ల సహకార సంఘాలు వాపోతున్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి భారత్ 7.45 బిలియన్ల విలువైన రొయ్యలు, చేపలు ఇతర సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసింది. వాటిలో మూడింట రెండువంతులు రొయ్యలే. వాటిలో అమెరికాకు రొయ్యల ఎగుమతులు 35% మేర ఉన్నాయి. ట్రంప్ కక్ష కట్టినట్లుగా 50% దిగుమతి సుంకాలు విధించడం వల్ల భారత ఎగుమతిదార్లు తీవ్ర కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రైతులు వరి మాగాణాలను చేపలు, రొయ్యల చెరువులుగామార్చి వాటి ఎగుమతులపై అధికంగా ఆధారపడుతున్నందున అమెరికా సుంకాల దెబ్బకు విలవిలలాడుతున్నారు. గత ఆగస్టు వరకు అమెరికాలో దిగుమతి సుంకాలు 10% మాత్రమే ఉండేవి. ఇప్పుడు కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రొయ్యలు, చేపల రైతులను ఆదుకునేందుకు తక్షణ కార్యాచరణ చేపట్టాలి. రష్యా, యూరోపియన్ యూనియన్ దేశాలు, బ్రిటన్, నార్వే, దక్షిణ కొరియా, మధ్యప్రాచ్య దేశాలకు రొయ్యలు, చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తులకు గల అవకాశాలను అన్వేషించి కొత్త మార్కెట్‌లను అందుబాటులోకి తేవడానికి మోడీ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. భారత్- అమెరికా వార్షిక వాణిజ్యం 7 బిలియన్ డాలర్లు. అమెరికా నుండి 1.5 బిలియన్ డాలర్ల వ్యవసాయోత్పత్తులను మనదేశం దిగుమతి చేసుకొంటోంది. మన వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు 5.5 బిలియన్ డాలర్లు.

వాటిలో 46% సముద్ర ఉత్పత్తులు. ఆ తర్వాత బియ్యం, పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలున్నాయి. భారత్ 2016 -23 మధ్య పామాయిల్, పొద్దుతిరుగుడు, సోయాబీన్ నూనెలను దిగుమతి చేసుకున్నది. స్వావలంబన గురించి గొప్పలుచెప్పే ప్రభుత్వం నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించలేకపోవడం విచారకరం. వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్ డాలర్ల వ్యవసాయోత్పత్తులను ఎగుమతి చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యం. స్వాతంత్య్రం సాధించి 2047 శతాబ్ది పూర్తయ్యేనాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే దేశఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తూనే, వివిధ దేశాలకు మన ఎగుమతులను విస్తరించాలి. వరి ఉత్పత్తిలో తెలంగాణ మేటిగా నిలిచింది. పండ్ల ఉత్పత్తిలో అనుకూలాలున్న రాయలసీమ అన్నదాతలను ప్రోత్సహిస్తే వారు ఇతోధికంగా పండ్లు ఎగుమతి చేసి ఆర్థికాభివృద్ధికి తోడ్పడగలరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలను ప్రోత్సహిస్తే అద్భుతాలను ఆవిష్కరించగలరు.

Also Read : పసికూన ఓమన్‌పై గెలిచిన పాక్

  • పతకమూరు
    దామోదర్ ప్రసాద్
    94409 90381
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News