Thursday, May 8, 2025

ఇంకెన్నాళ్లు.. కౌలు రైతుల కన్నీళ్లు!

- Advertisement -
- Advertisement -

మానవ మనుగడకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా పరిగణించే మనం, ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసే రైతును మాత్రం ఆర్థికంగా ఆదుకోలేకపోతున్నాం. సమస్యలకు కారణాలు ఏవైనా బలిపశువు మాత్రం రైతే. ప్రముఖ తెలుగు దినపత్రికల కథనాల ప్రకారం గత కొన్ని నెలల్లో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అందులోను యువ కౌలు రైతుల ఆత్మహత్యలు చేసుకోవడం గమనిస్తున్నాం. ఒక వైపు ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు యువత వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవాలని సూచిస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు జరగడం మరింత బాధాకరం. తగినంత వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల గ్రామీణ యువత ఇలాంటి సంఘటనలు చాలా ప్రభావితం చేస్తాయి.

రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం అప్పుల భారం. ప్రభుత్వ అధికారికా లెక్కలైన 77వ జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌ఒ)-వ్యవసాయ గృహాల పరిస్థితి అంచనా -2018- 19 ప్రకారం దేశంలోని 50.2 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల భారాన్ని మోస్తున్నాయి. అదే విధంగా, మన రాష్ట్రంలో 91.7 శాతం రైతు కుటుంబాలు అప్పులు బారినపడ్డాయి. ఇలా అప్పుల భారాన్ని తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందులోను కౌలు రైతులు సాధారణ రైతుల కంటే అధికంగా నష్టపోతున్నారు. దేశవ్యాప్తంగా సుమారుగా 22.804 మిలియన్ల వ్యవసాయ కుటుంబాలు అనగా మొత్తం సాగు కుటుంబాలలో 17.3% శాతం వ్యవసాయ కుటుంబాలు 13% వ్యవసాయ ప్రాంతాన్ని కౌలు రైతులు సాగుచేస్తున్నారు.

తెలంగాణ వ్యవసాయ గణన-2021- 22 ప్రకారం రాష్ట్రంలో 63.12 లక్షల హెక్టార్ల భూవిస్తీర్ణంలో మొత్తం భూకమతాల సంఖ్య 70.60 లక్షలు కాగా, భూమిని లీజుకు తీసుకున్న కుటుంబాల శాతం: 12.7 (2018-19). అందులో సుమారుగా 90.1 శాతం కౌలు రైతులు నేరుగా స్థిరమైన డబ్బు చెల్లించి సాగు చేయడం ద్వారా పంటలో నష్టం వస్తే అప్పుతోపాటు వడ్డీ చెల్లించలేక అప్పుల బారినపడుతున్నాడు. ఈ నేపథ్యంలో కౌలు రైతును ఆదుకోవడం ప్రభుత్వాల నైతిక బాధ్యత. ఆర్థిక నిచ్చెనలో అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే దేశ శ్రేయస్సు స్థిరంగా ఉంటుండి. కౌలు రైతుల సమస్యలు అనేక సంవత్సరాల నుండి కొనసాగుతున్నా ప్రభుత్వాలు కౌలు రైతులను ఆదుకోవడంలో విఫలమవుతున్నాయి. అందుకు ప్రభుత్వాలు అనేక కారణాలు చెప్తున్నా ప్రధానంగా సరైన రీతిలో భూరికార్డులు లేవని, భూయజమానులు వీలునామా ఇవ్వడంలో ముందుకు రావడం లేదని, క్షేత్రస్థాయిలో కౌలు రైతులను గుర్తించడంలో సమస్యలు ఉన్నాయని, కౌలు రైతులు స్థిరంగా ఒకే భూమిపై సాగును చేయటం లేదని వారు సాగు నిరంతరం మారుతుందని ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి.

అయితే ఒక సమస్యను పరిష్కారాన్ని సహృదయంతో ముందుకు సాగితే సమస్యలు ఏదో ఒకరోజు పరిష్కారం దొరుకుతుంది. అందులోను నేటి సాంకేతిక యుగంలో పైన పేర్కొన్న కారణాలన్నీ అధునాతన సాంకేతిక విధానాలు ద్వారా పాలనాపరమైన, చట్టపరమైన అడ్డంకులను సవరించడం వల్ల ఎదుర్కోవచ్చు.స్వాతంత్య్రం తర్వాత దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు రూపొందించిన భూమి లీజు చట్టాలు రైతులను భూస్వామ్య విధాన దోపిడీ నుండి రక్షించటానికి రూపొందించబడ్డాయి. అందుకనుగుణంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ భూమి లీజుపై చట్టబద్ధంగా నిషేధించాయి లేదా ఆంక్షలు విధించాయి. కానీ గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక పరిస్థితుల మార్పువల్ల వాటి ఔచిత్యాన్ని కోల్పోయాయి.

అయితే, ప్రస్తుత దేశ కౌలు రైతుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చూస్తే కౌలు వ్యవసాయం అనేది ఒక ఆర్థిక అవసరం, ఇంతకు ముందు అనుకున్నట్లుగా భూస్వామ్య విధానానికి చిహ్నం కాదు. వ్యవసాయం అన్నది భూస్వాములకు, కాడెద్దులు లేదా ఎకరం భూమి ఉన్నా వారికే పరిమితం కాకూడదు. నేటి ఆధునిక వ్యవసాయ విధానంలో యాంత్రీకరణ పెరగడం వల్ల వ్యవసాయం చేసే వారి పరిధి పెరిగింది. సామాన్య వ్యవసాయ కూలి తన శారీరక వ్యవసాయ సామర్థ్యం వల్ల తనకు సెంటు భూమి లేకున్నా కౌలుకు భూమిని తీసుకుని వ్యసాయాన్ని చేయడానికి ముందుకొస్తున్నాడు. అయితే, భూమి లీజుపై చట్టపరమైన ఆంక్షలు విధించడం వల్ల సాగు సామర్థ్యాన్ని అనేక విధాలుగా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

అందులో ప్రధానంగా భూమి లీజుపై చట్టబద్ధమైన నిషేధం లేదా పరిమితులు వల్ల దేశంలోని చాలా రాష్ట్రాలలో దాచిన లేదా రహస్య కౌలుకు సాగుకు దారితీశాయి. అదే విధంగా కౌలు రైతులకు సంస్థాగత క్రెడిట్, బీమా, ఇతర ప్రభుత్వ సేవలకు దూరమవుతున్నారు. దానివల్ల రోజువారీ వ్యవసాయ పనులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నవి. అంతేకాకుండ, చాలా మంది భూయజమానులు తమ భూములను బీడుగా ఉంచడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే తమ భూములను లీజుకు ఇస్తే భూమి హక్కును కోల్పోతారనే భయం ఉంది. ఈ నేపథ్యంలో, వివిధ రాష్ట్రాలలో ఉన్న వ్యవసాయ కౌలు చట్టాలను సమీక్షించి వేగవంతమైన గ్రామీణ పరివర్తన కోసం భూమి లీజును చట్టబద్ధం చేసి సరళీకరించాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధమైన అధికారిక కౌలు వ్యవసాయం దోపిడీకి దారితీస్తుందనేది ఇకపై నిజం కాదు.

వాస్తవానికి కౌలు రైతుల బేరసారాల శక్తి కాలక్రమేణా గణనీయంగా మెరుగుపడడంతోపాటు గ్రామీణ ప్రజలకు నియమాలు, చట్టాలపై అవగాహన పెరిగి ప్రజాస్వామ్య ప్రక్రియల ద్వారా రాజకీయంగా మరింత శక్తివంతులుగా మారారు. అందువల్ల, ప్రస్తుతం ఉన్న భూమి లీజును చట్టబద్ధం చేయడం వలన కౌలుదారులకు కాలపరిమితి భద్రతను అందిస్తుంది. భూమి లీజుకు చట్టబద్ధత చేయడం వల్ల కౌలుదారు రైతులకు సంస్థాగత రుణాలు, బీమా, వివిధ రకాల ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. దానితో సాగుకు ఎలాంటి ఆర్థికపరమైన అవరోధాలు లేకుండా పంటల ఉత్పత్తి మెరుగుపడుతుంది. భూమిలేని పేదల వ్యవసాయ సామర్థ్యం, సమానత్వాన్ని మెరుగుపరచడం కోసం 2016లో నీతిఆయోగ్ వ్యవసాయ భూమి లీజింగ్‌పై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి దేశంలోని వివిధ రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోగల వ్యవసాయ భూమి లీజింగ్‌పై నమూనా చట్టం రూపొందించింది. నమూనా చట్టంలో లీజు ఒప్పందం వివరాలు, నిబంధనలు, షరతులు స్పష్టంగా పొందుపర్చి కౌలు రైతులను ప్రభుత్వ అందించే అన్ని రకాల సేవలకు అర్హులుగా చేసే విధంగా రూపొందించింది.

అంతేకాకుండా, భూయజమానికి భద్రత కల్పిస్తూ కౌలు రైతు భూమిపై ఎటువంటి హక్కును పొందడు, దీర్ఘకాలం కౌలుకు తీసుకున్న వారసత్వంగా భూమి హక్కును పొందలేరని స్పష్టంగా పొందుపర్చడమే కాకుండా ఎలాంటి సమయంలోనైనా లీజును ముందుగా హెచ్చరించి రద్దు చేయవచ్చని, ఒకవేళ వివాదాలు ఏర్పడినచో ఎలా పరిష్కరించాలో కూడా నమూనా చట్టంలో పొందుపర్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ భూ లైసెన్స్ పొందిన సాగుదారుల చట్టం -2011ను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 క్రింద తెలంగాణ భూ లైసెన్స్ పొందిన సాగుదారుల చట్టం, 2011 గా స్వీకరించి కొనసాగుతున్నది. ఈ చట్టంలో లైసెన్స్ పొందిన భూమి సాగుదారు అంటే ఎవరు, రుణ అర్హత కార్డు జారీ చేసి ప్రభుత్వ ఆర్థిక సంస్థలు పంట రుణాన్ని మంజూరు చేయవచ్చు అన్న మౌలిక అంశాలను పొందుపర్చినప్పటికీ చాలా అంశాలను స్పష్టంగా నిర్వచించబడలేదు లేదా ప్రస్తావించబడలేదు. ఈ తరుణంలో ప్రస్తుతం ఉన్న చట్టాన్ని నేటి మన రాష్ట్ర సాగు పరిస్థితులకు అనుగుణంగా నీతిఆయోగ్ వ్యవసాయ భూమి లీజింగ్‌పై నమూనా చట్టం ప్రకారం చాలా అంశాలను సవరించాలి.

మన దేశంలో వ్యవసాయ భూముల రికార్డులను డిజిటలీకరణం చేయడానికి కేంద్ర ప్రభుత్వ కేబినెట్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌ను ఆమోదించింది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మించనుంది. అందులో అగ్రిస్టాక్ ద్వారా రైతుల పట్టిక, జియో రెఫరెన్సుతో కూడిన గ్రామా చిత్రాన్ని, పంటల విత్తిన పట్టిక రూపొందించి ప్రతి రైతుకు ఒక గుర్తింపు కార్డును ఇవ్వనున్నారు. కేబినెట్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌కు అనుగుణంగా మన రాష్ట్రంలో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయ భూములను డిజిటలీకరణం చేయడానికి పూనుకున్నాయి. దీని ద్వారా రైతులకు ఉపయోగపడే అనేక రకాల సేవలను అందించడం సులువడంతో పాటు కౌలు రైతులు యజమానులు, ప్రభుత్వాల మధ్య కౌలుకు సంబంధిత సేవలు అందించడంలో సహాయపడవచ్చు.

కౌలు రైతులను ఆదుకోవడంలో భూయజమాన్యులు కీలక పాత్ర పోషించనున్నారు. భూయజమానులు తమ భూములను కాపాడుకుంటూ కౌలు రైతులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను అందించడంలో అన్ని విధాలా సహకరించినట్లైతే కష్టపడి పండించే కౌలు రైతును ఆదుకొని వారి సంక్షేమంలో సహాయపడినవాళ్లవుతారు. స్వాతంత్య్రం సమయంలో 70 శాతం దేశ జనాభా వ్యవసాయ మీద ఆధారపడి జీవన కొనసాగించేది. 2024 నాటికి వ్యవసాయం మీద ఆధారపడే వారి సంఖ్య 46.1 శాతానికి చేరింది. మరోవైపు పెరుగుతున్న దేశ జనాభాకు సరిపడా ఆహార భద్రతా కల్పించడం రానున్న రోజుల్లో ప్రధాన సమస్యగా మారనుంది. ఈ తరుణంలో వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే వారిని ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత. కౌలు రైతుల చట్టపరమైన భద్రత కల్పించి వారికి కూడా సాధారణ రైతులకు ప్రభుత్వాలు అందించే పథకాల సేవలను అందించినట్లైతే సేద్యం చేసేవారి సంఖ్య పెరుగుతుంది. దీనికి మేధోపరమన స్థాయిలోనే కాకుండా చట్టబద్ధమైన విధాన, పరిపాలన స్థాయిలో చర్యలు తీసుకున్నట్లైతే కౌలు రైతుకు మేలు జరుగుతుంది.

డా. రేపల్లె నాగన్న
7990842149

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News