భారతదేశ వ్యవసాయ రంగం నూతన సాంకేతిక శకంలోకి ప్రవేశించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జన్యుసవరణ ద్వారా అభివృద్ధి చేసిన వరి రకాలను విడుదల చేసిన ఘనతను మన దేశం సొంతం చేసుకుంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మే 4 నాడు న్యూఢిల్లీలో చేసిన ప్రకటన. ఇది శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణ రంగంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఈ నూతన వంగడాల అభివృద్ధిలో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (ఐఐఆర్‌ఆర్), హైదరాబాద్; ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎఆర్‌ఐ), న్యూఢిల్లీలోని శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారు.
క్రిస్పర్-కాస్ ఆధారిత సాంకేతికత వంటి ఆధునిక జన్యుసవరణ పద్ధతులను ఉపయోగించి వీటిని రూపొందించారు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇవి గతంలో చర్చకు వచ్చిన జన్యుమార్పిడి (జిఎం) పంటల కోవలోకిరావు. జన్యుమార్పిడిలో ఇతర జీవులనుండి జన్యువులను చేర్చడం జరుగుతుంది. అయితే జన్యుసవరణలో వరి మొక్క సొంత జన్యువులలోనే నిర్దిష్టమైన, ఖచ్చితమైన మార్పులు చేస్తారు. బయటి నుండి అదనపు డిఎన్‌ఎను చేర్చరు. ఈ తేడా సాంకేతికంగానే కాకుండా, నియంత్రణపరంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.
జన్యు సవరణ అనేది జన్యు సాంకేతికతలోని ఒక నూతన విధానం. ఇది ఒక మొక్క సొంత జన్యువులలోనే అత్యంత ఖచ్చితమైన నిర్దిష్టమైన మార్పులు చేసే పద్ధతి. క్రిస్పర్- కాస్9 వంటి అధునాతన జన్యు సవరణ సాధనాలను ఉపయోగించి డిఎన్‌ఎలోని కావలసిన నిర్దిష్ట భాగాలను కత్తిరించడం, తొలగించడం లేదా స్వల్ప మార్పులు చేయడం జరుగుతుంది. ఇది ప్రకృతిలో సహజంగా జరిగే ఉత్పరివర్తనల మాదిరిగానే ఉంటుంది. కానీ ప్రయోగశాలలో అత్యంత నియంత్రిత, ఖచ్చితమైన పద్ధతిలో జరుగుతుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి జన్యు-సవరించిన వరి రకాలు – డిఆర్‌ఆర్ రైస్ 100 (కమల), పూసా డిఎస్‌టి రైస్ 1 – అధిక ఉత్పత్తి, వాతావరణ అనుకూలత, నీటి సంరక్షణపరంగా విప్లవాత్మక మార్పులు తీసుకురాగల సామర్థ్యం కలిగి ఉన్నాయి.
వీటిని అత్యాధునిక క్రిస్పర్ – కాస్ ఆధారిత జీనోమ్- ఎడిటింగ్ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పద్ధతిలో ‘విదేశీ డిఎన్‌ఎ’ ను జోడించకుండానే జీవి జన్యు పదార్థంలో ఖచ్చితమైన మార్పులు చేయవచ్చు. భారతీయ జీవ భద్రతా నిబంధనల ప్రకారం, సైట్ డైరెక్టెడ్ న్యూక్లియస్ 1 (ఎఎస్‌డిఎన్ 1), సైట్ డైరెక్టెడ్ న్యూక్లియస్ 2 (ఎస్‌డిఎన్ 2) రకాల జన్యువుల జీనోమ్ ఎడిటింగ్‌కు ఆమోదం లభించింది. ఈ సైట్ డైరెక్టెడ్ న్యూక్లియేజ్ టెక్నాలజీ, న్యూక్లియేజ్‌లనే ప్రత్యేక ఎంజైమ్‌లను ఉపయోగించి డిఎన్‌ఎలో కావలసిన మార్పులను కచ్చితంగా ప్రవేశపెడుతుంది. ఎస్‌డిఎన్ 1 విధానం విదేశీ డిఎన్‌ఎను ఉపయోగించకుండానే చిన్న చొప్పనలు లేదా తొలగింపులను చేస్తుంది.
మొదటి రకమైన డిఆర్‌ఆర్ రైస్ 100 (కమల)ను హైదరాబాద్‌లోని ఐసిఎఆర్, ఐఐఆర్‌ఆర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన సాంబా మసూరి (బిపిటి 5204) రకం ఆధారంగా రూపొందించబడింది. ఇందులో ధాన్యం సంఖ్యను మెరుగుపరచడానికి సైటోకినిన్ ఆక్సిడేస్ 2 జన్యువును లక్ష్యంగా చేసుకుని ఎస్‌డిఎన్ 1 సాంకేతికతను ఉపయోగించారు. ఈ రకం 20 రోజుల ముందుగానే పరిపక్వం చెందుతుంది. తద్వారా నీరు, ఎరువుల వినియోగాన్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా, ఇది మీథేన్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది.దీని కాండం బలంగా ఉండటం వల్ల పంట నేల కూలకుండా ఉంటుంది. బియ్యం నాణ్యత కూడా సాంబా మసూరిని పోలి ఉండటం విశేషం. ఇక రెండవ రకం పూసా డిఎస్‌టి రైస్ 1ను ఐసిఎఆర్ – ఐఎఆర్‌ఐ, న్యూఢిల్లీ శాస్త్రవేత్తలు ఎంటియు 1010 రకం ఆధారంగా అభివృద్ధి చేశారు. ఈ రకం ఉప్పు, క్షార నేలల్లో దిగుబడిని 9.66% నుండి 30.4% వరకు పెంచుతుంది.
మొత్తం ఉత్పత్తిలో దాదాపు 20% వరకు పెరుగుదలకు అవకాశం ఉంది. ఈ నూతన జీనోమ్ రకాలు అధిక ఉత్పత్తినివ్వడమే కాకుండా, వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉండటం, నీటి సంరక్షణలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకురాగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇది నీటిపారుదల నీటిని గణనీయంగా ఆదా చేస్తుంది. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం ద్వారా పర్యావరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఉత్పత్తి పెరుగుదల, పర్యావరణ పరిరక్షణ అనే రెండు ప్రయోజనాలను ఒకేసారి సాధించడానికి ఇది అద్భుతమైన ఉదాహరణ. ఈ రెండు అధునాతన రకాలు సగటున దిగుబడిలో 19% పెరుగుదలను, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో 20% తగ్గింపును, సుమారు 7,500 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిపారుదల నీటిని ఆదా చేస్తాయని అంచనా. అంతేకాకుండా ఈ రకాలు కరువు, లవణీయత వంటి వాతావరణ ఒత్తిళ్లను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటం రైతులకు మరింత భరోసానిస్తుంది.
ఈ రకాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి వివిధ రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం జరిగింది. కొత్త వంగడాలు ఆశించిన ప్రయోజనాలను అందించినప్పటికీ, వాటిని క్షేత్రస్థాయిలో రైతులకు చేర్చడంలో, విస్తృతంగా వినియోగించడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయి. జన్యు సవరణ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై రైతులు, సాధారణ ప్రజలలో పూర్తి అవగాహన లేకపోవడం, జన్యుమార్పిడి పంటలపై ఉన్న అపోహలు దీనిపై కూడా ప్రభావం చూపవచ్చు. వీటి భద్రతపై శాస్త్రీయ ఆధారాలతో కూడిన సమాచారాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యత. ప్రయోగశాల, పరిశోధనా క్షేత్రాల్లో చూపిన అద్భుతమైన ఫలితాలు రైతుల పొలాల్లో కూడా అదే స్థాయిలో రావాలంటే సరైన సాగు పద్ధతులను అనుసరించాలి. దీనిపై రైతులకు శిక్షణ అవసరం. ఈ సవాళ్లను అధిగమించడానికి, ఈ కొత్త శాస్త్రీయ ఆధారిత సమాచారాన్ని సరళమైన భాషలో రైతులకు, ప్రజా సంఘాలకు, వినియోగదారులకు అందించి అవగాహన కల్పించాలి.
- జనక మోహనరావు దుంగ
8247045230