టెక్నాలజీ, ఎఐ రంగంలో రిలయన్స్ భారీ అడుగులు
ఎఐ స్మార్ట్ గ్లాసెస్ జియో ఫ్రెమ్స్ లాంచ్
రిలయన్స్ 48వ ఎజిఎంలో అంబానీ కీలక ప్రకటనలు
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం)లో భవిష్యత్ సాంకేతికత, వ్యాపార విస్తరణ లక్ష్యాలపై సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. రిలయన్స్ వృద్ధిని నిర్దేశించే పలు ముఖ్యమైన నిర్ణయాలను ఆయన వెల్లడించారు. వీటిలో అత్యంత ప్రధానమైన జియో ఐపిఒ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రకటన కూడా ఉంది. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ ఐపిఒను తీసుకురానున్నట్లు, ఇది ప్రపంచవ్యాప్తంగా వాటాదారులకు అద్భుతమైన విలువను సృష్టిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ)పై రిలయన్స్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రపంచ టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటాతో కీలక భాగస్వామ్యాలను ప్రకటించింది. గూగుల్ క్లౌడ్, ఎఐ టెక్నాలజీలతో రిలయన్స్ విస్తృత నెట్‌వర్క్‌ను అనుసంధానించి, భారతదేశంలోని డెవలపర్లు, స్టార్టప్‌లు, వ్యాపారాలకు కొత్త అవకాశాలు కల్పించడమే లక్ష్యమని అంబానీ తెలిపారు. ఇంధనం నుండి రిటైల్ వరకు, టెలికాం నుండి ఆర్థిక సేవల వరకు రిలయన్స్ అన్ని వ్యాపారాలను ఎఐ సహాయంతో మార్పు తీసుకువచ్చేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుంది.
మెటాతో కలిసి ‘సావరిన్, ఎంటర్ప్రైజ్- రెడీ ఎఐ‘ని భారతదేశానికి తీసుకువచ్చే ఒక ప్రత్యేక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ భాగస్వామ్యం ద్వారా భారతీయ వ్యాపారాలకు ఓపెన్-సోర్స్ ఎఐ మోడళ్లను అందించి, వారి కార్యకలాపాలను వేగవంతం చేస్తామని మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ‘ఎఐ మా తరం కామధేనువు‘ అని అభివర్ణించిన అంబానీ, రిలయన్స్ వ్యాపారాల్లో దానిని సమగ్రంగా అనుసంధానిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనికి కొనసాగింపుగా, ’జియో ఎఐ రెడీ క్లౌడ్ పిసి’ని ప్రకటించారు. ఈ పరికరం ద్వారా వినియోగదారులు తమ టీవీ లేదా ఏదైనా స్క్రీన్‌ను శక్తివంతమైన ఎఐ కంప్యూటర్‌గా మార్చుకోవచ్చు. ఖరీదైన హార్డ్‌వేర్ అవసరం లేకుండానే క్లౌడ్ ద్వారా అత్యాధునిక కంప్యూటింగ్ సేవలను పొందవచ్చు.
నూతన ఆవిష్కరణలు, రిటైల్ విస్తరణ
రిలయన్స్ జియా సరికొత్త ఎఐ ఆధారిత ఐవేర్ అయిన మెటా రేబ్యాన్ గ్లాస్‌ను జియో ఫ్రెమ్స్ పేరిట విడుదల చేసింది. ఈ కొత్త గ్లాస్ జియో ఫ్రేమ్‌ల విష్కరణ సందర్భంగా రిలయన్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అకాశ్ అంబానీ మాట్లాడుతూ, ఎఐ ఆధారిత గ్లాసెస్ జియో ఫ్రేమ్స్ భారత పర్యావరణ అనుకూల విధానానికి అనుగుణంగా నిర్మించగా, ఇది దేశంలోని వివిధ భాషలకు సపోర్ట్ చేస్తుందన్నారు. జియో ప్లాట్‌ఫామ్స్ నుండి పలు కొత్త సేవలను కూడా ప్రవేశపెట్టారు. కంటెంట్‌పై వాయిస్ సెర్చ్ కోసం ’రియా’, భారతీయ భాషలలో ఎఐ డబ్బింగ్, లిప్-సింక్ కోసం ’వాయిస్ ప్రింట్’, బహుళ-కోణాలలో క్రికెట్ అనుభవాన్ని అందించే ’మాక్స్ వ్యూ 3.0’ వంటివి వీటిలో ఉన్నాయి. రిటైల్ రంగంలో కూడా ఒక ముఖ్యమైన మార్పును ప్రకటించారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్ లిమిటెడ్ (ఆర్సిపిఎల్) ఇకపై నేరుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థగా పనిచేస్తుంది.
రాబోయే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించిన అత్యంత వేగవంతమైన వినియోగదారు బ్రాండ్‌గా ఆర్సిపిఎల్ అవతరిస్తుందని రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. రిలయన్స్ నూతన ఇంధన వ్యాపారం భవిష్యత్తులో ప్రధాన వృద్ధి చోదకంగా మారుతుందని ముకేశ్ అంబానీ అన్నారు. జామ్‌నగర్‌లో నిర్మిస్తున్న ధీరూభాయ్ అంబానీ గిగా ఎనర్జీ కాంప్లెక్స్, టెస్లా గిగాఫ్యాక్టరీ కంటే నాలుగు రెట్లు పెద్దదిగా ఉంటుందని అనంత్ అంబానీ తెలిపారు. ఇది రిలయన్స్ హరిత ఇంధన లక్ష్యాలకు నిదర్శనంగా నిలుస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రూ.10.71 లక్షల కోట్ల ఆదాయాన్ని, రూ.81,309 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని, ప్రభుత్వ ఖజానాకు రూ.2.10 లక్షల కోట్లు అందించామని అంబానీ వివరించారు. ఈ కీలక ప్రకటనల నేపథ్యంలో, ఎజిఎం రోజున రిలయన్స్ షేర్లు స్వల్ప ఒడిదుడుకులకు లోనయ్యాయి.