Friday, May 9, 2025

ఎఐ లిటరసీ పెరగాలి

- Advertisement -
- Advertisement -

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ)ని పిలవడం అంటే పిశాచాన్ని పిలిచినట్టే అని ఎలాన్ మస్క్ అన్నప్పుడు, ఆయన హెచ్చరిక మన భవిష్యత్తుపై ఒక గంభీరమైన ప్రభావాన్ని చూపింది. కానీ ఈ హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా ఎఐ అనే శక్తి ఇప్పటికీ మానవాళిని ఆకర్షిస్తూ ముందుకు దూసుకుపోతుంది. మన ఫోన్‌లోని వాయిస్ అసిస్టెంట్ల నుంచి, డ్రైవర్ లేకుండా నడిచే కార్ల వరకూ ఈ ఎఐ సైన్స్ ఫిక్షన్ కాదని స్పష్టమైంది. గూగుల్, ఫేస్‌బుక్ వంటి ‘డేటా ఆధారిత’ దిగ్గజ సంస్థలు ఈ రంగలో మరింతవేగంగా దూసుకుపోతున్నాయి. ఈ వేగవంతమైన మార్పు ను అర్థం చేసుకోవటానికి మనం కొత్త రకమైన అక్షరాస్యతను, అంటే ఎఐ లిటరసీని మన పాఠశాలల్లో, ఉన్నంత విద్యా సంస్థల్లో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది.

ఎఐ అంటే కేవలం యంత్రాలు పని చేయడమే కాదు; అవి మానవబుద్ధిని అనుకరిస్తూ, నేర్చుకుంటూ, సమస్యలను పరిష్కరిస్తూ పని చేస్తాయి. ఎలాన్ ట్యూరింగ్ నమూనాలో మానవులతో సమానంగా మాట్లాడగల చాట్‌బాట్లు, సమర్థంగా లక్ష్యాలను చేరుకునే రేషనల్ ఏజెంట్లు మొదలైనవి అన్నీ ఎఐ పరిమితులను విస్తరించాయి. కానీ ఈ శక్తి అనేక సవాళ్లను కూడా తీసుకొచ్చింది. ఓపెన్ ఎఐ ఎస్ 03, గూగుల్ జెమిని -2.5 వంటి తాజా మోడల్స్ నూతన దిశగా దూసుకు పోతున్నాయి. వెబ్‌లో తాము శోధించి, కోడ్ రాసి, గ్రాఫ్‌లు రూపొందించి, వివిధ మాధ్యమాలను కలిపి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఈ వాస్తవంలో పైన చెప్పిన ఈ జవాబు నిజమా? అన్న సందేహం, ఈ సమాచారం ఎలా బయటకు పొక్కింది? అన్న ప్రశ్నగా మారింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఎఐ లిటరసీ మనకు అత్యవసరం. ఇది కేవలం టెక్నాలజీ ఉపయోగించడమే కాదు. దాని వెనుకనున్న విధానాలనుకూలంగా అర్థం చేసుకోవడం. వాటి పరిమితులను గుర్తించడం కూడా అవసరమే. కనుక ఎఐ సామాజిక ప్రభావాలను, మానవ హక్కులపై దాని ప్రభావాన్ని విశ్లేషించగలగడం కూడా ముఖ్యమే. వ్యక్తి గత డేటా భద్రత, సమాచారం వాస్తవికత, నైతికత- ఇవి అన్నీ ఈ అక్షరాస్యతలో ఇమిడి ఉన్న భాగాలే. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ ఎఐ చుట్టూ తిరిగుతోంది. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, అమెరికా, చైనా మొదలైన అభివృద్ధి చెందిన దేశాలన్నీ తమ జాతీయ విద్యా విధానంలో ఈ ఎఐ నైపుణ్యాలను తమ విద్యార్థులకు నేర్పించే పనిలోపడ్డారు.

భవిష్యత్ విద్యా వ్యూహాల్లో విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. యునెస్కో, ఐఎఫ్‌ఎల్‌ఎ వంటి సంస్థలు కూడా ఈ ఎఐ ని అర్థం చేసుకునే సామర్థ్యాలను తమ దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని ప్రణాళికలు వేస్తున్నాయి. మూడవ ప్రపంచదేశాలు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి దేశాలు కూడా ఈ మార్గాలను వేగంగా అనుసరించే పనిలో నిమగ్నమై ఉన్నారు.ఈ కార్యక్రమాలలో లైబ్రరీలు కీలక పాత్ర పోషిస్తాయి. డేటా నిర్వహణలో, సమాచార సేకరణా పరిజ్ఞానంలో నిపుణులైన లైబ్రేరియన్లు సామాజికంగా బాధ్యత గల ఎఐ వినియోగాన్ని ప్రోత్సహించడంలో మార్గ నిర్దేశకులవుతారు. ఫేక్ న్యూస్‌ను నివారించటం, ఆల్గోరిథమిక్ బైయాస్ వంటి సమస్యలను ప్రజలకు వివరించి, వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటంలో గ్రంథాలయాలు సమర్ధవంతంగా ఉపయోగపడతాయి.

ఇప్పుడు ఎఐ మానవునికి నమ్మదగిన సహచరిగా మారుతోంది. ఇది సాధారణ పరికరంగా కాకుండా, సమాచారాన్ని విశ్లేషించి, దాని ఆధారంగా చర్యలు తీసుకునే శక్తిగా రూపాంతరం చెందుతోంది. ఇలాంటి శక్తిని సమర్థవంతంగా, నైతికంగా ఉపయోగించాలంటే మేము ఎఐ లిటరసీని కొత్తతరానికి మూలాధారంగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే మనం ఈ శక్తిని శాపంగా కాక, శ్రేయస్కర మార్గంగా మార్చగలుగుతాం. ఇప్పుడు ఎఐని ఉపయోగించని రంగం అంటూ ఏదీ లేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, క్రీడలు, సంగీతం, వినోదం, రవాణా, ఆటోమొబైల్, యుద్ధరంగం ఇలా ఎఐ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఎఐ వాడకం గురించి తెలియని వారు అనాగరిక జనాభాలో చేరిపోతారు.

  • డా. రాధికా రాణి – 80743 17172
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News