ముంబై: ఎయిర్ ఇండియాకు (Air India) చెందిన విమానం తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. కొచ్చి విమానాశ్రయం నుంచి ముంబై బయలుదేరిన విమానం ముంబైలో రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపు తప్పింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎయిర్ ఇండియా ఎఐ2744 విమానం అదుపు తప్పి పక్కకు జరిగింది. వెంటనే స్పందించిన అత్యవసర ప్రతిస్పందన బృందాలు ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా దింపినట్లు తెలిపారు. ఈ ఘటనలో విమాన ఇంజిన్, మూడు టైర్లు దెబ్బ తిన్నట్లు పేర్కొన్నారు. ప్రైమరీ రన్‌వే కొంతమేర ధ్వంసం కావడంతో.. ఇతర విమానాల ల్యాండింగ్ కొరకు సెకండ్ రన్‌వేని వినియోగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
తనిఖీల కోసం ఎయిర్ ఇండియా (Air India) విమానాన్ని వేరే ప్రదేశానికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే విషయం తెలియాల్సి ఉంది. ధ్వంసమైన రన్‌వే పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.