Friday, August 15, 2025

అలస్కా భేటీపై ప్రపంచ దేశాల ఆసక్తి

- Advertisement -
- Advertisement -

రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈనెల 15న భేటీ (భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి ఒంటిగంటకు) కానున్నారు. దాదాపు నాలుగేళ్ల తరువాత ఇరువురు నేతలు ప్రత్యక్షంగా చర్చల్లో పాల్గొనబోతుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించే దిశగా పుతిన్‌ను ట్రంప్ ఒప్పించగలరా? అనేది చర్చనీయాంశంగా మారింది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై ట్రంప్ అదనంగా టారిఫ్ విధిస్తూ భారత ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రష్యా ప్రత్యర్థి దేశమైన ఉక్రెయిన్‌కు సైనిక సాయం భారీగా పెంచబోతున్నట్టు ప్రకటించారు.

ఈ తరుణంలో ట్రంప్, పుతిన్ భేటీకి విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూరప్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అతిపెద్ద యుద్ధం ఉక్రెయిన్ష్య్రా సంగ్రామమే. దీనికి సాధ్యమైనంత త్వరగా తెరదించాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. యుద్ధం ముగింపు చేయడానికి పుతిన్‌తో భేటీ కానున్నట్టు హఠాత్తుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. పుతిన్ ట్రంప్ సమావేశానికి అలస్కా వేదిక కావడం మరో విశేష పరిణామం. అలస్కా 1867వరకు రష్యా సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. అప్పటి జార్ చక్రవర్తి అలెగ్జాండర్ 2 ఈ ప్రాంతాన్ని ఆర్థిక ఇబ్బందుల దృష్టా అమెరికాకు విక్రయించారు. ప్రస్తుతం అలస్కా భూభాగం విలువ 10 బిలియన్ డాలర్లు (రూ. 8.75 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. బంగారం సహా సహజ వనరులకు లోటులేని అలస్కా ప్రాంతం అమెరికా 49వ రాష్ట్రంగా ఉంటోంది.

అలస్కాతో రష్యాకు విడదీయరాని బంధం ఉంది. భేటీకి నిర్ణయించిన తేదీకి కూడా చెప్పుకోదగిన ప్రాధాన్యం ఉంది. ఆగస్టు 15వ తేదీ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తేదీ కాగా, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు కూడా 1945 ఆగస్టు 15 వ తేదీయే. ఆ తరువాత రెండేళ్లకు భారత్‌కు స్వాతంత్య్రం లభించింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీలో చర్చలు ఫలించి యుద్ధం ఆగిపోతుందని, తద్వారా ఉక్రెయిన్ తోపాటు ఐరోపా దేశాలకు, నాటో కూటమికి భద్రతా ప్రయోజనాలు చేకూరుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ భేటీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మాత్రం ప్రస్తుతం పాల్గొనే అవకాశం కల్పించలేదు. శుక్రవారం నాడు భేటీ తరువాత ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ మొండికేస్తే తీవ్ర పరిణామాలుండవచ్చని ట్రంప్ హెచ్చరికల బట్టి తెలుస్తోంది.

ఈ భేటీ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోపాటు ఇతర ఐరోపా నేతలతో ట్రంప్ వర్చువల్ సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ భేటీ సత్ఫలితాలనిస్తే జెలెన్‌స్కీని కూడా కలుపుకుని మరో సమావేశం నిర్వహించే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించడం గమనార్హం. ఏదేమైనా తదుపరి చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి చోటివ్వాలని ఉక్రెయిన్ మద్దతు ఐరోపా దేశాల అగ్రనేతలు స్పష్టం చేశారు. ఐరోపా, ఉక్రెయిన్ భద్రతా ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ తెలిపారు. శాంతి ఒప్పందం కుదరకపోతే ఐరోపా, అమెరికా కలిసి రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావల్సి ఉంటుందన్నారు. మొత్తం ఉక్రెయిన్‌ను ఆక్రమించగల సామర్థం తమకు ఉందని చూపించే ప్రయత్నం పుతిన్ చేస్తున్నారని జెలెన్‌స్కీ వెల్లడించారు.

అయితే పుతిన్ మాత్రం జెలెన్‌స్కీకి ప్రాధాన్యం ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. రష్యా ఆక్రమించిన భూభాగాన్ని వదులుకోవడానికి జెలెన్‌స్కీ ఏమాత్రం అంగీకరించకపోయినప్పటికీ, ఇరుపక్షాల మేలు కోసం కొన్ని భూభాగాలు వదులు కోవడానికి వీలుగా బలమైన ఒప్పందం కుదురుతుందని ఇటీవలనే ట్రంప్ ప్రకటించడం ఉక్రెయిన్‌కు ఆందోళన కలిగిస్తోంది. అయితే అంతర్జాతీయ సరిహద్దులు సైనికబలంతో మార్పులు కాకూడదన్న ప్రధాన సూత్రానికి తాము కట్టుబడి ఉన్నామని ఐరోపా దేశాల నేతలు ప్రకటించారు. ట్రంప్ ప్రస్తావించే ప్రాదేశిక మార్పిడి ఏమిటన్నది అధికారికంగా వివరాలు లేవు. 2014లో క్రిమియాను ఉక్రెయిన్ ఆక్రమించింది. క్రిమియాతో సహా ఉక్రెయిన్ రీజియన్లు లుహాన్స్, డొనెటిస్క్, ఖెర్సన్, జపోరిఝాఝియా ఇవన్నీ తమవే అని రష్యా వాదిస్తోంది. ఈ రీజియన్లలో డొనెటెస్క్, ఖెర్సన్, జపోరిఝాఝియా లపై 70 శాతం నియంత్రణ రష్యాకే ఉన్నప్పటికీ, అధికారికంగా వాటిని తమకే అప్పగించాలని రష్యా డిమాండ్ చేస్తోంది.

ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్న డొనెట్సోలోని మిగిలిన 30 శాతం భాగాన్ని తమకు అప్పగించాలని పుతిన్ ప్రతిపాదిస్తున్నారు. కానీ జెలెన్‌స్కీ ఆ ప్రాంతాన్ని వదులుకునేది లేదని, అలా చేస్తే భవిష్యత్తులో మాస్కో దాడులకు ఆ ప్రాంతం కీలకంగా మారుతుందని అంటున్నారు. తాము అలస్కాను అమెరికాకు ఇవ్వగా లేనిది, ఉక్రెయిన్ భూభాగం తమకు వదులుకోవచ్చని పుతిన్ వాదిస్తున్నారు. ట్రంప్ మాత్రం ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పానన్న క్రెడిట్ దక్కించుకోవాలని ఒకవైపు, రష్యాతో వాణిజ్యపరంగా లాభదాయకమైన ఒప్పందం కుదుర్చుకోవాలని మరోవైపు ఆరాటపడుతున్నారు. అయితే అగ్రరాజ్యాలు రెండూ లాభదాయకమైన రీతిలో వ్యవహరించి ఉక్రెయిన్‌ను కీలుబొమ్మలా ఆడించవచ్చని, ఫలితంగా ఉక్రెయిన్‌కు భారీ నష్టం కలగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News