మన తెలంగాణ/ క్రీడా విభాగం: అంతర్జాతీయ పురుషుల టెన్నిస్‌లో స్పెయిన్ యువ సంచలనం కార్లొస్ అల్కరాజ్ హవా నడుస్తోంది. తాజాగా జరిగిన యుఎస్ ఓపెన్‌లో అల్కరాజ్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అల్కరాజ్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ కావడం విశేషం. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్‌లలో కార్లొస్ విజేతగా నిలిచాడు. యుఎస్ ఓపెన్ టైటిల్‌లో తిరిగి పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ టెన్నిస్‌లో నాదల్ తర్వాత అంతటి ప్రతిభ ఉన్న ఆటగాడిగా అల్కరాజ్ పేరు తెచ్చుకున్నాడు. కార్లొస్ ఆట నాదల్‌ను గుర్తుకు తెస్తోంది. చివరి వరకు పట్టువీడకుండా పోరాడంలో అల్కరాజ్ ఆరితేరి పోయాడు. దీనికి ఫ్రెంచ్ ఓపెన్‌లో సినర్‌తో జరిగిన పోరులో సాధించిన విజయమే నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రస్తుతం పురుషుల టెన్నిస్‌లో అల్కరాజ్, సినర్ హవా నడుస్తోంది.
రెండేళ్లుగా జరిగిన 8 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఇద్దరు చెరో నాలుగు ట్రోఫీలను గెలుచుకున్నారు. వీరి ఆట ఒకప్పటి చిరకాల ప్రత్యర్థులు నాదల్, ఫెదరర్‌ను గుర్తుకు తెస్తోంది. రెండేళ్లుగా దాదాపు ప్రతి టోర్నమెంట్‌లో వీరిద్దరే తుది పోరుకు చేరుకుంటున్నారు. ఒకటి రెండు టోర్నీల్లో తప్పిస్తే ఇతర ఆటగాళ్లు ఎవరూ కూడా ఫైనల్‌కు చేరలేక పోతున్నారు. దీన్ని బట్టి అల్కరాజ్, సినర్‌ల మధ్య పోరు ఎలా సాగుతుందో ఊహించుకోవచ్చు. ప్రపంచ టెన్నిస్‌లో అల్కరాజ్, సినర్ శకం ప్రారంభమైందని చెప్పాలి. టోర్నీ ఏదైనా ఇద్దరి మధ్యే తుది పోరు జరుగుతోంది. జ్వరేవ్, కచనోవ్, మెద్వెదేవ్, జకోవిచ్ తదితరులు ఉన్నా ఎవరూ కూడా సినర్, అల్కరాజ్‌లకు గట్టి పోటీ ఇవ్వలేక పోతున్నారు. ముఖ్యంగా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సినర్, అల్కరాజ్‌ల మధ్యే పోరు నెలకొంది. ఒక్క ఆస్ట్రేలియా ఓపెన్‌లో తప్పిస్తే మిగిలిన ఏడు గ్రాండ్‌స్లోమ్ టోర్నీల్లో సినర్, కార్లొస్‌లు మాత్రమే ఫైనల్‌కు చేరుకున్నారు.
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో అల్కరాజ్ ఫైనల్‌కు చేరలేకో పోయాడు. అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ) ఈ టోర్నీలో తుది పోరుకు అర్హత సాధించాడు. కానీ ఫైనల్లో సినర్ ధాటికి ఎదురు నిలువలేక పోయాడు. తర్వాత జరిగిన ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్‌లలో సినర్, అల్కరాజ్‌లు ఫైనల్‌కు చేరుకున్నారు. ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్‌లలో అల్కరాజ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. వింబుల్డన్‌లో సినర్ విజేతగా నిలిచాడు. కాగా, యుఎస్ ఓపెన్ టైటిల్‌తో అల్కరాజ్ సింగిల్స్‌లో తిరిగి టాప్ ర్యాంక్‌ణు దక్కించుకున్నాడు. అల్కరాజ్ ఆటను గమనిస్తే ఇకపై పురుషుల టెన్నిస్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. సినర్‌తో పోల్చితే అల్కరాజ్ ఆటలో దూకుడుగా అధికంగా ఉంటుంది. అంతేగాక అల్కరాజ్ ఆటకు చాలా మంది ఫిదా అవుతున్నారు. అతన్ని సరికొత్త నాదల్‌గా అభివర్ణిస్తున్నారు. రానున్న రోజుల్లో పురుషుల టెన్నిస్‌లో అల్కరాజ్ జోరు సాగడం ఖాయమనే చెప్పాలి.