ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో సరికొత్త ప్రత్యర్థులుగా జన్నిక్ సినర్ (ఇటలీ), కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్)లు అవతరించారు. వీరి ఆట దశాబ్దాలపాటు ప్రపంచ టెన్నిస్‌ను శాసించిన రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రఫెల్ నాదల్ (స్పెయిన్), నొవాక్ జకోవిచ్ (సెర్బియా)లను తలపిస్తోంది. కిందటి ఏడాది జరిగిన గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో అల్కరాజ్, సినర్‌లు రెండేసి ట్రోఫీలను గెలుచుకున్నారు. తాజాగా ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సినర్, అల్కరాజ్ చెరో ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను సినర్ గెలుచుకోగా, అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. ఆదివారం ఐదు గంటలకు పైగా సాగిన హోరాహోరీ సమరంలో అల్కరాజ్ విజయం సాధించాడు. సినర్ చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినా రన్నరప్‌తో సరిపెట్టుకోక తప్పలేదు. అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకోవడం కెరీర్లో ఇది రెండోసారి. కిందటి ఏడాది కూడా అతను విజేతగా నిలిచాడు.
ఇక సినర్‌తో జరిగిన ఫైనల్లో ఓటమి అంచుల వరకు వెళ్లిన అల్కరాజ్ అసాధారణ పోరాట పటిమతో టైటిల్‌ను దక్కించుకోవడం ప్రపంచ టెన్నిస్ రంగాన్ని ఆశ్చర్యంలోకి నెట్టింది. అతని ఆట ప్రపంచ టెన్నిస్ దిగ్గజం త్రయం ఆటను గుర్తుకు తెచ్చింది. ఫెదరర్, నాదల్, జకోవిచ్‌లు ఎలా అయితే చివరి వరకు పట్టువీడకుండా పోరాడుతారో అల్కరాజ్ కూడా అలాగే ఆడి ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. ఒక్క గేమ్ ఓడితే చాలు ఓటమి పాలయ్యే స్థితి నుంచి టైటిల్ సాధించే దాకా సాగిన అల్కరాజ్ ఆట తీరును ఎంత పొగిడినా తక్కువే. ప్రపంచ గ్రాండ్‌స్లామ్ చరిత్రలోనే అతని ఆట చిరకాలం తీపి జ్ఞాపకంగా ఉండి పోవడం ఖాయం. సినర్ నోటిదాకా వచ్చిన ట్రోఫీని అల్కరాజ్ లాగేసుకున్న తీరును చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఈ విజయం అల్కరాజ్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తన ఆరాధ్య ఆటగాడు నాదల్‌ను తలపిస్తూ అల్కరాజ్ చేసిన పోరాట పటిమను అభిమానులు ఎప్పటికీ గుర్తించుకుంటారు. గతంలో ఫెదరర్, నాదల్, జకోవిచ్‌ల మధ్య కూడా ఫైనల్లో పోరు ఇలాగే ఉండేది.
తాజాగా సినర్, అల్కరాజ్‌ల మధ్య పోరు కూడా త్రయం ఆటను గుర్తు చేసింది. రానున్న రోజుల్లో సినర్, అల్కరాజ్‌ల మధ్యే గట్టి పోటీ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్లో ఓడినా సినర్ పోరాట పటిమను తక్కువ చేసి చూడలేం. కీలక సమయంలో ఒత్తిడికి గురి కావడం వల్లే అతను ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ఇకపై జరిగే ప్రతి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో కూడా సినర్, అల్కరాజ్‌ల మధ్య పోటీ ఉండే అవకాశాలున్నాయి. కొన్నేళ్లుగా వీరిద్దరూ పురుషుల టెన్నిస్‌లో వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నారు. అల్కరాజ్ ఇప్పటికే ఐదు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు సాధించి సత్తా చాటాడు. సినర్ కూడా అతని వెంటే నిలిచాడు. ఇద్దరు కూడా అద్భుత ఆటతో అభిమానులను కనువిందు చేస్తున్నారు. పురుషుల టెన్నిస్‌లో సినర్, అల్కరాజ్ శకం మొదలైందనే చెప్పాలి.