న్యూయార్క్: ప్రతిష్ఠాత్మకమైన యుఎస్ ఓవన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ యువ సంచలం, రెండో సీడ్ కార్లొస్ అల్కరాజ్ విజేతగా నిలిచాడు. డిఫెండింగ్ ఛాంపియన్, టాప్ సీడ్ జన్నిక్ సినర్ (ఇటలీ)తో జరిగిన ఫైనల్లో అల్కరాజ్ 6-2, 3-6, 61, 6-4తో జయకేతనం ఎగుర వేశాడు. ఈ క్రమంలో వింబుల్డన్ ఓపెన్ ఫైనల్లో సినర్ చేతిలో ఎదురైన పరాజయానికి కార్లొస్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ సీజన్‌లో అల్కరాజ్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ టైటిల్స్‌ను అల్కరాజ్ గెలుచుకోగా, ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్ ట్రోఫీలను సినర్ సొంతం చేసుకున్నాడు. కిందటి సీజన్‌లో కూడా సినర్, అల్కరాజ్‌లు చెరో రెండు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆరంభం నుంచే దూకుడు..
సినర్‌తో జరిగిన తుది సమరంలో అల్కరాజ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. సినర్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాడు. తొలి సెట్‌లో అల్కరాజ్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచాడు. అతని ధాటికి సినర్ కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయాడు. తన మార్క్ షాట్లతో చెలరేగి పోయిన స్పెయిన్ హీరో ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తొలి సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ రెండో సెట్‌లో సినర్ అనూహ్యంగా పుంజుకున్నాడు. అద్భుత పోరాట పటిమతో కార్లొస్ జోరును అడ్డుకున్నాడు. చూడచక్కని షాట్లతో కార్లొస్‌ను హడలెత్తించాడు. తన మార్క్ ఆటతో చెలరేగి పోయిన అగ్రశ్రేణి ఆటగాడు సినర్ ఎలాంటి పోటీ లేకుండానే రెండో సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఆనందం సినర్‌కు ఎక్కువ సేపు నిలువ లేదు. కీలకమైన మూడో సెట్‌లో మళ్లీ అల్కరాజ్ పుంజుకున్నాడు. అద్భుత ఆటతో సినర్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో ఇటలీ స్టార్‌ను హడలెత్తించాడు. మైదానంలో నలుదిక్కులా బంతిని పరిగెత్తించి సినర్‌ను కోలుకోకుండా చేశాడు. అల్కరాజ్ ధాటికి సినర్ పూర్తిగా చేతులత్తేశాడు.
ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయిన అల్కరాజ్ మూడో సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే నాలుగో సెట్‌లో సినర్ కాస్త గట్టి పోటీ ఇచ్చాడు. అల్కరాజ్‌కు దీటైన జవాబిస్తూ ముందుకు సాగాడు. ఇటు అల్కరాజ్ అటు సినర్ ప్రతిపాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. దీంతో పోరు ఆసక్తికరంగా మారింది. కానీ కీలక సమయంలో సినర్ ఒత్తిడికి గురయ్యాడు. ఇదే సమయంలో వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కార్లొస్ సఫలమయ్యాడు. చివరి వరకు నిలకడగా ఆడిన అల్కరాజ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని యుఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా అవతరించాడు. అల్కరాజ్‌కు కెరీర్‌లో ఇది రెండో యుఎస్ ఓపెన్ టైటిల్ కాడడం గమనార్హం. ఓవరాల్‌గా కార్లొస్ తన కెరీర్‌లో ఆరు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలను సాధించాడు. అల్కరాజ్ ఇప్పటి వరకు ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్‌లలో రెండేసి టైటిల్స్‌ను గెలుచుకున్నాడు.
Also Read: ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా నామినేటైన సిరాజ్