మిస్ వరల్డ్ 2025కి సర్వాంగ సుందరంగా హైదరాబాద్ ముస్తాబు
శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అన్ని ప్రధాన కూడళ్లు అలంకరణ
‘తెలంగాణ జరూర్’ ఆనే నినాదం ప్రతి చోటా కనిపించేలా, వినిపించేలా ఏర్పాటు
ఒక్కొక్కరుగా హైదరాబాద్ చేరుకుంటున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు
అడుగడుగునా భద్రత, రాచమర్యాదలతో అధికార యంత్రాంగం అప్రమత్తం
ప్రపంచ అందగత్తెలకు స్వాగతం పలుకుతున్న సెలబ్రెటీలు
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోని అన్ని దేశాల దారులు హైదరాబాద్ వైపే వస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతుండడంతో ఆయా దేశాల నుంచి కంటెస్టెంట్లు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలు దేశాల నుంచి హైదరాబాద్ చేరుకోగా ఒకటి రెండు రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వివిధ దేశాల నుంచి వస్తున్న అందగత్తెలతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ భారీ వేడుక నిర్వహణకు ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు మిస్ వరల్డ్ సంస్థ నిర్వాహకులు విస్త్రత ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని పలు చారిత్రాత్మక ప్రాంతాల్లో ప్రపంచ సుందరీమణులు సందర్శించేందుకు షెడ్యూల్‌ను రూపొందించారు.
దాదాపు 120 దేశాల మిస్ వరల్డ్ భామలను స్వాగతించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీరితో పాటు ఆయా దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు వేల సంఖ్యలో హాజరవుతుండడంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా మిస్ వరల్డ్ భారీ ఈవెంట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రారంభించి వేడుక జరిగే అన్ని ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లోని ముఖ్య ప్రాంతాలు, చారిత్రాత్మక ప్రదేశాల్లో పెద్ద ఎత్తున అలంకరణ చేశారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో, స్వాగత ద్వారాలను, చరిత్ర, సంప్రదాయాన్ని ప్రతిబింభించే ఏర్పాట్లు చేశారు. ఈ పోటీల నిర్వహణకు హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.
వందకు పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు ప్రత్యేకంగా శంషాబాద్ ఎయిర్ పోర్టును తీర్చిదిద్దారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. సోమ, మంగళవారాల్లో విదేశీ ప్రతినిధుల రాక పెరగనుంది. ఇందుకోసం ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యేక లాంజ్‌లతో పాటు, హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ‘తెలంగాణ జరూర్’ ఆనే నినాదం ప్రతి చోటా కనిపించేలా, వినిపించేలా రాష్ట్ర పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ప్రారంభ కార్యక్రమంపై మిస్ వరల్డ్ చైర్ పర్సన్ జూలియా మోర్లీ సన్నాహక, సమన్వయ సమావేశాలను ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
హైదరాబాద్ చేరుకున్న మూడు దేశాల కంటెస్టెంట్లు
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్లు హైదరాబాద్ చేరుకుంటున్నారు. సోమవారం పోర్చుగల్, ఘనా, నమీబియా, ఐర్లాండ్ దేశాలకు చెందిన ప్రతినిధులు శంషాబాద్ చేరుకున్నారు. వీరికి తెలంగాణ సంప్రదాయ లాంఛనాలతో స్వాగతం పలికారు. స్వాగత సత్కారాలతో పాటు, భద్రత, వసతికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేశారు. పోర్చుగల్ కు చెందిన మారియా అమెలియా ఆంటోనియో, ఘనా నుంచి జుట్టా అమా పోకుహా అడ్డో, ఐర్లాండ్ కు చెందిన జాస్మిన్ జెర్హార్డ్‌లు హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్ జన్సెన్ వాన్ రెన్స్ బర్గ్, మిస్ బ్రెజిల్ జెస్సికా స్కేన్ద్రియుజ్య్ పెడ్రోసో, మిస్ వరల్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి, మిస్ కెనడా మిస్ ఎమ్మా డయన్నా క్యాథరీన్ మొర్రిసన్‌లు హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. దాదాపు వంద మంది పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం.
ప్రపంచ అందగత్తెలకు స్వాగతం పలికిన పలువురు సెలబ్రెటీలు
అధికారులు, నిర్వాహకులు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు ప్రపంచ అందగత్తెలను సొంత రాష్ట్రానికి స్వాగతం పలుకుతూ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, బాక్సర్ నిఖత్ జరీన్, సినీ నటి మంచు లక్ష్మి స్పెషల్ వీడియో షేర్ చేసి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అందం, సంస్కృతి, ఐక్యత కలిసే ఈ వేడుకల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలంగాణ టూరిజం, ప్రభుత్వానికి వారు స్పెషల్ విషెస్ తెలిపారు. ప్రపంచ అందగత్తెలు అందరికి స్వాగతం, సుస్వాగతం అంటూ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.